Karimnagar: వినాయకా.. దయుంచయ్యా
ABN , Publish Date - Sep 05 , 2025 | 12:46 AM
కరీంనగర్ కల్చరల్, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నిమజ్జనోత్సవాన్ని నిర్వహించనున్నారు.
- నేడు నిమజ్జనం
- టవర్‌సర్కిల్ వద్ద ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పూజలు
కరీంనగర్ కల్చరల్, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నిమజ్జనోత్సవాన్ని నిర్వహించనున్నారు. తొమ్మిది రోజులు పూజలు అందుకున్న గణనాథడు మేళ తాళాలు, డప్పు వాయిద్యాలు, కోలాటాలు, భజనలు, నృత్యాల మధ్య శోభాయాత్రగా తరలి వెళ్లనున్నాడు. గణపతి బొప్పా మోరియా, గణేశ్ మహరాజ్ కీ జై, జై గణేశా.. జైజై గణేశా అంటూ నినాదాలు చేస్తూ భక్తి ఉత్సాహంతో ప్రజలు శోభాయాత్రలో పాల్గొననున్నారు.
ఫ టవర్‌సర్కిల్ వద్ద పూజలకు ఏర్పాట్లు..
ప్రతి వినాయకుడు టవర్‌సర్కిల్ వద్ద పూజలు అందుకొని నిమజ్జనోత్సవానికి తరలి వెళ్లడం ఆనవాయితీ. హిందూ ఉత్సవ సమితి, వీహెచ్‌పీ ఆధ్వర్యంలో పూజలకు ఏర్పాట్లు చేయగా పాతబజార్ నుంచి వచ్చే ఒకటో నంబర్ వినాయకుడు తొలి పూజలు అందుకోనున్నాడు. మండపాల వద్ద మధ్యాహ్నం 12 గంటల వరకు పూజలు, ఏర్పాట్లు పూర్తి చేసుకొని 5 గంటల వరకు టవర్‌సర్కిల్‌కు వినాయక ప్రతిమలు తరలనున్నాయి.
ఫ ఆనవాయితీకి అర్ధశతాబ్దం...
కరీంనగర్‌లో వినాయక నిమజ్జనోత్సవానికి చెప్పుకోదగిన విశిష్ట స్థానం ఉంది. నగరం నడిబొడ్డున ఉన్న నాటి టవర్ సర్కిల్ ద్వారా అన్ని వినాయక మూర్తులు నిమజ్జనానికి తరలి వెళ్లే ఆనవాయితీకి అర్ధ శతాబ్దానికి పైగా చరిత్ర ఉంది. 52 సంవత్సరాలుగా పాతబజార్ హనుమాన్ ఆలయంలో నెలకొల్పే వినాయకుడికి ఒకటో నంబరు కేటాయించి, ఆ మూర్తికి పూజలు జరిపాకే ఇతర ప్రాంతాల వినాయకులను తరలిస్తారు. తొలి వినాయకుడికి కలెక్టర్ పూజలు నిర్వహిస్తారు. 1984లో వీహెచ్‌పీ హిందూ ఉత్సవ సమితిని ఏర్పాటు చేసింది. ప్రతీ యేటా సమితికి ఓ నూతన అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. నగరమంతా తిరిగి ఉత్సవ కమిటీ నిర్వాహకులను కలసి విగ్రహాలకు నంబర్లు కేటాయిస్తారు. మొదట్లో వందల సంఖ్యలో మాత్రమే వచ్చే వినాయక మూర్తులు, తర్వాత్తర్వాత కాలంలో వేల సంఖ్యకు చేరాయి.
ఫ నిమజ్జనానికి విగ్రహలను త్వరగా తరలించాలి
- కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్.
మానకొండూర్: వినాయక నిమజ్జనానికి విగ్రహాలను త్వరగా తరలించాలని కేంద్ర హోం శాఖ సహయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. మానకొండూర్ చెరువు కట్ట వద్ద జరిగే నిమజ్జన ఏర్పాట్లను ఆయన గురువారం పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో కంటే ఈసారి గణేష్ మండపాల సంఖ్య పెరిగిందన్నారు. చిన్న పిల్లలు కూడా గల్లి గల్లికో గణేష్ మండపాన్ని ఏర్పాటు చేసుకుని ఉత్సవాలను నిర్వహించడం సంతోషదాయకమన్నారు. నిమజ్జన కేంద్రంలో అన్ని ఏర్పాట్లు చేసి అధికారులందరూ సమన్వయంతో పని చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ మేయర్ వై. సునీల్‌రావు, ఆర్డీవో మహేశ్వర్, ఏసీపీ విజయ్‌కుమార్, తహసీల్దార్ విజయ్‌కుమార్, ఎంపీడీవో వరలక్ష్మి పాల్గొన్నారు.
ఫ వినాయక నిమజ్జనోత్సవానికి విస్తృత ఏర్పాట్లు
కరీంనగర్ టౌన్: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో మానకొండూర్, కొత్తపల్లి చెరువులతోపాటు చింతకుంట ఎస్సారెస్పీ కెనాల్‌లో నీరు అధికంగా ఉండడంతో ఎలాంటి సంఘటనలు జరగకుండా రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్, పోలీస్ కమిషనర్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గురువారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, స్థానిక ఎంపీ బండి సంజయ్ కుమార్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధికారులు, పార్టీ శ్రేణులతో కలిసి నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. నగరపాలక సంస్థ సిబ్బంది, కార్మికులు నిమజ్జన ప్రాంతాల్లో నిర్వాహకులకు సేవలందించే విధంగా ఏర్పాట్లు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి శోభాయాత్ర, గణేష్ నిమజ్జనోత్సవం కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.
- మానకొండూర్ : మానకొండూర్ పెద్ద చెరువులో శుక్రవారం జరిగే గణేష్ నిమజ్జనానికి అఽధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. చెరువు కట్టపై విద్యుత్ స్తంభాలు, ఇరువైపులా బారికేడ్లు అమర్చారు. విఠలేశ్వర ఆలయం ఎదుట గుంతలు ఉండడంతో మట్టితో చదను చేశారు. కరీంనగర్- వరంగల్ ప్రధాన రహదారి పక్కన ఉన్న చెట్ల కొమ్మలను నరికివేశారు. అగ్నిమాపక వాహనం, గజ ఈతగాళ్లు, రెస్క్యూటీం అందుబాటులో ఉంటుంది. కరీంనగర్ నుంచి వచ్చే వాహనాలు యథావిధిగా, వరంగల్ నుంచి వచ్చే వాహనాలను మండలంలోని ముంజంపల్లి, తిమ్మాపూర్, ఎల్‌ఎండీ, అల్గునూర్ నుంచి కరీంనగర్‌కు మళ్లిస్తారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మానకొండూర్ సీఐ సంజీవ్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహిస్తారు. మానకొండూర్ తహసీల్దార్ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో భక్తులకు మంచినీరు, అన్న ప్రసాద వితరణ చేస్తారు. మానకొండూర్ పీహెచ్‌సీ ఆధ్వర్యంలో మూడు షిఫ్టుల వైద్య సదుపాయం అందుబాటులో ఉంటుంది.