karimnagar : అగ్ని ప్రమాదాల నివారణకు..
ABN , Publish Date - Aug 23 , 2025 | 01:17 AM
కరీంనగర్ క్రైం, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): అగ్ని ప్రమాదాల నియంత్రణ చర్యలపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు.
- ‘ఫైర్ అవేర్‌నెస్’ పేరిట అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు
- ప్రతీ శుక్రవారం నిర్వహణ
- విద్యాసంస్థలు, ఆస్పత్రులు, థియేటర్లు, పెట్రోల్‌బంకుల్లో డెమోలు
- విద్యార్థులకు శిక్షణ తరగతులు
కరీంనగర్ క్రైం, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): అగ్ని ప్రమాదాల నియంత్రణ చర్యలపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ఇందులో భాగంగా కలెక్టర్ పమేలా సత్పతి సూచనల మేరకు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ప్రతీ శుక్రవారం ‘ఫైర్ అవేర్‌నెస్’ పేరిట సదస్సులను నిర్వహిస్తున్నారు. ప్రాణ, ఆస్తి నష్టం నియంత్రణతోపాటు ప్రమాదాలు జరగకుండా ముందస్తు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలను వివరిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా వందకుపైగా అవగాహన సదస్సులు, శిక్షణ తరగతులు నిర్వహించారు. ప్రమాదం జరిగిన తరువాత చర్యలకంటే ముందుగా జాగ్రత్తపడడం ముఖ్యమనే నినాదంతో కార్యక్రమాలను చేపడుతున్నారు.
ఫ జిల్లాలో ఏటా ప్రమాదాలు
కరీంనగర్ జిల్లాలో ప్రతీ ఏడాది చిన్నాపెద్ద కలిపి 300 నుంచి 350 వరకు అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో 2 కోట్ల రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లుతోంది. మరో 20 నుంచి 30 కోట్ల ఆస్థులను అగ్నిమాపకశాఖ సిబ్బంది కాపాడుతున్నారు.
ఫ డెమోల ద్వారా అవగాహన
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, ఆస్పత్రులు పెట్రోల్‌బంకులు, గ్యాస్ గోదాములు, సూపర్‌మార్కెట్‌లు, మాల్‌లు, అపార్ట్‌మెంట్‌లు, థియేటర్లు, రైస్‌మిల్లులు, పరిశ్రమల్లో సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నారు. ప్రమాదాలు జరుగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జరిగిన వెంటనే ఏ విధమైన రక్షణ చర్యలు పాటించాలి? అనే అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తో పాటు, డెమోలను నిర్వహిస్తున్నారు. పాఠశాలు, కళాశాలల్లో విద్యార్థులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రమాదాల సమయంలో ఏ విధంగా స్పందించాలనే అంశంపై బేసిక్ శిక్షణ ఇస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందించడం, మంటలను అదుపుచేయడం, ఆస్తులను రక్షించడం, అంబులెన్స్, ఫైర్, పోలీసులకు సరైన సమయంలో సమాచారం అందించడం, లొకేషన్ షేర్ చేయడం వంటి అంశాలపై వివరిస్తున్నారు.
ఫ అగ్నిమాపక పరికరాల వినియోగంపై శిక్షణ
అగ్నిప్రమాదాలు ఎలా సంభవిస్తాయి? అగ్ని వ్యాపించడాన్ని ఎలా నివారించాలి? అనే అంశాలను వివరించడంతోపాటు పరికరాల వినియోగంపై శిక్షణ ఇస్తున్నారు. ఫైర్ ఎక్స్‌టింగ్విషర్‌ల వాడకంపై ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ లీకేజీతో మంటలు అంటుకుంటే ఆర్పడంపై డెమో ద్వారా వివరిస్తున్నారు. వీటితోపాటు ప్రమాద సమయంలో భయపడకుండా చురుగ్గా ఎలా స్పందించాలి? ఇతరులను ఎలా సురక్షితంగా బయటికి తరలించాలి? ప్రాథమిక చికిత్స, సహాయ చర్యలపై సూచనలు అందిస్తున్నారు. ముఖ్యంగా మాక్ డ్రిల్ ద్వారా అవగాహన కల్పించడం ప్రమాదాల నియంత్రణకు తోడ్పడనుంది.
ఫ అగ్ని ప్రమాదం జరుగకుండా చూడడమే ముఖ్యం
- ఎం.శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి
అగ్ని ప్రమాదం జరిగిన తరువాత చర్యలకంటే ముందుగా తీసుకునే ప్రాథమిక జాగ్రత్తలే ముఖ్యం. గ్యాస్ లీకేజీ, షార్ట్ సర్క్యూట్‌తో మంటలు, వాహనాల్లో మంటలు, చెత్తకు మంటలు అంటుకోవడం వంటివాటిని చిన్నచిన్న జాగ్రత్తలతో నివారించవచ్చు. ప్రమాదం సంభవించిన సమయంలో ధైర్యంగా నష్ట నివారణకు ఉపక్రమించాలి. అగ్నిమాపకశాఖ, పోలీసులకు సమాచారం అందించాలి. లోకేషన్ షేర్ చేయాలి. జిల్లా వ్యాప్తంగా ప్రతీ శుక్రవారం ఒకటి లేదా రెండు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. విద్యార్థులకు స్వీయరక్షణతోపాటు ఇతరులను రక్షించడంపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం.