Share News

Karimnagar: స్థానిక ఎన్నికలకు పటిష్ట భద్రత

ABN , Publish Date - Dec 05 , 2025 | 11:41 PM

కరీంనగర్‌ క్రైం, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికలకు పట్టిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నామని సీపీ గౌస్‌ఆలం అన్నారు.

 Karimnagar:  స్థానిక ఎన్నికలకు పటిష్ట భద్రత

- జిల్లాలో 104 రూట్లలో 57 క్లస్టర్లు

- 309 మంది గ్రామ పోలీసు అధికారులకు బాధ్యతలు

- సీపీ గౌస్‌ ఆలం

కరీంనగర్‌ క్రైం, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికలకు పట్టిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నామని సీపీ గౌస్‌ఆలం అన్నారు. శుక్రవారం జిల్లాలోని పోలీస్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా అధికారులు చేయవలసిన, చేయకూడని పనులపై చిన్న హ్యాండ్‌బుక్‌లెట్‌ను తయారు చేసి అందరికీ అందజేస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్‌ రూరల్‌, హుజురాబాద్‌ డివిజన్లలోని 15 పోలీసు స్టేషన్ల పరిధిని పోలింగ్‌ కేంద్రాలకు అనుగుణంగా విభజించామన్నారు. 104 రూట్లు, 57 క్లస్టర్లుగా విభజించి, క్లస్టర్‌ ఇన్‌చార్జిలుగా 83 మంది అధికారులుగా బాధ్యతలు అప్పగించామని తెలిపారు. గ్రామ పోలీసు అధికారులుగా క్షేత్రస్థాయిలో అన్ని గ్రామాలు కవర్‌ అయ్యేలా మొత్తం 309 మందిని నియమించామని చెప్పారు. ఎన్నికల ప్రారంభమయ్యేవరకు క్షేత్రస్థాయిలో 508 మంది పోలీసు అధికారులు నిరంతరంగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పర్యవేక్షణ బాధ్యతలను ఉన్నతాధికారులకు అప్పగించామన్నారు. ఇద్దరు ఏసీపీ స్థాయి అధికారులు పూర్తిస్థాయి పర్యవేక్షణ చేస్తారని, నలుగురు సీఐలు, 25 మంది ఎస్‌ఐలు క్షేత్రస్థాయి పర్యవేక్షించనున్నట్లు సీపీ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఉండేందుకు, కమిషనరేట్‌ పరిధిలోని రౌడీ షీటర్లను బైండోవర్‌ చేశామని సీపీ తెలిపారు. వారి కదలికలపై నిరంతరం నిఘా ఉంచేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసేందుకు ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పోలీసు అధికారులకు పూర్తిగా సహకరించాలని సీపీ గౌస్‌ ఆలం విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఏసీపీలు శ్రీనివాస్‌ జి, వేణుగోపాల్‌, వాసాల సతీష్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 05 , 2025 | 11:41 PM