Karimnagar: నిమజ్జనం కోసం పటిష్ట భద్రత
ABN , Publish Date - Sep 06 , 2025 | 12:19 AM
కరీంనగర్ క్రైం, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
- శోభాయాత్ర సాగే ప్రాంతాల్లో రూఫ్‌టాప్ సెక్యూరిటీ
- 850 సీసీ కెమెరాలు.. 867 మంది పోలీసులు
కరీంనగర్ క్రైం, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం కోసం దాదాపు 867 మంది పోలీసు అధికారులు, సిబ్బంది, ఎన్‌ఎస్‌ఎస్ కేడెట్‌లు, వలంటీర్లను విధుల్లో నియమించారు. ఈ బందోబస్తులో ఇద్దరు అడిషనల్ డీసీపీలు, ఐదుగురు ఏసీపీలు, 20 మంది ఇన్‌స్పెక్టర్లు, 40 మంది ఎస్‌ఐలు, 350 మంది కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్‌ఐలు, 100 మంది హోంగార్డులు, 150 మంది ఎన్‌ఎస్‌ఎస్ క్యాడెట్‌లు, 200 మంది వలంటీర్లు పాల్గొంటున్నారు. నగరంలోని సున్నితమైన ప్రాంతాల్లో పటిష్ట భద్రతతో పాటు, రూఫ్‌టాప్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. నిఘా కోసం ఇప్పటికే మున్సిపల్ శాఖ ఏరాఁటు చేసిన 750 సీసీ కెమెరాలతో పాటు, పోలీస్ శాఖ అదనంగా 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఈ కెమెరాల దృశ్యాలను నిరంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేస్తూ అక్కడి సిబ్బందికి ఆదేశాలు, సూచనలు జారీ చేయనున్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి, నిమజ్జన ప్రాంతాల్లో అగ్నిమాపక శాఖ ఈతగాళ్లను, లైఫ్ జాకెట్స్, లైఫ్ బోయ్స్, మొబైల్ బైక్‌లతో సిద్ధం చేశారు. వైద్య అధికారులు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూసేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది మార్గమధ్యలో అందుబాటులో ఉంటారు.
ఫ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం అస్త్ర కన్వెన్షన్ హాలులో పోలీసు అధికారులకు నిర్వహించిన బ్రీఫింగ్‌లో పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు విధులు కేటాయించిన సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు (విద్యుత్, వైద్య, అగ్నిమాపక, మున్సిపల్) సమన్వయంతో పనిచేయాలని సీపీ సూచించారు.