karimnagar : ఉప్పొంగిన వాగులు, వంకలు
ABN , Publish Date - Sep 13 , 2025 | 01:07 AM
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్) జిల్లాలోని పలు మండలాల్లో గురువారం రాత్రి భారీవర్షం కురిసింది. వాగులు ఉప్పొంగాయి, చెరువులు మత్తడి దూకాయి.
- పలు చోట్ల భారీ వర్షం
- హుజూరాబాద్, చిగురుమామిడిలో అత్యధిక వర్షపాతం
- ఎల్‌ఎండీ నుంచి 30వేల క్యూసెక్కుల నీటి విడుదల
- మరో మూడురోజుల పాటు భారీ వర్ష సూచన
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
జిల్లాలోని పలు మండలాల్లో గురువారం రాత్రి భారీవర్షం కురిసింది. వాగులు ఉప్పొంగాయి, చెరువులు మత్తడి దూకాయి. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత ఇవే పెద్ద వర్షాలు కావడంతో ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. హుజురాబాద్, జమ్మికుంట, సైదాపూర్, శంకరపట్నం, చిగురుమామిడి మండలాల్లో భారీగా కురిసిన వానలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగి చెరువులు అలుగు పారాయి. హుజురాబాద్ పట్టణంలోని గాంధీనగర్, బుడగజంగం కాలనీ, మామిండ్ల వాడలో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక, సరిపోక రోడ్లమీద వర్షపునీరు వరదలా పారింది. జమ్మికుంటలో 179.00 మి.మీ. వర్షం కురిసి హౌసింగ్ బోర్డుకాలనీ పూర్తిగా జలమయమైంది. సైదాపూర్ మండలంలో 149 మి.మీ. వర్షపాతం నమోదై పంట పొలాలు నీటి మునిగాయి. సైదాపూర్ మండలంలో సోమారం వాగు ఉధృతంగా ప్రవహించడంతో మోడల్ స్కూల్ వసతిగృహం చుట్టూ వరదనీరు చేరింది. నీరు లోలెవల్ వంతెనపై నుంచి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. శంకరపట్నం మండలంలో కురిసిన భారీ వర్షంతో అర్కండ్ల గ్రామ లెవల్ బ్రిడ్జిపై ఉధృతంగా నీరు ప్రవహించి రాకపోకలు నిలిచిపోయాయి. వీణవంక మండలం నర్సింగాపూర్, కనపర్తి గ్రామాల్లో పలు ఇళ్లలోకి వర్షపునీరు చేరింది. ఇల్లందకుంట మండలంలో 82.4 మి.మీ. వర్షం కురిసింది. హుజురాబాద్, సైదాపూర్ మండలాల్లో పలు చెరువులు, కుంటలు మత్తడిదూకాయి. చిగురుమామిడి మండలంలో ఉరుములు,మెరుపులతో విద్యుత్ ట్రాన్స్‌పార్మర్లు కాలిపోయాయి. ఇందుర్తి రేణుకాఎల్లమ్మ వాగు పొంగిపొర్లడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. తిమ్మాపూర్ మండలం పోరండ్ల, మన్నెంపల్లి గ్రామాల మఽధ్య కల్వర్టుపై, జుగుండ్ల రామ్‌హనుమాన్‌నగర్ గ్రామాల మధ్య కల్వర్టుపై నుంచి వరద నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. లోయర్ మానేరు డ్యామ్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో 10 గేట్లు ఎత్తి 30వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలారు. ఎల్‌ఎండి పూర్తి నీటి సామర్థ్యం 24.030 టీఎంసీలు కాగా ప్రస్తుతం 23.558 టీఎంసీల నీరు చేరుకుంది. మానేరు నది నుంచి 23,745 క్యూసెక్కుల నీటిని వరదనీరు, మిడ్‌మానేరు నుంచి 6వేల క్యూసెక్కుల నీరు వస్తుండడంతో 30వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదిలేస్తున్నారు. వరద ప్రవాహం పెరిగితే ఇంకా నీటిని వదలడం పెంచే అవకాశముంది.
హుజురాబాద్ డివిజన్‌లో అత్యధికం...
హుజురాబాద్ డివిజన్‌లో అత్యధికంగా 221.5 మి.మీ. వర్షం కురిసింది. చిగురుమామిడి మండలంలో 215.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. శంకరపట్నంలో 106.1 మి.మీ, సైదాపూర్ మండలంలో 149.2 మి.మీ. వర్షం కురిసింది. రాష్ట్రంలో అత్యధికంగా వర్షపాతం నమోదైన30 ప్రాంతాల్లో హుజూరాబాద్ మండలం బోర్నపల్లిలో 197.8 మి.మీ, ఇందుర్తిలో 211.3 మి.మీ, చిగురుమామిడి మండల కేంద్రంలో 164.0మి.మీ, సైదాపూర్ మండలం వేన్కేపల్లిలో 108.0.మి.మీ, శంకరపట్నం మండలం తాడికల్‌లో 104.5 మి.మీ. వర్షం పడింది. వాతావరణశాఖ హెచ్చరికల మేరకు మరో మూడు రోజులపాటు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్నది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.
03ఎస్‌వైపీ12) సైదాపూర్ మోడల్‌స్కూల్‌లో చిక్కుపోయిన విద్యార్థినిలను బయటకు తీసుకువస్తున్న స్థానికులు
ఫ సైదాపూర్ మోడల్ స్కూల్ జలమయం
సైదాపూర్ : సైదాపూర్ మోడల్ స్కూల్ సోమారం గ్రామ శివారు లోతట్టు ప్రాంతంలో ఉండడంతో గురువారం రాత్రి కురిసిన వర్షానికి వాగు పొంగి వరద నీరు మోడల్‌స్కూల్ చుట్టూ చేరింది. వసతిగృహంలో 32 మంది విద్యార్థినిలు, ముగ్గురు సిబ్బంది చిక్కుక పోయారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రాత్రివేళ భయబ్రాంతులకు గురయ్యారు. శుక్రవారం ఉదయం స్థానికులు విద్యార్థినిలును సురక్షితంగా బయటకు తీసుకరావడంతో అందురూ ఊపిరి పీల్చుకున్నారు.
1 ఎంఎన్‌కె 12
పోటోరైటప్ :
1 ఎంఎన్‌కె 12, ఎల్‌ఎండి 10గేట్ల ద్వారా దిగువకు వదిలిన అధికారులు. (పోటోలు: షుకూర్ వద్ద ఉన్నాయి సారు)
ఫ ఎల్‌ఎండీ 10గేట్లు ఎత్తివేత
తిమ్మాపూర్ (మానకొండూర్) : రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కరీంనగర్‌లోని దిగువ మానేరు జలాశయం నిండుకుండలా మారింది. జలాశయంలోకి భారీ ఇన్‌ఫ్లో వస్తుండటంతో శుక్రవారం మధ్యాహ్నం 12గంటల వరకు 10 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ఎల్‌ఎండీ పూర్తి సామర్థ్యం 24.034 టీఎంసీలకు ప్రస్తుతం 23,301 టీఎంసీలకు చేరింది. మోయతుమ్మెద వాగు నుంచి 23,745 క్యూసెక్కులు, మిడ్‌మానేరు నుంచి 6,000 క్యూసెక్కులు మొత్తం 29,745 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. 10గేట్ల ద్వారా 36,000వేల క్యూసెక్కులు వదులుతున్నారు. రాత్రి వరకు ఇన్‌ఫ్లో పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తివేసే అవకాశం ఉన్నది.