karimnagar : స్థానిక ఎన్నికల దిశగా అడుగులు
ABN , Publish Date - Sep 01 , 2025 | 01:09 AM
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్) గ్రామ పంచాయతీల ఎన్నికలకే కాకుండా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్నది.
- 2న పంచాయతీల ఓటర్ల తుది జాబితా వెల్లడి
- ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ కేంద్రాల ఖరారుకు షెడ్యూల్
- 6న ప్రతిపాదిత పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటన
- 8న జిల్లా, మండల స్థాయిల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం
- 6 నుంచి 8 వరకు అభ్యంతరాల స్వీకరణ
- 9న అభ్యంతరాల పరిష్కారం
- 10న పోలింగ్ కేంద్రాల తుది ప్రకటన
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
గ్రామ పంచాయతీల ఎన్నికలకే కాకుండా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్నది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నది. గ్రామ పంచాయతీల వారీగా ఫొటోలతో కూడిన ఓటరు తుది జాబితాలను సెప్టెంబరు 2న పంచాయతీల్లో, మండల పరిషత్‌లలో ప్రకటించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ మేరకు షెడ్యూల్‌ను విడుదల చేసి ముసాయిదా జాబితాను ప్రకటించి అభ్యంతరాలను స్వీకరించింది. అలాగే రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించారు.
ఫ పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఒకే ఓటరు జాబితా
పంచాయతీల ఓటరు జాబితాలను మంగళవారం ప్రకటిస్తారు. గ్రామ పంచాయతీలకే కాకుండా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కూడా ఈ ఓటరు జాబితాలే వర్తిస్తాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాలను ఖరారు చేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 30న షెడ్యూల్ జారీ చేసింది. సెప్టెంబరు 6న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను ఎంపీడీవోలు మండల కార్యాలయాల్లో ప్రకటించాలని ఆ షెడ్యూల్‌లో పేర్కొన్నారు. 6 నుంచి 8 వరకు ఈ కేంద్రాల విషయంలో ప్రజలు, పార్టీల ప్రతినిధుల అభ్యంతరాలను స్వీకరించేందుకు గడువు ఇచ్చారు. 8న జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈ విషయమై సమావేశాన్ని ఏర్పాటు చేయాలని షెడ్యూల్‌లో పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల విషయంలో ఏవైనా అభ్యంతరాలు వస్తే 9న వాటిని పరిష్కరిస్తారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించే పోలింగ్ కేంద్రాలను ఖరారు చేసి తుది జాబితాను జిల్లా ఎన్నికల అథారిటీ సెప్టెంబరు 10న ప్రకటిస్తుంది.
ఫ బీసీ రిజర్వేషన్లు అమలయ్యేనా?
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. కేబినెట్ ఈ మేరకు ఒక ఆర్డినెన్స్‌ను చేసి గవర్నర్‌కు పంపించగా ఆయన దానిని రాష్ట్రపతి పరిశీలనకు పంపించారు. దీంతో ఈ విషయం ఇప్పుడిప్పుడే తేలేలా లేదు. ఈ కారణంగా స్థానిక ఎన్నికలు వాయిదా పడతాయని ప్రజలు భావించారు. సెప్టెంబరు చివరిలోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ రిజర్వేషన్ల వ్యవహారం ఎటూ తేలకపోవడంతో ఎన్నికల విషయంలో జరుగుతాయో లేవో అన్న అనుమానాలు తలెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తూ వెళ్తున్నది. అధికారంలో ఉన్న పార్టీగా తమ పార్టీలో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ అభ్యర్థులను ఖరారు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. మరోవైపు రాష్ట్ర శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి రిజర్వేషన్లపై ఏకగ్రీవ తీర్మాణాన్ని ఆమోదించి పంపించింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా తన పని తాను చేసుకుంటూ పోతున్నది. ఇప్పటికే తుది ఎన్నికల జాబితా ప్రకటనకు రంగం సిద్ధం చేసిన కమిషన్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కూడా పోలింగ్ కేంద్రాల ఖరారుకు షెడ్యూల్ ప్రకటించింది. దీంతో పంచాయతీ ఎన్నికలు ఆ వెనువెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.