Share News

Karimnagar: వరదలతో ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Aug 14 , 2025 | 11:50 PM

కరీంనగర్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : వర్షాల వల్ల ఎక్కడా ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.

Karimnagar: వరదలతో ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి

వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ పమేలా సత్పతి, అధికారులు

- వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కరీంనగర్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : వర్షాల వల్ల ఎక్కడా ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌ సచివాలయం నుంచి భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యూరియా నిల్వలపై గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ రెండు రోజులుగా కురుస్తున్న వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారన్నారు. ప్రజలకు ఎక్కడ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. వరద సహాయక చర్యలు చేపట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలకు ముందస్తుగా కోటి రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందని, అవసరమైతే మరిన్ని నిధులు కూడా విడుదల చేస్తామని అన్నారు. వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం అందించేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని అన్నారు. వరద సహాయక చర్యల్లో పోలీసు యంత్రాంగం సహకారం పూర్తిస్థాయిలో తీసుకోవాలన్నారు. సీఎస్‌ కె రామకృష్ణారావు మాట్లాడుతూ.. వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, జిల్లాలో అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ల వద్ద ఉన్న డిజాస్టర్‌ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సీఎస్‌ సూచించారు. వరద అంచనా వేస్తూ, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా అధికారులు పనిచేయాలని సీఎస్‌ ఆదేశాలు జారీ చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాఖడే, లక్ష్మికిరణ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 14 , 2025 | 11:50 PM