Karimnagar: నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Sep 05 , 2025 | 12:47 AM
కరీంనగర్ క్రైం, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం సూచించారు.
- అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి
- పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం
కరీంనగర్ క్రైం, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం సూచించారు. గురువారం హుజూరాబాద్ ఏసీపీ కార్యాలయంలో పోలీస్, విద్యుత్, వైద్య, మున్సిపల్, అగ్నిమాపకశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నిమజ్జన ప్రదేశాల్లో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని, ముఖ్యంగా బారికేడ్లు, సరైన లైటింగ్, క్రేన్లు, అదనపు డ్రైవర్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే సహాయం అందించేందుకు ఈతగాళ్లను, లైఫ్ జాకెట్స్‌తోపాటు మొబైల్ బైక్‌లను ఫైర్ అధికారులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. నిమజ్జన ప్రదేశాల్లో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులకు సూచించారు. ఊరేగింపు జరిగే మార్గాల్లో, నిమజ్జనం పూర్తయ్యే వరకు విద్యుత్‌శాఖ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండి విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని తెలిపారు.
ఫ హుజూరాబాద్/జమ్మికుంట రూరల్, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): వినాయక నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సీపీ గౌస్ ఆలం అధికారులకు సూచించారు. హుజూరాబాద్ పట్టణంలోని ఎస్సారెస్పీ కెనాల్, జమ్మికుంట పట్టణంలోని నాయిని చెరువులను గురువారం సీపీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణపతి మండపాల నిర్వాహకులను త్వరగా వినాయ నిమజ్జనానికి తరలించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నిమజ్జనం జరిగే స్థలంలో అగ్నిమాపక సిబ్బందితోపాటు అత్యవసర చికిత్సలు అందించేందుకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా అధికారులు ముందస్తు ప్రణాళికతో చర్యలు తీసకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఏసీపీ శ్రీనివాస్‌జీ, సీఐలు కరుణాకర్, వెంకట్, రామకృష్ణ, లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్లు సమ్మయ్య, మహ్మద్ అయాజ్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, విద్యుత్ ఏఈ శ్రీనివాస్, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్, వైద్యాధికారి జరీనా, ఇరిగేషన్ ఏఈ కీర్తి, జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, జమ్మికుంట సింగిల్ విండో చైర్మన్ పొనగంటి సంపత్ పాల్గొన్నారు.
ఫ చొప్పదండి: గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని సీపీ గౌస్ ఆలం అన్నారు. గురువారం చొప్పదండిలో గణేశ్ నిమజ్జనం ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిమజ్జనం సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యుత్, రెవెన్యూ, మున్సిపల్, ఆరోగ్యశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో సీఐ ప్రదీప్ కుమార్, ఎస్‌ఐ నరేష్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నాగరాజు, అధికారులు పాల్గొన్నారు.