Share News

Karimnagar: రైతులకు అండగా నిలవండి

ABN , Publish Date - Nov 11 , 2025 | 12:14 AM

కరీంనగర్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): తుఫాన్‌ ప్రభావంతో నష్టపోయిన రైతులకు అండగా నిలవాలని రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు కలెక్టర్లను ఆదేశించారు.

 Karimnagar:   రైతులకు అండగా నిలవండి

- ఇబ్బందులు రాకుండా ధాన్యం కొనుగోలు చేయాలి

- ధాన్యం డబ్బులు వెంటవెంటనే రైతుల ఖాతాల్లో జమచేయాలి

- మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు

కరీంనగర్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): తుఫాన్‌ ప్రభావంతో నష్టపోయిన రైతులకు అండగా నిలవాలని రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ధాన్యం కొనుగోళ్లు, తుఫాన్‌ ప్రభావంతో నష్టపోయిన రైతులకు అండగా ఉండడం, కొనుగోలు కేంద్రాల్లో వసతులకల్పన, ఇతర అంశాలపై కలెక్టర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ తుఫానుతో నష్టపోయిన రైతులకు అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వరి, పత్తి, మొక్కజొన్న, సోయా పంటలకు తేమ శాతాన్ని తగ్గించుకొని రాష్ట్రప్రభుత్వం మద్దతు ధరను పొందాలని రైతులకు సూచించారు. ధాన్యాన్ని వెంటవెంటనే కొనుగోలు చేసి డబ్బులను 48 గంటల్లో వారి ఖాతాల్లో జమచేయాలని ఆదేశించారు. తరచూ కొనుగోలు కేంద్రాలను కలెక్టర్లు, అధికారులు సందర్శించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన టార్పాలిన్లు, గోనె సంచులు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.

ఫ ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు: కలెక్టర్‌

ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ పమేలా సత్పతి హెచ్చరించారు. సోమవారం కలెక్టర్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 325 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, వీటిలో అన్ని వసతులు ఉండేలా చూడాలన్నారు. టార్పాలిన్లు, గోనె సంచులు, తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. వర్షాలు కురిస్తే అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు నష్టం జరుగకుండా చూసుకోవలసిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ లక్ష్మికిరణ్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగారావు, జిల్లా మేనేజర్‌ రజనీకాంత్‌, వ్యవసాయశాఖ అధికారి భాగ్యలక్ష్మి, డీఆర్‌డీవో శ్రీధర్‌, సహకారశాఖ అధికారి రామానుజాచార్యులు పాల్గొన్నారు.

Updated Date - Nov 11 , 2025 | 12:14 AM