Share News

karimnagar : స్మార్ట్‌ పోలీస్‌

ABN , Publish Date - Jun 13 , 2025 | 12:58 AM

కరీంనగర్‌ క్రైం, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌లో స్మార్ట్‌ పోలీసింగ్‌ అమలు చేస్తున్నారు. కరీంనగర్‌ సిటీ పోలీసుల చేతిలో అత్యధునికమైన గాడ్జెట్స్‌ దర్శనిమిస్తున్నాయి. కాలానికికనుగుణంగా అధునాతన పరికరాలు ఉపయోగిస్తున్నారు.

karimnagar :  స్మార్ట్‌ పోలీస్‌

ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ప్రత్యేక డిజిటల్‌ పరికరాలు

అధికారి నుంచి సిబ్బంది వరకు ట్యాబ్‌ల వినియోగం

డ్రంకెన్‌డ్రైవ్‌, సౌండ్‌పొల్యూషన్‌ తనిఖీలకు అధునాతన పరికరాలు

కరీంనగర్‌ క్రైం, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌లో స్మార్ట్‌ పోలీసింగ్‌ అమలు చేస్తున్నారు. కరీంనగర్‌ సిటీ పోలీసుల చేతిలో అత్యధునికమైన గాడ్జెట్స్‌ దర్శనిమిస్తున్నాయి. కాలానికికనుగుణంగా అధునాతన పరికరాలు ఉపయోగిస్తున్నారు. వాహనాలకు ఉపయోగించే బ్లాక్‌ ఫిల్మ్‌ను పరీక్షించే టింట్‌ మీటర్లు, బైక్‌ల సౌండ్‌ పొల్యూషన్‌ను పరీక్షించే నాయిస్‌ సౌండ్‌ లెవల్‌ మీటర్‌, మద్యం పేవించిన వాహనదారులను పట్టుకునేందుకు డిజిటల్‌ బ్రీత్‌ఎనలైజర్‌, వేలిముద్రలతో పాత నేరస్థులను పట్టుకునేందుకు ఫింగర్‌ ప్రింట్‌ డివైజ్‌లు ఉపయోగిస్తున్నారు. పోలీసులు విధుల్లో ఉండగా జరిగే ఘటనలు వీడియో రికార్డు చేసేందుకు బాడీ వార్మ్‌ కెమెరాలు, ఈ- చలాన్‌, ఈ-పెట్టీకేసులు నమోదుకు ట్యాబ్‌లు, ఐ ప్యాడ్‌లు, షీటీంలకు బటన్‌ కెమెరాలు వాడుతున్నారు. ర్యాలీలు, ఆందోళనల సందర్భంలో భద్రతా చర్యలు, పర్యవేక్షణకు డ్రోన్‌ కెమెరాలు ఉపయోగిస్తున్నారు. కమిషనరేట్‌లో అధికారుల నుంచి సిబ్బంది వరకు ట్యాబ్‌లు వినియోగిస్తున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డ్రైవ్‌ సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన వారి ఫోటోలు తీసి ట్యాబ్‌ ద్వారా ఈ పెట్టీ కేసులు నమోదు చేసి చలాన్లు విధిస్తున్నారు.

బాడీ వార్మ్‌ కెమెరాలు...

ట్రాఫిక్‌ పోలీసులు విధి నిర్వహణ సందర్భంగా బాడీ వార్మ్‌ కెమెరాలు ధరిస్తున్నారు. ట్రాఫిక్‌ విధుల సందర్భంగా ఎవరైనా అనుచితంగా ప్రవర్తించడం, దురుసుగా మాట్లాడటం లాంటి చర్యలకు పాల్పడే సందర్భంలో ఆ సన్నివేశాలను ఈ బాడీ వార్మ్‌ కెమెరాలు చిత్రీకరిస్తాయి. సదరు వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం కోసం సాక్ష్యాదారాలుగా పని చేస్తాయి.

స్పీడ్‌ హంటర్‌...

ఈ పరికరం వాహనాల వేగాన్ని ఇట్టే పసిగట్టి ఫొటోలు తీస్తుంది. ఒక రోడ్డుమార్గంలో నిర్దేశించిన ప్రాంతంలో నిర్ణీత వేగం కన్నా ఎక్కువ వేగంతో వాహనాలు వెళితే వాహనం దూరంగా ఉన్నా స్పష్టంగా ఫొటోలు తీస్తుంది. ఫొటోల్లో వాహనాల నంబర్‌ స్పష్టంగా కనబడుతుంది. ఈ ఆధారాలతో నియమ నిబంధనలు విస్మరించిన వాహనదారులకు జరిమానాలు విధిస్తారు.

గార్డియన్‌ ఏంజిల్స్‌...

బ్లూకోల్ట్స్‌ బృందాలు, రాత్రి వేళల్లో విధులను నిర్వహించే పోలీసులకు గార్డియన్‌ ఏంజిల్స్‌ అందజేస్తారు. రాత్రివేళల్లో విధులను నిర్వర్తించే పోలీసులు ప్రమాదాలకు గురవ్వకుండా ఉండేందుకు ఈ పరికరం ఉపయోగ పడుతుంది. గార్డియన్‌ ఏంజిల్స్‌ను భుజంపై భాగంలో అమర్చుకుని రాత్రివేళ విధులను నిర్వహిస్తారు. రంగురంగుల లైట్లతో ఇది మెరుస్తూ ఉంటుంది. దాదాపు రెండు కిలోమీటర్ల వరకు ఈ లైట్లు కనిపిస్తాయి.

మొబైల్‌ కమాండ్‌ కంట్రోల్‌ బస్సు

ఏదైనా సున్నితమైన సంఘటన లేదా సమస్యాత్మక ఘటన చోటచేసుకున్న సమయంలో అక్కడ పోలీస్‌పికెట్‌ ఏర్పాటు చేయటంతోపాటు మొబైల్‌ కమాండ్‌ కంట్రోల్‌ బస్సు ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తారు. కమాండ్‌ కంట్రోల్‌ బస్సుకు ముందుభాగంలో 360 డిగ్రీస్‌ వీడియో రికార్డు, లైవ్‌లో పరిశీలించేందుకు అత్యాధునిక కెమెరాను బిగించారు. వెనుక భాగంలో ఒక కెమెరా ఉంటుంది. బస్సులోపల ఎల్‌ఈడీ స్ర్కీన్లుంటాయి. ఘటనస్థలంలో లేదా ర్యాలీ, కర్ఫ్యూ సమయంలో ఈ కమాండ్‌ కంట్రోల్‌ బస్సును అక్కడికి పంపించి బస్సులో నుంచే పోలీసు అధికారులు పరిస్థితిని అంచనా వేసి క్షేత్రస్థాయిలో ఉన్న భద్రతా సిబ్బంది, అధికారులకు తగిన సూచనలు, జాగ్రత్తలు జారీ చేస్తారు.

పలు సంఘటనల్లో కేసులు

ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై పోలీసుల ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో గత ఏడాది కాలంలో కమిషనరేట్‌ వ్యాప్తంగా నిర్వహించిన డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీల్లో మోతాదుకు మించి మద్యం సేవించిన 6,005 మంది వాహనదారులపై కేసులు నమోదయ్యాయి. అతిగా మద్యం సేవించి 147 మందికి జైలుశిక్ష పడింది. ట్రాఫిక్‌ పోలీసులు నిర్వహించిన స్పెషల్‌ డ్రైవ్‌లో సరైన నంబర్‌ప్లేట్లు లేని 1,281 వాహనదారులపై కేసులు నమోదు చేసి జరిమానా విధించారు. నంబర్‌ప్లేట్లు ఏర్పాటు చేసుకోవడం, నంబర్‌ కనబడకుండా స్టిక్కర్‌ అంటించడం, చివరి నంబర్‌ను చెరిపేయడం వంటి ఉల్లంఘనలు పాల్పడినవారిపై కేసులు నమోదు చేశారు. 18 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న పిల్లలు ద్విచక్రవాహనాలు, కార్లు నడుపుతూ పోలీసుల స్పెషల్‌ డ్రైవ్‌లో పోలీసులకు చిక్కారు. గత ఏడాది 195 మంది మైనర్లు వాహనాల నడపుతుండగా పోలీసులు పట్టుకున్నారు.

Updated Date - Jun 13 , 2025 | 12:58 AM