Karimnagar: ఆసిఫ్‌నగర్‌లో అవస్థలు
ABN , Publish Date - Jul 05 , 2025 | 12:09 AM
భగత్‌నగర్, జూలై 4 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్-వేములవాడ రహదారిపై కొత్తపల్లి మండలంలోని ఆసిఫ్‌నగర్ వద్ద డ్రైనేజీ నీరు రోడ్డుపైకి చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
రోడ్డుపై గుంతలు పడి, నీరు చేరడంతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
- రోడ్డుపైకి చేరిన డ్రైనేజీ నీరు
- రాకపోకలకు అంతరాయం
- పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు
భగత్‌నగర్, జూలై 4 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్-వేములవాడ రహదారిపై కొత్తపల్లి మండలంలోని ఆసిఫ్‌నగర్ వద్ద డ్రైనేజీ నీరు రోడ్డుపైకి చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్-ఆసిఫ్‌నగర్ వరకు ఫోర్‌లైన్ రోడ్డు నిర్మించారు. సిరిసిల్ల-కరీంనగర్ ప్రధాన రహదారిపై ఆసిఫ్‌నగర్ వరకు రోడ్డుపై డ్రైనేజీ నూతనంగా నిర్మించారు. డ్రైనేజీ నీరు, వర్షం నీరుపోవడానికి సరైన ప్రణాళిక రూపొందించక పోవడంతో వర్షాకాలం రావడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి వరద నీరంతా మెయిన్ రోడ్డుపైకి చేరిపోయింది. మంగళవారం నుంచి వరుసగా కురుస్తున్న వర్షానికి రోడ్డుపైనే వరద నీరు చేరిపోవడంతో రాక పోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ ప్రాంతంలో డ్రైనేజీని అసంపూర్తిగా నిర్మించడం తో డ్రైనేజీ నీరు ఎటు పోలేని పరిస్థితి ఏర్పడడంతో చిన్న పాటి వర్షానికి సైతం వరద నీటితో పాటు, డ్రైనేజీ నీరు రోడ్డుపైకి చేరిపోతున్నది. ఈ రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనాలు పెద్ద ఎత్తున రోడ్డుపై గుంతల్లో ఇరుక్కు పోయాయి. వరద నీటితో ఒక ఆటో కూడా బోల్తా పడడంతో క్రేన్ సాయంతో తొలగించారు. ద్విచక్ర వాహనచోదకులు రోడ్డుపై ఉన్న నీటిలో గుంతలు కనిపించక పోవడంతో ప్రమాదాలకు గురవుతున్నారు. సిరిసిల్ల-కరీంనగర్ ప్రధాన రహదారి కావడంతో పెద్ద ఎత్తున వాహనాలు స్తంభించిపోతున్నాయి. ఆసిఫ్‌నగర్ ప్రధాన రహదారిపై వాహనదారులు స్థాని కులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఫ అత్యవసర వాహనాలకు తప్పని తిప్పలు
సిరిసిల్ల-కరీంనగర్ రోడ్డుపై వరద నీరు, గుంతల మయమైన రోడ్డులో అత్యవసర వాహనాలకు తిప్పలు తప్పడం లేదు. శుక్రవారం మధ్యాహ్నం సిరిసిల్ల నుంచి కరీంనగర్ ఆసుపత్రికి అంబు లెన్స్‌లో ఒక బాబును తరలిస్తుండగా అది గుంతల్లో కూరుకు పోయింది. ఎంతో కష్టంతో ఆ అంబు లెన్స్‌ను క్రేన్ సాయంతో ముందకు జరిపారు.
ఫ డ్రైనేజీ నీటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి
- కుంట తిరుపతి, బీజేపీ మండల అధ్యక్షుడు
సిరిసిల్ల-కరీంనగర్ రహదారిపై చేరిపోతున్న డ్రైనేజీ నీటిని పంపించేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. తరచూ తలెత్తుతున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలి. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన రోడ్డు చిన్న పాటి వర్షాలకు గుంతల మయంగా మారిపోయింది.