Share News

Karimnagar: నేడు రెండో విడత ‘పంచాయతీ’

ABN , Publish Date - Dec 14 , 2025 | 12:19 AM

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌) రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఆదివారం జరుగనున్నాయి.

Karimnagar:   నేడు రెండో విడత ‘పంచాయతీ’

- పీచుపల్లి, గోపాల్‌పూర్‌ గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం

- 111 పంచాయతీల్లో పోలింగ్‌

- ఓటు హక్కును వినియోగించుకోనున్న 1,85,592 మంది

- ఉదయం 7నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్‌

- మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి

- గ్రామాలకు చేరిన పోలింగ్‌ సామగ్రి, సిబ్బంది

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఆదివారం జరుగనున్నాయి. 111 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఆయా గ్రామపంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించే అధికారులు, సిబ్బంది పోలింగ్‌ సామగ్రితో గ్రామాలకు చేరుకున్నారు. ఈ విడతలో 113 గ్రామపంచాయతీల్లో 113 సర్పంచ్‌, 1,046 వార్డుసభ్యుల పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. గన్నేరువరం మండలంలోని పీచుపల్లి, గోపాల్‌పూర్‌ గ్రామాల్లో సర్పంచ్‌లు, వార్డు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వివిధ పంచాయతీల్లో 152 వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో 111 సర్పంచ్‌ పదవులకు, 894 వార్డుసభ్యుల పదవులకు ఎన్నికలు జరుగనున్నాయి. పీచుపల్లి సర్పంచుగా సామ రాజిరెడ్డి (బీజేపీ), గోపాల్‌పూర్‌ సర్పంచుగా ఆకుల కవిత (కాంగ్రెస్‌) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ రెండు గ్రామ పంచాయతీల పరిధిలోని 10 వార్డులకు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఫ ఐదు మండలాల్లో..

రెండో విడతలో శంకరపట్నం, మానకొండూర్‌, తిమ్మాపూర్‌, చిగురుమామిడి, గన్నేరువరం మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. శంకరపట్నం మండలంలో 27 పంచాయతీల్లో 240 వార్డులు ఉండగా 48 ఏకగ్రీవమయ్యాయి. 27 సర్పంచ్‌ పదవులకు 111 మంది, 192 వార్డులకు 493 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 37,867 మంది ఓటర్లలో పురుషులు 18,650, మహిళలు 19,217 మంది ఉన్నారు.

- మానకొండూర్‌ మండలంలో 29 పంచాయతీలు, 280 వార్డులు ఉన్నాయి. 10 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 29 సర్పంచ్‌ స్థానాలకు 99 మంది అభ్యర్థులు, 270 వార్డులకు 641 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 29,193 మంది మహిళలు, 27,728 మంది పురుషులు, ఇతరులు ఒకరు, మొత్తం 56,922 మంది ఓటర్లు ఉన్నారు.

- తిమ్మాపూర్‌ మండలంలో 23 గ్రామపంచాయతీలు 212 వార్డులు ఉన్నాయి. 38 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 23 సర్పంచ్‌ పదవులకు 97, 174 వార్డులకు 501 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మండలంలో 38,414 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 18,600 మంది పురుషులు, 19,814 మహిళలు ఉన్నారు.

- చిగురుమామిడి మండలంలో 17 పంచాయతీలు, 174 వార్డులు ఉన్నాయి.17 సర్పంచ్‌లకు 75 మంది పోటీలో ఉన్నారు. 174 వార్డుల్లో 13 వార్డులు ఏకగ్రీవమయ్యాయి, 161 వార్డులకు 467 మంది పోటీలో ఉన్నారు. మండలంలో 34,370 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 16,846 మంది పురుషులు, 17,523 మంది మహిళలు, ఇతరులు ఒకరు ఉన్నారు.

గన్నేరువరంలో 17 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో రెండు పంచాయతీల్లో సర్పంచ్‌లతోపాటు వార్డుసభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలు జరిగే 15 సర్పంచ్‌ స్థానాలకు 54 మంది పోటీలో ఉన్నారు. 140 వార్డులు ఉండగా 43 ఏకగ్రీవయ్యాయి. 97 వార్డులకు 241 మంది పోటీ చేస్తున్నారు. మండలంలో 18,019 ఓటర్లు ఉన్నారు. 8,865 పురుషులు, 9,154 మంది మహిళలు ఉన్నారు.

- ఈ విడతలో జరిగే ఐదు మండలాల్లో మొత్తం 1,85,592 మంది ఓటర్లు ఉండగా మహిళా ఓటర్లు 94,901 మంది ఉన్నారు. పురుషులు 90,689 మంది, ఇద్దరు ఇతరులు ఉన్నారు.

Updated Date - Dec 14 , 2025 | 12:19 AM