karimnagar : వర్షంతో భారీగా దెబ్బతిన్న రోడ్లు
ABN , Publish Date - Nov 01 , 2025 | 12:50 AM
సైదాపూర్, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): మండలంలో రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి రోడ్లు దెబ్బతిన్నాయి.
- త్వరగా మరమ్మతులు చేయాలని కోరుతున్న వాహనదారులు
సైదాపూర్, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): మండలంలో రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి రోడ్లు దెబ్బతిన్నాయి. నాల్ చెరువు మత్తడి వరద రోడ్డుపైనుంచి ప్రవహించడంతో హుస్నాబాద్-హుజూరాబాద్ ప్రధాన రహదారి సమ్మక్క గుట్ట నుంచి సైదాపూర్ వరకు దెబ్బతిన్నది. తారు రోడ్డు కింది మట్టి కొట్టుకపోయి రోడ్డు మద్య పెద్ద గుంత ఏర్పడింది. స్థానికులు ప్రమాదాలు జరుగకుండా ఆ గుంతలో చెట్ల కొమ్మలు వేశారు. సైదాపూర్ సమీపంలో లో లెవల్ వంతెనగుంతలమయంగా మారింది. సోమారం గ్రామ సమీపంలోని వాగు పొంగి సైదాపూర్-మొలంగూర్ రోడ్డులో సోమారం చౌరస్తా రోడ్డు కొట్టుకుపోయింది. ఎక్లాస్‌పూర్-సోమారం రోడ్డు వరద దాటికి కొట్టుకపోయి ప్రమాదకరంగా మారింది. సోమారం-బూడిదపల్లి వైపు రోడ్డు తారు కొట్టుకుపోయి కంకర తెలింది. ఆకునూర్-గొళ్లగూడెం మధ్య రోడ్డుకు గండి పడింది. ఆకునూర్ గ్రామంలో వరదకు మంచి నీటి పైప్‌లైన్ కొట్టుకపోవడంతో అధికారులు మరమ్మతులు ప్రారంభించారు. గై చెరువు మత్తడితో ఆరెపల్లి-జాగీర్‌పల్లి మధ్య రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. ఎలబోతారం-బొమ్మకల్ మద్య రెండు లోలేవల్ వంతెనలపై నుంచి నీరు పోయి గుంతలు ఏర్పడ్డాయి.
ఫ ఇందుర్తి ఎల్లమ్మ వాగుపై రోడ్డుకు మరమ్మతులు చేసిన ప్రయాణికులు
చిగురుమామిడి: మండలంలోని ఇందుర్తి ఎల్లమ్మ వాగు వద్ద వర్షానికి రోడ్డు దెబ్బ తిని రాక పోకలు నిలిచిపోయాయి. శుక్రవారం కొందరు ప్రయాణికులు రోడుకు మరమ్మతులు చేశారు. దీంతో ప్రస్తుతం కోహెడ- చిగురుమామిడి మండలాల ప్రజల రాకపోకలు సాగుతున్నాయి.