Share News

Karimnagar: డిసెంబరు 9లోగా హామీలను నెరవేర్చాలి

ABN , Publish Date - Oct 16 , 2025 | 11:48 PM

కరీంనగర్‌ టౌన్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం డిసెంబరు 9లోగా నెరవేర్చాలని ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Karimnagar:  డిసెంబరు 9లోగా హామీలను నెరవేర్చాలి

- ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి

కరీంనగర్‌ టౌన్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం డిసెంబరు 9లోగా నెరవేర్చాలని ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం నగరంలోని టీఎన్‌జీవోస్‌ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన పీఆర్‌టీయుటీఎస్‌ జిల్లా సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన పీఆర్సీ, డీఏ పెండింగ్‌ బిల్లులన్నింటిని వంద రోజుల్లో ఇస్తామని హామీ ఇచ్చిందన్నారు. ప్రతీ నెల ఒకటో తేదీన జీతాలు ఇవ్వడం మినహా మిగిలిన హామీలేవీ నెరవేర్చలేదని విమర్శించారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావలసిన బెనిఫిట్స్‌ను సంవత్సరాల కొద్దీ పెండింగ్‌లో పెట్టి వారిని తీవ్ర ఇబ్బంది పెడుతున్నారన్నారు. 30 సంవత్సరాలు కడుపు కట్టుకుని పైసాపైసా కూడగట్టి దాచుకున్న సొమ్మునుకూడా ప్రభుత్వం ఇవ్వక పోవడం ఉద్యోగుల హక్కులను కాలరాయడమేనని విమర్శించారు. కొంత మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆర్థిక పరిస్థితి బాగాలేక ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబరు 9లోగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుంటే కలిసివచ్చే సంఘాలతో కలిసి ఉద్యమ కార్యాచరణను పీఆర్టీయూ ప్రకటిస్తుందని తెలిపారు. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ మండలంలోని సీనియర్లనే ఎంఈవోలుగా నియమించేందుకు సంబంధించిన ఇచ్చే ఉత్తర్వులు త్వరలో వస్తాయని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ సంఘం పక్షాన చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి జయపాల్‌రెడ్డి నివేదికను సమర్పించారు. అనంతరం పదోన్నతి పొందిన ఉపాధ్యాయులను సన్మానించారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ భిక్షంగౌడ్‌, ఆడిట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, రాఘవరెడ్డి, తిరుపతిరెడ్డి, జమీల్‌, దారం శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.

Updated Date - Oct 16 , 2025 | 11:48 PM