Karimnagar: ప్రైవేట్ కళాశాలల బంద్ సంపూర్ణం
ABN , Publish Date - Nov 04 , 2025 | 12:06 AM
కరీంనగర్ టౌన్, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు నిర్వహించిన బంద్ జిల్లాలో మొదటిరోజు సోమవారం విజయవంతమైంది.
- అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి యాజమాన్య సంఘం నిరసన
- బకాయిలను విడుదల చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం : ‘సుప్మా’
కరీంనగర్ టౌన్, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు నిర్వహించిన బంద్ జిల్లాలో మొదటిరోజు సోమవారం విజయవంతమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 69 డిగ్రీ, 35 పీజీ కళాశాలలతోపాటు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు బంద్ పాటించాయి. బంద్‌కు విద్యార్థులు, అధ్యాపకులు, విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తప్పుబడుతూ సోమవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణచౌక్‌లో శాతవాహన యూనివర్సిటీ ప్రైవేట్ కళాశాలల యాజమాన్య సంఘం (సుప్మా) ఆధ్వర్యంలో విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులు, సిబ్బందితో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం పట్టణ అధ్యక్షుడు గోవిందవరం కృష్ణ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మొదటిరోజు బంద్ విజయవంతమైందని అన్నారు. నాలుగు సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయకపోవడంతో యాజమాన్యాలు,విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో కళాశాలలను నడిపడం కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల విడుదల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ నెరవేర్చపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా సీఎం ఇచ్చిన హామీ మేరకు ఫీజురీఎంబర్సుమెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. నిధులు విడుదల చేసే వరకు నిరవధిక బంద్ కొనసాగిస్తామని, ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, సిబ్బందితోకలిసి తీవ్రం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అల్ఫోర్స్ డిగ్రీ కళాశాల చైర్మన్ వి రవీందర్‌రెడ్డి, అపూర్వ డిగ్రీ కళాశాలల చైర్మన్ పి వేణు, శివాని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వర్మ, వాగేశ్వరి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సతీష్, వైస్ ప్రిన్సిపాల్ చైతన్య పాల్గొన్నారు.