Karimnagar: రాజీవ్‌రహదారిపై పోలీస్ మ్యాన్
ABN , Publish Date - Nov 21 , 2025 | 12:09 AM
తిమ్మాపూర్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. మండలంలోని రేణికుంట నుంచి అలుగునూర్ వరకు ప్రతి రోజు రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి.
- ప్రమాదాల నియంత్రణకు డమ్మీ బొమ్మలు ఏర్పాటు చేస్తున్న పోలీసులు
తిమ్మాపూర్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. మండలంలోని రేణికుంట నుంచి అలుగునూర్ వరకు ప్రతి రోజు రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ ప్రాంతంలో మూల మలుపులు, రహదారిని ఆనుకుని చాలా గ్రామాలున్నాయి. మూల మలుపుల వద్ద రోడ్డు దాటుతున్న సమయాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే అలోచనతో సీపీ గౌస్‌ఆలం సూచన మేరకు ఎల్‌ఎండీ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఎల్‌ఎండీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువ ప్రమాదాలు జరిగే జంక్షన్లలో, మూల మలుపుల వద్ద వాహనాల వేగాన్ని నిరోధించేందుకు 30 స్టాపర్లను ఏర్పాటు చేశారు. అచ్చం ట్రాఫిక్ పోలీసుల్లా ఉండే ఆరు పోలీస్ మ్యాన్ డమ్మీ బొమ్మలను ఎల్‌ఎండీ ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేశారు. స్టాపర్లపై రోడ్డు భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పొందపర్చారు. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎల్‌ఎండీ పోలీస్‌స్టేషన్ ఫోన్ నంబర్, అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సిన నంబర్లను రాయించారు.
ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం
శ్రీకాంత్ గౌడ్, ఎల్‌ఎండీ ఎస్‌ఐ
ఎల్‌ఎండీ పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఏడాది కంటే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. సీపీ సూచన మేరకు 30 స్టాపర్లను తయారు చేయించి ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో ఏర్పాటు చేశాం. ఆరు పోలీస్ మ్యాన్ డమ్మీ బొమ్మలను ఏర్పాటు చేశాం. వాహనదారులు నిబంధనలు పాటిస్తూ నిర్దేశిత వేగంలో వాహనాలు నడుపుతూ సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవాలి.