Share News

Karimnagar: జిల్లాలో ఫోన్‌ ట్యాపింగ్‌ కలకలం

ABN , Publish Date - Jun 21 , 2025 | 12:08 AM

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌) కేంద్ర హోం శాఖసహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌తో పాటు బీజేపీ నాయకుడు, కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జీ బోయినపల్లి ప్రవీణ్‌రావుల ఫోన్‌లు ట్యాప్‌ అయినట్లు సిట్‌ అధికారులు నిర్ధారించారు.

Karimnagar: జిల్లాలో ఫోన్‌ ట్యాపింగ్‌ కలకలం

- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌కు సిట్‌ ఫోన్‌

- బీజేపీ నేత ప్రవీణ్‌రావుకు అధికారుల పిలుపు

- గతంలో మీ ఫోన్‌ ట్యాప్‌ చేశారని వెల్లడి

- నోటీసులిస్తాం.. విచారణకు రావాలని సూచన

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కేంద్ర హోం శాఖసహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌తో పాటు బీజేపీ నాయకుడు, కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జీ బోయినపల్లి ప్రవీణ్‌రావుల ఫోన్‌లు ట్యాప్‌ అయినట్లు సిట్‌ అధికారులు నిర్ధారించారు. ఈ విషయాన్ని బండి సంజయ్‌కుమార్‌తో పాటు, బోయినపల్లి ప్రవీణ్‌రావు ధ్రువీకరించారు. ప్రవీణ్‌రావుకు గురువారం రాత్రి సిట్‌ అధికారులు ఫోన్‌ చేయగా శుక్రవారం రాత్రి కేంద్ర హోం శాఖసహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌కు ఫోన్‌ చేశారు. మీ ఫోన్‌ ట్యాప్‌ అయ్యిందని విచారణకు సిద్ధంగా ఉండాలని పోలీసులు కోరినట్లు బండి సంజయ్‌కుమార్‌ తెలిపారు. వాంగ్ములం తీసుకునేందుకు తనను సమయం కోరారని తెలిపారు. షెడ్యూల్‌ చూసుకుని వాంగ్ములం ఇచ్చేందుకు సమయం ఇస్తానని చెప్పామన్నారు. ప్రవీణ్‌రావుతో పాటు జిల్లాకు చెందిన మరికొందరు నేతల ఫోన్లు కూడా ట్యాప్‌ అయి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాన్ని విచారించడానికి సిట్‌ ఏర్పాటు చేసింది. విదేశాల నుంచి ఈ కేసులో కీలకమైన ప్రభాకర్‌రావు తిరిగి రావడంతో విచారణ వేగవంతమై కీలక సమాచారం వెలుగులోకి వస్తున్నది. ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్‌ కుమార్‌ తాను బీజేపీ అధ్యక్షునిగా ఉన్నప్పటి నుంచే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తనపై నిఘా పెట్టిందని, ఆ పార్టీ, ప్రభుత్వ కీలక నేతల ఆదేశాల మేరకు తన ఫోన్‌ను, తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఫోన్లను ట్యాపింగ్‌ చేస్తున్నారని పదేపదే ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్‌ చేపట్టిన విచారణలో సంజయ్‌కుమార్‌ ఫోన్‌ ట్యాపింగ్‌లో ఉన్నట్లు నిర్ధారణ అయింది.

ఫ సన్నిహిత అనుచరుడనే నిఘా

ప్రవీణ్‌రావు బండి సంజయ్‌ కుమార్‌ పార్లమెంట్‌ కార్యాలయంలో కీలక వ్యక్తిగా ఉండడమే కాకుండా ఆయన జిల్లాకు వచ్చిన సందర్భంలో ప్రతి కార్యక్రమంలోనూ ఆయన వెన్నంటి ఉంటూ సహాయకునిగా వ్యవహరిస్తారు. సంజయ్‌ కుమార్‌కు సంబంధించిన కీలక సమాచారం తెలుస్తుందనే ఉద్దేశంతోనే ప్రవీణ్‌రావు ఫోన్‌ను ట్యాప్‌ చేసినట్లు భావిస్తున్నారు. గతంలో 317జీవో, పదవ తరగతి పరీక్షల పేపర్లు లీకేజీ, బైంసా అల్లర్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పలు ఘటనల్లో, ప్రజా ఉద్యమాల్లో ప్రవీణ్‌రావు సంజయ్‌కుమార్‌ వెన్నంటి ఉన్నారు. సంజయ్‌పై నమోదైన పలు కేసుల్లో ప్రవీణ్‌రావును కూడా నిందితుడిగా చేర్చారు. 317 జీవో విషయంలో బండి సంజయ్‌ కుమార్‌ తన పార్లమెంట్‌ కార్యాలయంలో చేపట్టిన దీక్షను అడ్డుకోవాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఒత్తిడి తేవడంతో పోలీసులు ఎంపీ కార్యాలయ తలుపులు బద్దలుకొట్టి సంజయ్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఆ సందర్భంలో పోలీస్‌ ఉన్నతాధికారి ఘటన స్థలంలో ఉన్న ప్రవీణ్‌రావును ఉద్దేశించి నీ జాతకమంతా నా వద్ద ఉన్నది, నువ్వేం చేస్తున్నావో మాకు తెలుసు అంటూ హెచ్చరించారని ప్రవీణ్‌రావు తెలిపారు. పదవ తరగతి పేపర్‌ లీకేజీ సమయంలోనూ బండి సంజయ్‌ కుమార్‌ను పోలీసులు నివాసంలోకి చొరబడి ఎత్తుకుపోయి పలు స్టేషన్లు మార్చారు. ఈ రెండు కేసుల్లోనూ సంజయ్‌కుమార్‌ వెంటే ఉన్న ప్రవీణ్‌రావు నిందితుడిగా నమోదై ఉన్నారు. టెన్త్‌ పేపర్ల సంఘటన సమయంలోనూ తనను ఆనాటి సీఐ బెదిరించారని ప్రవీణ్‌రావు ఆరోపించారు. సంజయ్‌కుమార్‌తో సాన్నిహిత్యం ఉన్న నేపథ్యంలోనే సంజయ్‌ కుమార్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని ప్రవీణ్‌రావు ఫోన్ల నుంచి సేకరించవచ్చని పోలీసులు ట్యాపింగ్‌కు పాల్పడ్డారని అనుకుం టున్నారు. ప్రవీణ్‌రావుతోపాటు సంజయ్‌ సహచరుల్లో మరికొందరు, వారి కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్‌ అయి ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ వాంగ్మూలంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

మొదటి నుంచీ చెపుతున్నా

- కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌

ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖసహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ఫోన్‌ ట్యాపింగ్‌ విషయమై ఇప్పటికే తాను మొదటి నుంచి చెబుతున్నాని అన్నారు. కేసీఆర్‌ పాలనలో ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నారంటూ పలు మార్లు చెప్పానన్నారు. కుటుంబ సభ్యుల ఫోన్లతో పాటు, వ్యక్తిగత సిబ్బంది, ప్రధాన అనుచరుల ఫోన్లను ట్యాప్‌ చేశారని పేర్కాన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో అనేక ఉద్యమాలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. బీజేపీ కార్యక్రమాలను భగ్నం చేసేందుకు గత ప్రభుత్వం ఫోన్లను ట్యాప్‌ చేసిందన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా సమాచారం తెలుసుకుని అర్ధరాత్రి తన నివాసంపై దాడి చేసి టెన్త్‌ పేపర్‌ లీక్‌ పేరుతో పోలీసులు అరెస్టు చేశారన్నారు. కరీంనగర్‌ ఎంపీ కార్యాలయంలో 317 జీవో సవరణపై దీక్ష జరగకుండా నిలువరించేందుకు శతవిధాలా పోలీసులు ప్రయత్నించి భంగపడ్డారన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఫోన్‌ ట్యాప్‌తో తనను దెబ్బతీసేందుకు కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని గతంలోనే వెల్లడించానన్నారు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భార్యభర్తల ఫోన్లను ట్యాప్‌ చేసి నీచానికి ఒడిగట్టిందన్నారు. వీరిద్దరితో పాటు కరీంనగర్‌కు చెందిన వారి ఫోన్లు కూడా ట్యాప్‌ అయ్యి ఉంటాయనే చర్చ జరుగుతోంది.

Updated Date - Jun 21 , 2025 | 12:08 AM