Share News

Karimnagar: బస్టాండ్‌లో పార్కింగ్‌ కష్టాలు

ABN , Publish Date - Nov 07 , 2025 | 11:22 PM

భగత్‌నగర్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కరీంనగర్‌ బస్టాండ్‌లో ప్రయాణీకుల పార్కింగ్‌ కష్టాలు వర్ణణాతీతం.

Karimnagar:  బస్టాండ్‌లో పార్కింగ్‌ కష్టాలు

భగత్‌నగర్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కరీంనగర్‌ బస్టాండ్‌లో ప్రయాణీకుల పార్కింగ్‌ కష్టాలు వర్ణణాతీతం. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కరీంనగర్‌ బస్టాండ్‌లోకి వాహనాలతో ప్రవేశించాలంటేనే ప్రజలు నానా పాట్లు పడాల్సి వస్తున్నది. బస్టాండ్‌లోకి ప్రవేశిస్తే చాలు పెయిడ్‌ పార్కింగ్‌తో డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. తమకు సంబంధించిన వారిని బస్టాండ్‌లో దించాలన్నా, దూర ప్రాంతాల నుంచి వస్తున్న వారిని తీసుకు వెళ్లాలన్నా తాము తీసుకు వచ్చిన వాహనాలకు పార్కింగ్‌ రుసుము చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. బస్టాండ్‌లోకి ప్రవేశిస్తే చాలు ఆర్టీసీ సిబ్బంది వాహనాన్ని ఎక్కడ పెట్టకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. బస్టాండ్‌ ఆవరణలో మూడు పెయిడ్‌ పార్కింగ్‌లు, సిబ్బంది కోసం ఒక పార్కింగ్‌ స్థలం కేటాయించారు. నిత్యం బస్టాండ్‌లోకి వెళ్లే ప్రయాణికులు తాము తీసుకు వచ్చిన వాహనాలను నిలిపేందుకు స్థలం లేక ప్రయాణికులు నానా పాట్లు పడుతున్నారు. దీంతో బస్టాండ్‌లో నిలిపే స్థలం లేక ప్రయాణికులు ఎక్కడ పడితే అక్కడ వాహనాలను నిలుపుతున్నారు. పార్కింగ్‌లో వాహనాలు నిలిపితే 15 నిమిషాల వరకు ఉచితంగా అవకాశం కల్పించాల్సి ఉన్నా వాహనాలను ఎవరు కూడా పేయిడ్‌ పార్కింగ్‌లో నిలపడం లేదు. ఈ విషయాన్ని పార్కింగ్‌ యజమానులు సైతం ప్రయాణికులకు తెలపడం లేదు. క్షణాకాలమైనా సరే పార్కింగ్‌ రుసుం చెల్లించాల్సిందే అన్న అపోహలో ప్రయాణికులుఉన్నారు. దీంతో ప్రయాణికులు బస్టాండ్‌ ఆవరణలో ఎక్కడ పడితే అక్కడ నిలిపి తమకు చెందిన వారి కోసం బస్టాండ్‌లోకి వెళ్తున్నారు. బస్టాండ్‌ ఆవరణలో మూడు పోయిడ్‌ పార్కింగ్‌లో ఆర్టీసీ సంస్థ పూర్తిగా కమర్షియల్‌గా తయారైందని ప్రయాణీకులు వాపోతున్నారు. సాధారణ ప్రజలకు పార్కింగ్‌ కష్టాలు ఈ విధంగా ఉంటే బస్టాండ్‌లో దుకాణాలను చేజిక్కించుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు మాత్రం తమకు చెందిన వాహనాలను ఏకంగా బస్టాండ్‌లోకి తమ దుకాణాల పక్కనే నిలుపుతున్నారు.

ఫ ఇష్టారాజ్యంగా వాహనాల పార్కింగ్‌

బస్టాండ్‌ ఆవరణలో మూడు గేట్‌ల నుండచి వాహనాలను లోపలికి తీసుకు వచ్చిన ప్రయాణికులు ఇష్టారాజ్యాంగా వాహనాలను నిలుపుతుండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆర్టీసీ ఇన్‌గేట్‌లో నుంచి వెళ్తున్న వాహనాలతోపాటు, కార్గో కార్యాలయానికి పార్సిల్స్‌ తీసుకునేందుకు, పార్సిల్స్‌ పంపించే వాహనాలతో సైతం ఇబ్బందులు తెలత్తుతున్నాయి. ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ నిలిపిన వాహనాలతో పాటు, చాలా రోజులుగా నిలిపి ఉంచిన వాహనాల్లో ఆర్టీసీ సిబ్బంది గాలిని తీస్తున్నారు. సాధారణ వాహనాల కోసం కొంత స్థలాన్ని చూపించి వాహనాలు నిలుపుకునేందుకు అవకాశాలు కల్పించాలని ప్రయాణీకులు కోరుతున్నారు.

Updated Date - Nov 07 , 2025 | 11:22 PM