karimnagar : పార్కుల నిర్వహణ గాలికి
ABN , Publish Date - Oct 06 , 2025 | 12:35 AM
కరీంనగర్ టౌన్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ పరిధిలోని పలు పార్కులను అభివృద్ధి చేసి వాటి నిర్వహణను పట్టించుకోవడం మరిచారు.
- మూన్నాళ్ల ముచ్చటగా సుందరీకరణ పనులు
- మూలనపడుతున్న క్రీడా పరికరాలు...
- అలనా...పాలన లేక ఆదరణ కరువు
- ఐదేళ్లు తిరగకుండానే కళతప్పుతున్న ఉద్యానవనాలు
కరీంనగర్ టౌన్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ పరిధిలోని పలు పార్కులను అభివృద్ధి చేసి వాటి నిర్వహణను పట్టించుకోవడం మరిచారు. నగరపాలక సంస్థ పరిధిలో 50కిపైగా మున్సిపల్ పార్కు స్థలాలు ఉన్నాయి. గత పాలక వర్గం పార్కులపై దృష్టి పెట్టి 25కిపైగా పార్కులను అభివృద్ధి చేసింది.
ఫ ఫూలే పార్కులో కొరవడిన ఆహ్లాదం
తెలంగాణ చౌక్‌లోని సర్కస్ గ్రౌండ్‌ను ఆరు కోట్ల రూపాయలు వెచ్చింది మహాత్మా జ్యోతిబా ఫూలే పార్కుగా అభివృద్ధి చేసి 2020లో ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. నాలుగేళ్ల వరకు మున్సిపల్ ఆధ్వర్యంలో పార్కులు నిర్వహించి సాధారణ రుసుమును వసూలు చేశారు. ఇటీవల ఈ పార్కును లీజుకు ఇచ్చారు. పార్కు స్థలంలో ఇటీవల విద్యుత్ సబ్‌స్టేషన్ పనులు ప్రారంభించారు. మరోవైపు ప్రైవేట్ కార్యక్రమాలకు పార్కును వినియోగించడంతో పరిశుభ్రత లోపించింది. వాటర్ ఫాల్స్ పని చేయడం లేదు. ప్రైవేట్ కార్యక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయని, ఆరోజుల్లో వాకింగ్ చేయడం కష్టంగా మారుతోందని వాకర్స్ వాపోతున్నారు.
ఫ మల్టిపర్పస్ పార్కుదీ అదే పరిస్థితి..
మల్టిపర్పస్ పార్కును దాదాపు 12 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేశారు. గత జనవరిలో ప్రారంభించారు. ఈ పార్కును కూడా ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇచ్చారు. ఈ రెండు పార్కులను లీజుకు ఇచ్చినప్పటికి అగ్రిమెంట్ ప్రకారం వసతులు, సౌకర్యాలు కల్పిస్తున్నారా... అని చూడాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉంటుంది. ఆ దిశగా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఫ చిన్న పార్కులను పట్టించుకునే వారే లేరు..
మరోవైపు నగరంలోని హౌసింగ్‌బోర్డు కాలనీ, అలకాపురికాలనీ, సప్తగిరికాలనీ, బ్యాంకుకాలనీ, జ్యోతినగర్ కాలనీ, రాంనగర్, బుట్టి రాజారాంకాలనీ, వావిలాలపల్లితోపాటు 22 పార్కులను కోట్ల నిధులు పెట్టి అభివృద్ధి చేశారు. ఆ పార్కులన్నీ నగర పాలక సంస్థ ఆధీనంలోనే కొనసాగుతున్నాయి. వాటికి వాచ్‌మన్, కేర్‌టేకర్, సెక్యూరిటీ గార్డు, ఒక పనిమనిషి కూడా లేక పోవడంతో వాటి ఆలనా పాలనా చూసేవారు లేకుండా పోయారు. రాత్రి వేళల్లో లైట్లు వేసే వారు లేక ఇబ్బంది పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. పట్టించుకునే వారు లేక మొక్కలు, పచ్చిక ఎండి పోతున్నాయి. క్రీడా పరికరాలు దెబ్బతిన్నాయి. ఇప్పటికైనా అధికారులు ప్రతి పార్కుకు ఒక అధికారిని ఇన్‌చార్జిగా నియమించడంతోపాటు పార్కులోని చెట్లు, ఇతర ఆటవస్తువులు, నిర్వహణ కోసం సిబ్బందిని నియమించాలని నగరవాసులు కోరుతున్నారు.
ఫ ప్రతి పార్కు బాధ్యతను ఒక అధికారికి అప్పగించాలి
- యాదగిరి సునీల్‌రావు, మాజీ మేయర్
నగరంలోని దాదాపు 25 మున్సిపల్ పార్కులను లక్షలాది రూపాయలతో అత్యంత అందంగా అభివృద్ధి చేశాము. వాటి నిర్వహణ బాధ్యత నగరపాలక సంస్థదే.. ప్రతి పార్కు నిర్వహణ బాధ్యతను ఒక అధికారికి అప్పగించాలి. పార్కులను మరింత అభివృద్ధి చేయడంతోపాటు నిర్వహణ సక్రమంగా ఉండేలా చూడాలి. పార్కు నిర్వహణకు కనీసం ఒకరినైనా నియమించాలి. అప్పుడే పార్కులు అభివృద్ధి చెందుతాయి.