Karimnagar: ఓం నమో వేంకటేశాయ
ABN , Publish Date - Nov 11 , 2025 | 12:11 AM
కరీంనగర్ కల్చరల్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌లో రెండున్నరేళ్ళుగా పెండింగ్‌లో ఉన్న టీటీడీ ఆలయ నిర్మాణంలో కదలిక ప్రారంభమైంది.
- టీటీడీ ఆలయ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
- రూ. 20 కోట్ల నుంచి 30 కోట్లకు పెరిగిన అంచనా వ్యయం
- దాతలతో పాటు శ్రీవాణి ట్రస్ట్ నుంచి నిధులు
కరీంనగర్ కల్చరల్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌లో రెండున్నరేళ్ళుగా పెండింగ్‌లో ఉన్న టీటీడీ ఆలయ నిర్మాణంలో కదలిక ప్రారంభమైంది. కరీంనగర్‌లో, సిద్దిపేట జిల్లా దుబ్బాక, పెద్దపల్లి జిల్లా మంథనిలో ఆలయాల నిర్మాణాలు త్వరలో చేపడుతామని ఇటీవల టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. 30 కోట్ల రూపాయలతో పద్మావతీ ఆండాళ్ సహిత వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని జమ్మూ, కన్యాకుమారి, వైజాగ్ టీటీడీఆలయాల నమూనాలో నిర్మించాలని టీటీడి పాలక వర్గం నిర్ణయించింది. ఇందుకు గతంలోనే 20 కోట్ల విరాళాలు సేకరించినా పెరిగిన నిర్మాణ ధరలు, అదనపు హంగుల కోసం మరో 10 కోట్లు అవసరమని తాజాగా అంచనాలు వేశారు. ఈ మొత్తాన్ని దాతల నుంచి సేకరించాలని, లేదా శ్రీవాణి ట్రస్టు ఫండ్స్ నుంచి కేటాయించాలని నిర్ణయించారు. టెండర్లు ఖరారైతే పనులు ప్రారంభమయ్యే అవకావం ఉంది.
ఫ మూడున్నరేళ్ళ క్రితం నిర్ణయం...
టీటీడీ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించాలని 2022 ఏప్రిల్ 30న తొలిసారి బోర్డు తీర్మానం చేసింది. దీంతో అప్పటి ప్రభుత్వం పద్మనగర్ పరిధిలోని 10 ఎకరాల స్థలాన్ని ఆలయ నిర్మాణానికి కేటాయించింది. అనంతరం 2022 నవంబరు 30న బోర్డు జమ్మూ, కన్యాకుమారి, వైజాగ్ టీటీడి ఆలయాల నమూనాలో ఉండాలని, నిర్మాణ నిధులను శ్రీవాణి ట్రస్టు నుంచి ఖర్చు చేయాలని, హైదరాబాద్ లోకల్ అడ్వైజరీ కమిటి బాధ్యుల ద్వారా స్వచ్ఛంద విరాళాలు సేకరించాలని నిర్ణయించింది. 2023 ఫిబ్రవరిలో 20 కోట్ల అంచనాతో ఆలయ నిర్మాణ ప్రణాళిక సిద్ధం చేశారు. అదే ఏడాది మే 30న అప్పటి మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్, అప్పటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. నవంబరులో ఆలయ నిర్మాణ పనులను నటరాజన్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థకు అప్పగించినా పనులు ప్రారంభం కాలేదు. ఆ సంస్థ తన కాంట్రాక్టును రద్దు చేసుకోవడంతో ఆలయ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ నిర్మాణ పనులు చేపట్టాలని కోరుతూ ఏప్రిల్ 5న టీటీడీకి లేఖ రాశారు.
ఫ రెండు దశల్లో పనులు...
పెరిగిన ధరలకనుగుణంగా ఆలయ నిర్మాణ వ్యయం 20 కోట్ల నుంచి 30 కోట్లకు పెరిగింది. దీంతో రెండు దశల్లో పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు. తొలి దశలో 20 కోట్లను ఖర్చు చేయనున్నారు. 17 కోట్లతో ప్రధాన ఆలయంలో భాగంగా గర్భగుడి, అర్ధ మండపం, మహా మండపం, ముఖ మండపం, గరుడాలయం, ధ్వజస్తంభం, బలిపీఠం, రెండు ఉపాలయాలు, శ్రీవారి పోటు, స్టోరు, కార్యాలయం, ప్రాకారం, ఐదు అంతస్తుల రాజగోపురం నిర్మించనున్నారు. 2 కోట్లతో విద్యుత్ పనులు, యాడ్ లైటింగ్, ట్రాన్స్‌ఫార్మర్, 50 లక్షలతో టాయిలెట్స్ బ్లాక్, 50 లక్షలతో వాటర్ సప్లై, డ్రైనేజ్, క్యూలైన్, ప్రసాదం కౌంటర్ తదితర పనులు చేపట్టనున్నారు. రెండో దశలో మూడు కోట్లతో నాలుగు మాడ వీధులు, రోడ్లు, మూడు కోట్లతో అర్చకులు, సిబ్బంది నివాస సముదాయాలు, మరో మూడు కోట్లతో ప్రహరీ గోడ, 60 లక్షలతో ఆర్చ్ నిర్మాణం, 40 లక్షలతో ఎల్‌ఈడీ శంఖ చక్ర నామాలు ఏర్పాటు చేయనున్నారు.