Share News

karimnagar : నామినేషన్ల పర్వం షురూ

ABN , Publish Date - Nov 28 , 2025 | 12:49 AM

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌) ఒక వైపు బీసీలకు రిజర్వేషన్లలో అన్యాయం జరిగిందంటూ ఆయా వర్గాలకు చెందినవారు హైకోర్టు మెట్లు ఎక్కగా మరోవైపు పంచాయతీ ఎన్నికల పర్వంలో గురువారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది.

karimnagar :  నామినేషన్ల పర్వం షురూ

- తొలిరోజు సర్పంచు పదవులకు 92 నామినేషన్లు

- వార్డు సభ్యులకు 86 దాఖలు

- డిసెంబరు 11న మొదటి విడత ఎన్నికలు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ఒక వైపు బీసీలకు రిజర్వేషన్లలో అన్యాయం జరిగిందంటూ ఆయా వర్గాలకు చెందినవారు హైకోర్టు మెట్లు ఎక్కగా మరోవైపు పంచాయతీ ఎన్నికల పర్వంలో గురువారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన షెడ్యూల్‌ మేరకు గ్రామపంచాయతీల్లో ఎన్నికల నోటీసులు, ఓటరు లిస్టులను ప్రదర్శించారు. మొదటి విడత నామినేషన్లు వేసేందుకు ఈ నెల 29వరకు గడువు ఉండగా తొలిరోజు గురువారం సందడిగా నామినేషన్ల స్వీకరణ సాగింది. గ్రామాలలో పంచాయతీ ఎన్నికల హడావుడి కనిపించింది. సర్పంచు పదవులకు, వార్డుసభ్యుల పదవులకు పోటీచేసే వారు తమ మద్ధతుదారులతో కలిసి వచ్చి ఆయా కేంద్రాలలో నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు సమర్పించారు.

ఫ రేపటి వరకు నామినేషన్లకు గడువు

జిల్లాలోని చొప్పదండి, గంగాధర, రామడుగు, కొత్తపల్లి, కరీంనగర్‌ రూరల్‌ మండలాలలోని 92 పంచాయతీలకు చెందిన 92 సర్పంచు పదవులు, 866 వార్డు సభ్యుల పదవుల కోసం మొదటి విడతలో డిసెంబరు 11న ఎన్నికలు జరుగనున్నాయి. నామినేషన్లు వేసేందుకు మూడు రోజులు గడువు ఇవ్వగా తొలిరోజే 92 సర్పంచు పదవులకు 92 నామినేషన్లు, 866 వార్డు సభ్యుల పదవులకు 86 నామినేషన్లు వచ్చాయి. చొప్పదండి మండలంలో 16 గ్రామపంచాయతీలలో 15 మంది సర్పంచు పదవుల కోసం నామినేషన్లు దాఖలు చేశారు. గంగాధర మండలంలో 33 పంచాయతీలు ఉండగా 28 నామినేషన్లు, రామడుగులోని 23 పంచాయతీల్లో 27 నామినేషన్లు, కరీంనగర్‌ రూరల్‌ మండలంలోని 14 పంచాయతీల్లో 10 నామినేషన్లు, కొత్తపల్లి మండలంలో 6 పంచాయతీల్లో సర్పంచు పదవులకు 12 నామినేషన్లు దాఖలయ్యాయి. చొప్పదండి మండలంలో 12 వార్డు సభ్యుల నామినేషన్లు, రామడుగు మండలంలో 12 వార్డుసభ్యుల నామినేషన్లు, కొత్తపల్లి మండలంలో 21 వార్డు సభ్యుల నామినేషన్లు, కరీంనగర్‌ రూరల్‌ మండలంలో 9 వార్డు సభ్యుల నామినేషన్లు, గంగాధర మండలంలో 32 వార్డు సభ్యుల నామినేషన్లు వచ్చాయి. శుక్ర, శనివారాల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన జరుగనున్నది. అదే రోజు సాయంత్రం చెల్లుబాటు అయిన అభ్యర్థుల నామినేషన్ల వివరాలను ప్రకటిస్తారు. వచ్చిన నామినేషన్లపై ఏవైనా ఫిర్యాదులుంటే అప్పీళ్లకు డిసెంబర్‌ 1న వీలుకలిగించారు. ఆ రోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా అప్పీలు చేసుకునే అవకాశముంటుంది. డిసెంబరు 2న సాయంత్రం 5 గంటల వరకు అప్పీళ్ళను పరిష్కరిస్తారు. డిసెంబరు 3న అభ్యర్థిత్వాలను ఉపసంహరించుకునే వారికి మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశముంటుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు.

ఫ నామినేషన్ల సరళిని పరిశీలించిన కలెక్టర్‌

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పమేలాసత్పతి రామడుగు మండలంలోని వెదిర గ్రామపంచాయతీ కార్యాలయంలో వెదిర, వెలిచాల గ్రామాల్లో నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించారు. నామినేషన్లు వేసేందుకు వచ్చే వారికి హెల్ప్‌డెస్క్‌ ద్వారా సహకరించాలని, పోలీసు బందోబస్తు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లు జరుగకుండా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలని అధికారులకు సూచించారు. నామినేషన్‌ దరఖాస్తు ఫారాలను తీసుకున్న వివరాలను రిజిస్టర్లలో నమోదు చేసి నామినేషన్ల దాఖలైన వివరాలను జిల్లా కేంద్రా నికి సకాలంలో పంపించాలని కోరారు. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను పాటిస్తూ ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు.

ఫ గ్రామాల్లో వేడెక్కుతున్న రాజకీయం

గ్రామపంచాయతీల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అన్ని గ్రామాల్లోనూ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పార్టీల గుర్తులేకుండా ఎన్నికలు జరుగుతున్నా అన్ని రాజకీయపార్టీల వారు తమ పార్టీకి చెందిన వారిని సర్పంచులుగా, వార్డుసభ్యులుగా గెలిపించుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలను పల్లెపల్లెకు తీసుకెళ్లేందుకు వీలుకలుగుతుందనే భావనతో అన్ని రాజకీయపక్షాలు తమ మద్దతుదారులను గెలిపించుకోవడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి. సర్పంచు పదవులకు, వార్డు సభ్యుల పదవులకు పోటీ చేసేందుకు ఆసక్తిచూపిస్తున్న వారితో సమావేశాలు నిర్వహించి పార్టీలో సభ్యుల మధ్య పోటీ ఉండకూడదని, పార్టీ నుంచి ఒకరిని మాత్రమే రంగంలోకి దించేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా తమ పార్టీ వారిని ముఖ్యంగా తమ మద్దతుదారులను తెరపైకి తెస్తున్నారు. ఆశావహుల్లో అవగాహన కుదరక ముందైతే నామినేషన్లు వేస్తున్నారు. తర్వాత పార్టీ స్థాయిలో కూర్చొండి చర్చించుకొని అవగాహనకు వచ్చే అవకాశమున్నట్లు చెబుతున్నారు. అన్ని పార్టీల్లోనూ పోటీచేయాలనుకుంటున్నవారు ఎమ్మెల్యేలను పార్టీ పెద్దలను కలుస్తూ తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.

Updated Date - Nov 28 , 2025 | 12:49 AM