Karimnagar: కోతులు బాబోయ్..
ABN , Publish Date - Dec 05 , 2025 | 11:39 PM
హుజూరాబాద్, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్ పట్టణంలో కోతుల బెడద రోజురోజుకు పెరిగిపోతున్నది.. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
- ఇళ్లలోకివెళ్లి సామగ్రి ధ్వంసం
- అడ్డుకుంటే మూకుమ్మడిగా దాడి
- భయాందోళనలో పట్టణవాసులు
హుజూరాబాద్, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్ పట్టణంలో కోతుల బెడద రోజురోజుకు పెరిగిపోతున్నది.. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కోతులు గుంపులు గుంపులుగా సంచరిస్తుండడంతో బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. హుజూరాబాద్ పట్టణంలో కోతుల బెడద ఉన్నప్పటికి మున్సిపల్, అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలున్నాయి. కోతులు ఇళ్లలోకి చొరబడి సామగ్రిని పాడు చేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఎవరైనా వారించడానికి సాహసం చేస్తే మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. హుజూరాబాద్ పట్టణ శివారులోని రంగనాయకుల, బోర్నపల్లి, రంగాపూర్, రాంపూర్, సిర్సపల్లి గ్రామాల్లో గుట్టలు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం గ్రానైట్, క్రషర్ వ్యాపారులకు లీజ్‌కు ఇచ్చారు. లీజ్‌కు తీసుకున్న వ్యాపారులు బండను తొలిచేందుకు బాంబులు పెట్టడడంతో భయపడి కోతులన్నీ గ్రామాలు, పట్టణాల్లోకి చేరాయి. పట్టణంలోని విద్యానగర్, గాంధీనగర్, కాకతీయకాలనీ, కిందివాడ, మామిండ్లవాడ, ఇలా ఏ కాలనీలో చూసిన కోతుల సంచారం అధికంగా ఉంది. సుమారు నాలుగేళ్ల క్రితం మున్సిపల్ అధికారులు పట్టణంలో కోతులు పట్టించారు. కొంతకాలం పాటు వీటి బెడద లేదు. తర్వాత మళ్లీ కోతుల రాక పెరిగింది. రోడ్లపైన వెళ్తున్న వారిని గాయపరుస్తున్నాయి. ఈ విషయంలో మున్సిపల్, అటవీ శాఖల అధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు.