Share News

karimnagar : విలీనం.. ప్రయోజనం శూన్యం

ABN , Publish Date - Jul 10 , 2025 | 12:57 AM

కరీంనగర్‌ టౌన్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌లో శివారు గ్రామ పంచాయతీలను విలీనం చేయడంతో ఎలాంటి ప్రయోజనం లేదని విలీన గ్రామాల (డివిజన్ల) ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

karimnagar :  విలీనం.. ప్రయోజనం శూన్యం

- బోర్డు మారిందే కానీ తీరు మారలేదు

-కార్పోరేషన్‌లో గ్రామాల కలయికపై అసంతృప్తి

- నవీకరణతో ఆర్థిక బారమే

-మూన్నాళ్ళ ముచ్చటగా కొత్తపల్లి మున్సిపాలిటి

-కొత్త గ్రామాల విలీనంపై కూడా విమర్శల వెల్లువ

కరీంనగర్‌ టౌన్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌లో శివారు గ్రామ పంచాయతీలను విలీనం చేయడంతో ఎలాంటి ప్రయోజనం లేదని విలీన గ్రామాల (డివిజన్ల) ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా అభివృద్ది చేయాల్సిన ప్రభుత్వాలు వారికి ఆశించిన ప్రయోజనం కల్పించకపోగా పన్నుల భారం మోపుతూ ఎప్పటికప్పుడు గ్రామాలను విలీనం చేస్తూనే వస్తుంది. నగరీకరణ పేరుతో గ్రామాలను విలీనం చేస్తుండడంతో ప్రజలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు.

ఫ 1984 నుంచి గ్రామాల విలీనం

నాలుగు దశబ్దాల క్రితం 1984లో ఆనాటి రాంనగర్‌, రాంపూర్‌ గ్రామ పంచాయతీలను కరీంనగర్‌ మున్సిపాలిటీలో విలీనం చేస్తూ 32 వార్డులతో స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా మార్చింది. ఇప్పటి వరకు ఆయా గ్రామ పంచాయతీలోని వార్డులు అభివృద్ధికి నోచుకోలేదు. నేటికి ఆ ప్రాంత ప్రజలు మున్సిపాలిటీ కంటే గ్రామ పంచాయతీ సేవలే ముద్దుగా ఉండేవని మున్సిపాలిటీలో విలీనంతో పన్నుల భారం పడిందని, సమస్యలు పెరిగాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

2005లో రెండు దశబ్దాల క్రితం మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా చేసేందుకు అవసరమైన జనాభా, విస్తీర్ణం లేక పోయినప్పటికి ఆనాటి ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్లతో ప్రభుత్వం నగరపాలక సంస్థగా అప్‌గ్రేడ్‌ చేసింది. 50డివిజన్లతో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడంతో నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రకటించారు. నగరం నలుదిశలా విస్తరిస్తూ వచ్చింది. నాటి రాంపూర్‌, రాంనగర్‌ గ్రామ పంచాయతీలోని విలీన డివిజన్లలో నేటికీ అనేక ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కల్పించలేదు.

2019 జనవరిలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల సందర్బంగా పద్మనగర్‌, రేకుర్తి, ఆరపల్లి, సీతరాంపూర్‌, తీగలగుట్టపల్లి, వల్లంపహాడ్‌, అలుగునూర్‌, సదాశివపల్లి ఏడు గ్రామాలను కార్పోరేషన్‌లో విలీనం చేశారు. దీంతో నగరం విస్తీర్ణం జనాభా విపరీతంగా పెరిగింది. ఆయా విలీన గ్రామాల వరకు కాలనీలు విస్తరించాయి. విస్తరణకు అనుగుణంగా నిధులను విడుదల చేయకపోవడం ఉద్యోగులు, కార్మికులను నియమించకపోవడంతో నేటికి ఈ ఏడు గ్రామాల్లోని అనేక ప్రాంతాల్లో పల్లె వాతావరణమే కనిపిస్తుంది. రోడ్లు, డ్రైనేజీలు, మురికి నీటి కాలువలు, మంచినీటి వసతి, వీది దీపాల వంటి మౌలిక వసతులు ఆశించిన మేరకు కల్పించలేదని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. విలీనం వద్దు బాబోయ్‌ అంటూ ఆయా గ్రామాల ప్రజలు వ్యతిరేకించినప్పటికి వారి అభిప్రాయాలను పట్టించుకోలేదు. దీంతో ఈ ఐదేళ్లలో ఒరిగిందేమి లేదని, పన్నుల భారం, వ్యయ ప్రయాసలు చివరకు జనన మరణ దృవీకరణ పత్రాలకు కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆయా ప్రాంతాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

మరోసారి రాష్ట్ర ప్రభుత్వం కొత్తపల్లి మున్సిపాలిటీతో పాటు చింతకుంట, మల్కాపూర్‌, లక్ష్మీపూర్‌, బొమ్మకల్‌, దుర్శేడ్‌, గోపాల్‌పూర్‌ గ్రామాలను విలీనం చేసింది. ఈ గ్రామాల ప్రజలు కూడా విలీనంతో ఉపాధి హామి పనులు కోల్పోతామని, ఇప్పటికే విలీన గ్రామాల్లో అభివృద్ది జరగలేదని, తమ గ్రామాలను విలీనం చేయవద్దంటూ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. వారి అభ్యంతరాలను పక్కన పెట్టి కార్పొరేషన్‌లో కలిపి 60 డివిజన్లను 66 డివిజన్లుగా చేశారు. దీంతో కార్పోరేషన్‌ విస్తీర్ణం, జనాభా గణనీయంగా పెరిగిందే కానీ, వారికి ఒరిగిందేమి లేదు.

ఫ ముడునాళ్ల ముచ్చటగా కొత్తపల్లి మున్సిపాలిటీ

కొత్తపల్లి మేజర్‌ గ్రామ పంచాయతీని 2020లో మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ చేశారు. దీంతో గ్రామం పట్టణంగా మారి వేగంగా అభివృద్ది చెందుతుందని అక్కడి ప్రజలు ఎంతో ఆశపడ్డారు. మున్సిపాలిటీగా మార్చిన తరువాత ఎన్నికలు నిర్వహించి పాలక వర్గానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడంతో ఆశించిన అభివృద్ధి జరగలేదు. మరో ఐదేళ్లకైనా అభివృద్ది జరుగుతుందని మొట్ట మొదటి పాలకవర్గ సభ్యులు, ప్రజలు ఆశించారు. ఊహించని విదంగా ఐదేళ్లకే కొత్తపల్లి మున్సిపాలిటీని రద్దు చేస్తూ కరీంనగర్‌ కార్పోరేషన్‌లో విలీనం చేశారు. కార్పొరేషన్‌లో విలీనం అయిన తరువాత ఆఘమేఘాలపై మున్సిపాలిటీ ఆస్తులను, రికార్డులను స్వాదీనం చేసుకున్నారే తప్ప ప్రత్యేకంగా ఇచ్చిన నిధులంటూ ఏమి లేదు. దీంతో అక్కడి ప్రజలు మున్సిపాలిటీని రద్దు చేసి కార్పొరేషన్‌ లో చేర్చినందున ఇంటి పన్నులు, ఇంటి అనుమతుల ఫీజులు పెరుగుతున్నాయే తప్ప ఒరిగిందేమి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విలీనంపై దృష్టి సారించకుండా అభివృద్దిపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

ఫ ప్రత్యేక నిధులు కేటాయిస్తేనే..

కార్పోరేషన్‌ పరిధిని పెంచుతూ గ్రామాలను విలీనం చేస్తున్న ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఎన్నికలకు ముందే ప్రత్యేక అధికారి పాలనలో విలీన డివిజన్లు, శివారు గ్రామాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Jul 10 , 2025 | 12:57 AM