Karimnagar: శిథిలావస్థలో లక్ష్మీదేవిపల్లి వంతెన
ABN , Publish Date - Jul 20 , 2025 | 12:33 AM
గంగాధర, జూలై 19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని లక్ష్మీదేవిపల్లి వాగుపై ఉన్న లో లెవల్ వంతెన శిథిలావస్థకు చేరింది. నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి వచ్చే మత్తడి నీరు ఈ వంతెన కింద నుంచే పోతుంది.
శిథిలమైన లక్ష్మీదేవిపల్లి వంతెన
- వర్షాలు కురిస్తే ఇబ్బందులు
- నిధులు మంజూరైనా ప్రారంభం కాని పనులు
గంగాధర, జూలై 19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని లక్ష్మీదేవిపల్లి వాగుపై ఉన్న లో లెవల్ వంతెన శిథిలావస్థకు చేరింది. నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి వచ్చే మత్తడి నీరు ఈ వంతెన కింద నుంచే పోతుంది. ప్రతి సంవత్సరం వరదల సమయంలో వంతెన మునుగుతుండడతో గంగాధర, రామడుగు, పెగడపల్లి మండలాల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అధికారులు కొత్త బ్రిడ్జి నిర్మాణానికి నాలుగు కోట్ల నిధులు మంజూరు చేశారు. రెండేళ్ల క్రితం రహదారి వంతెన నిర్మాణ పనులకు శిలాఫలకం వేసి శంకుస్థాపన చేశారు. సంబందిత కాంట్రాక్టర్ ఇప్పటికీ పనులు ప్రారంభించలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం వచ్చింది. ఈ యేడూ ఇబ్బందులు తప్పేలా లేవని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫ అధికారుల సమన్వయ లోపం
వంతెన నిర్మాణానికి అధికారుల సమన్వయ లోపమే కారణం. కొత్త వంతెన నిర్మించాలంటే విద్యుత్ లైను మార్చాల్సి ఉంటుంది. ఈ లైను వేయాలంటే 20 లక్షల ఖర్చవుతుందని విద్యుత్ అధికారులు అంచనా వేస్తున్నారు. వంతెన నిర్మాణ నిధుల్లో విద్యుత్ లైను కలుపుకుని టెండరు పిలిస్తే పనులు సాగుతుండేవి. పనులు ప్రారంభానికి వచ్చే సరికి విద్యుత్ లైను ఆటంకం ఏర్పడింది. దీనికి నిధులు మంజూరు చేస్తే గాని పనులు ప్రారంభమయ్యేలా లేవు. దీంతో రెండేళ్లుగా నాలుగు కోట్ల నిధులు మూలుగుతున్నాయి. గంగాధర మండలంలోని 50 శాతం గ్రామాల్లోని విద్యార్థులు కళాశాలల, పాఠశాలలకు ఈ దారి మీదుగానే వెళతారు. వర్షాలు కురిస్తే వారు తీవ్ర ఇబ్బందులు పడతారు.
ఫ నాగిరెడ్డిపూర్ కల్వర్టుపై పట్టింపేది?
లక్ష్మీదేవిపల్లి, నాగిరెడ్డిపూర్ పక్కపక్క గ్రామాలు. నారాయణపూర్ రిజర్వాయర్ మత్తడి నీరు లక్ష్మీదేవిపల్లి, నాగిరెడ్డిపూర్ నుంచి రామడుగు మీదుగా కరీంనగర్ వరకు వెళతాయి. చిన్న వరద వచ్చినా నాగిరెడ్డిపూర్ కల్వర్టు మునిగిపోయి గ్రామానికి రాకపోకలు నిలిచిపోతాయి. గ్రామస్థులు లక్ష్మీదేవిపల్లి మీదుగా ప్రయాణించాల్సి వస్తుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.