Karimnagar: కాంగ్రెస్‌లోనే కర్ర రాజశేఖర్
ABN , Publish Date - Nov 07 , 2025 | 11:24 PM
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్) అర్బన్ బ్యాంకు చైర్మన్ కర్ర రాజశేఖర్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శుక్రవారం కలిశారు.
- ఆశీస్సులు అందించిన సీఎం రేవంత్‌రెడ్డి
- బీజేపీకి నిరాశ
- పనిచేయని ‘వెలిచాల’ హెచ్చరికలు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
అర్బన్ బ్యాంకు చైర్మన్ కర్ర రాజశేఖర్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శుక్రవారం కలిశారు. అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో రాజశేఖర్ ప్యానల్ విజయం సాధించి చైర్మన్‌గా ఆయన పదవీబాధ్యతలు చేపట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి అభినందనలు, ఆశీస్సులు అందజేశారు. రాజశేఖర్‌కు ఆర్థికంగా ఇతరత్రా సహాయసహకారాలు అందించామని, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ పరోక్ష తోడ్పాటు కారణంగానే ఆయన ప్యానల్ విజయం సాధించిందని ప్రచారం చేసుకున్న బీజేపీ రాజశేఖర్ ముఖ్యమంత్రిని కలిసి ఆశీస్సులు పొందడంతో నిరాశకు గురైంది. రాజశేఖర్ ప్యానల్‌లో బీజేపీకి చెందిన వారున్నారని, బీజేపీ, బీఆర్‌ఎస్‌తో లోపాయికారి సంబంధాలు పెట్టుకొని ఆయన విజయం సాధించాడని, ఆయనపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు ప్రకటించారు. ఆయన అభిప్రాయాన్ని అధిష్ఠానం లెక్కలోకి తీసుకోలేదు. 12 మంది డైరెక్టర్లు ఉండే అర్బన్ బ్యాంకు పాలకవర్గంలో రాజశేఖర్ పోటీలో దింపిన ఇండిపెండెంట్ ప్యానల్‌లో తొమ్మిది మంది గెలుపొందారు. రాజేందర్‌రావు బలపరిచిన ప్యానల్‌లో ఇద్దరు గెలువగా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించాడు. రాజశేఖర్ పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే డైరెక్టర్లతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లి మంత్రి పొన్నం ప్రభాకర్‌ను, రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ను కలిశారు. వారిద్దరిని గెలుపొందిన అభ్యర్థులందరూ మూకుమ్మడిగా వెళ్లి కలవడంతోనే అర్బన్ బ్యాంకు పాలకవర్గం కాంగ్రెస్ పార్టీకి చెందిందని ధ్రువపడింది. ఆ తర్వాత రాజశేఖర్ శుక్రవారం ముఖ్యమంత్రిని కలిసి ఆయన నుంచి అభినందనలు, ఆశీస్సులు అందుకున్నారు.
ఫ పలు కీలక పరిణామాలు
రాజశేఖర్ గతంలో రెండుసార్లు అర్బన్ బ్యాంకు చైర్మన్‌గా పనిచేశారు. ఈ రెండు సందర్భాల్లోనూ ఆయన కాంగ్రెస్‌కు చెందిన వ్యక్తిగానే ప్రచారం చేసుకొని గెలుపొందారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సన్నిహిత మిత్రుడైన రాజశేఖర్ ఈసారి ఎన్నికలకు ముందు కూడా ఆయనను కలిసి తాను పోటీచేయాలనుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం అర్బన్ బ్యాంకుకు పర్సన్ ఇన్‌చార్జి కమిటీని నియమించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ అండదండలతో గడ్డం విలాస్‌రెడ్డి చైర్మన్‌గా ఆరునెలలపాటు ఆ పదవిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో విలాస్‌రెడ్డి కూడా మళ్లీ పోటీ చేయడానికి ఆసక్తి చూపుతూ మంత్రి పొన్నంను కలిశారు. అటు విలాస్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలా... రాజశేఖర్‌ను పోటీలో నిలపాలా అన్న విషయం ఆయన ముందుకు రాగా పార్టీ ప్యానల్ ఏదీ లేదని, ఎవరికి వారుగా గెలిచి రమ్మని సూచించడంతో వారిద్దరూ తలో ప్యానల్ పెట్టుకున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు నిర్మల్ భరోసా పేరుతో మరో ప్యానల్‌ను బరిలో నిలిపారు. విలాస్‌రెడ్డి ప్యానల్‌లో ఎవరూ విజయం సాధించలేదు. రాజేందర్‌రావు ప్యానల్‌లో ఇద్దరు మాత్రమే గెలుపొందగా రాజశేఖర్ ప్యానల్‌లో తొమ్మిది మంది విజయం సాధించారు. రాజశేఖర్ ప్యానల్‌లో బీజేపీకి చెందిన ముగ్గురు మాజీ డైరెక్టర్లు పోటీ చేశారు. వీరిలో ఇద్దరు గెలుపొందారు. ఇండిపెండెంట్ ప్యానల్‌గానే దీనిని వారు పేర్కొన్నా గెలిచిన తర్వాత బీజేపీ తమ ప్యానల్‌గా భావించి ప్రకటనలు చేసింది. కాంగ్రెస్ ఇన్‌చార్జిగా ఉన్న వెలిచాల రాజేందర్‌రావు రాజశేఖర్‌పై ఫిర్యాదు చేస్తానని విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి ప్రకటించారు. అటు మంత్రి పొన్నం ప్రభాకర్, మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందనలు ఆశిస్సులు అందడంతో రాజశేఖర్ కాంగ్రెస్‌లోనే ఉన్నారని, అర్బన్ బ్యాంకు పీఠంపై కాంగ్రెస్ పార్టీ పాలకవర్గం ఏర్పడిందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో జరిగిన ఈ పరిణామం బీజేపీకి, రాజేందర్‌రావుకు షాక్ ఇచ్చినట్లయింది.