చీకట్లో కరీంనగర్
ABN , Publish Date - Sep 02 , 2025 | 12:32 AM
కరీంనగర్‌లో సగానికిపైగా కాలనీలు రాత్రి అయితే చాలు అంధకారంలో మగ్గుతున్నాయి. ఏడాది కాలంగా నగరపాలక సంస్థలో వీధి దీపాల నిర్వహణకు అవసరమయ్యే పరికరాలు, విడిభాగాలు లేకపోవడంతో చెడిపోయిన వీధి దీపాలను మరమ్మతు చేయలేని పరిస్థితి నెలకొంది.
కరీంనగర్ టౌన్, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌లో సగానికిపైగా కాలనీలు రాత్రి అయితే చాలు అంధకారంలో మగ్గుతున్నాయి. ఏడాది కాలంగా నగరపాలక సంస్థలో వీధి దీపాల నిర్వహణకు అవసరమయ్యే పరికరాలు, విడిభాగాలు లేకపోవడంతో చెడిపోయిన వీధి దీపాలను మరమ్మతు చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో చాలా ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగడం లేదంటూ ప్రజలు నిత్యం ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు.
ఫ విలీన గ్రామాలతో పెరిగిన విస్తీర్ణం
60 డివిజన్లతో కూడిన కరీంనగర్ నగరపాలక సంస్థలో సమీపంలోని కొత్తపల్లి మున్సిపాలిటీతోపాటు చింతకుంట, మల్కాపూర్, గోపాల్‌పూర్, దుర్శేడ్, బొమ్మకల్ గ్రామాలు విలీనమయ్యాయి. దీంతో నగరం విస్తీర్ణం పెరిగింది. విస్తీర్ణం మేరకు కొత్తగా వీధి దీపాలను హైమాస్ లైట్లను జంక్షన్లో అభివృద్ధి చేసేందుకు అవసరమైన పరికరాలు లేకపోవడంతో కొత్తగా వాటిని ఏర్పాటు చేయలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఎక్కడైనా వెలగని వీధి దీపాలను, హైమాస్ట్ లైట్లను రిపేర్ చేసి వెలిగేలా చేసేందుకు పరికరాలు లేకపోడంతో అవి అలంకారప్రాయంగానే మిగులుతున్నాయి. ప్రస్తుతం నగరంలోని 600 మినీ హైమాస్ట్ లైట్లలో దాదాపు 40 శాతానికిపైగా వెలగడం లేదు. విలీన గ్రామాల్లో ఐదు వేలకుపైగా వీధి దీపాలు, కొత్తపల్లి మున్సిపాలిటీలో అక్కడక్కడ హైమాస్ట్ లైట్లు ఉండగా వాటిలో 20 శాతం వరకు వెలగడం లేదు. గతంలో ఓ కంపెనీ వీధి దీపాలను ఏర్పాటు చేసి వాటి నిర్వహణ బాధ్యతను చూసేది. ఆరు నెలల క్రితం ఆ కంపెనీ కంట్రాక్టు గడువు ముగియడంతో పరికరాలు రావడం లేదు. కొద్దిరోజుల క్రితం మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ వీధి దీపాలకు సంబంధించిన పరికరాల కోసం ప్రైవేట్ వ్యక్తులకు కాంట్రాక్టును అప్పగించగారు. వారు సరఫరా చేస్తున్న పరికరాలు సరిపోవడం లేదు.
ఫ కొద్ది రోజులే స్మార్ట్ వెలుగులు
స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఆకర్షణీయమైన లైట్లను ఏర్పాటు చేసినా సదరు కాంట్రాక్టు సంస్థ నాణ్యత ప్రమాణాలను పాటించకపోవడంతో కొద్ది రోజులకే చెడిపోయాయి. వాటి మరమ్మతులకు అవసరమయ్యే పరికరాలు లేకపోవడంతో అలంకారప్రాయంగా మిగిలిపోయాయి. అసంపూర్తిగా ఉన్న రోడ్లతో ఇబ్బందులు పడుతున్న నగరవాసులు రాత్రి వేళల్లో వీధి దీపాలు లేక మరింత ఇక్కట్లు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి వీధి దీపాల నిర్వహణ సరిగా జరిగేలా చూడాలని నగరవాసులు కోరుతున్నారు.