Karimnagar: ట్రైబ్యునల్ ఉత్తర్వుల అమలును పర్యవేక్షించాలి
ABN , Publish Date - Aug 30 , 2025 | 11:55 PM
కరీంనగర్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వయోవృద్ధుల పోషణ, సంరక్షణ చట్టాన్ని అనుసరించి ట్రైబ్యునల్ ఉత్తర్వుల అమలును పర్యవేక్షించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.
- వృద్ధులకు న్యాయం చేయాలి
- కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వయోవృద్ధుల పోషణ, సంరక్షణ చట్టాన్ని అనుసరించి ట్రైబ్యునల్ ఉత్తర్వుల అమలును పర్యవేక్షించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో వయోవృద్ధులు, తల్లిదండ్రుల పోషణ, సంక్షేమ చట్టం-2007 అమలు తీరు, ట్రైబ్యునల్ ఉత్తర్వులు, అమలుపై వృద్ధుల సంక్షేమ కమిటీ సభ్యులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు తల్లిదండ్రుల బాగోగులు చూడడం లేదని, శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారని, బలవంతంగా ఆస్తిపత్రాలపై సంతకాలు చేయించుకుంటున్నారని ఆర్డీవో ట్రైబ్యునల్ చాలా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. వాదోపవాదాల తర్వాత వయోవృద్ధులు, తల్లిదండ్రుల సంక్షేమానికి మెయింటనెన్స్ సొమ్ము ఇవ్వాల్సిందిగా ట్రైబ్యునల్ ఉత్తర్వులు వెలువరిస్తుందని తెలిపారు. ఈ తీర్పులను ఒకటి, రెండు నెలలు అమలు చేసి తర్వాత బేఖాతరు చేస్తున్నారని తెలిపారు. అందువల్ల తల్లిదండ్రులు, వయోవృద్ధులు కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ అధికారుల కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని తెలిపారు. జిల్లా సంక్షేమశాఖ కార్యాలయం, రెవెన్యూ, పోలీస్, సఖి కేంద్రాల నుంచి ఒక్కో అధికారి బృందంగా ఏర్పడి ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులు సక్రమంగా అమలు జరుగుతున్నది, లేనిది క్షేత్రస్థాయిలో విచారించాలని అన్నారు. ఫిర్యాదు చేసిన వయోవృద్ధుల యోగక్షేమాలను ఈ బృందం పర్యవేక్షించి నివేదిక సమర్పించాలన్నారు. తద్వారా ఈ చట్టం పటిష్టంగా అమలు జరిగే అవకాశం ఉందన్నారు. అంతిమంగా అధికారులు, వయోవృద్ధులకు న్యాయం చేయాలని తెలిపారు. వయోవృద్ధుల కేసులకు సంబంధించి ఆర్డీవో ఆధ్వర్యంలోని ట్రైబ్యునల్‌లో ప్రతి శనివారం నిర్వహించే విచారణ సమయంలో ఒక పోలీస్ అధికారికి విధులు కేటాయించాలని సీపీకి సూచించారు. ట్రైబ్యునల్ జారీ చేసిన విధంగా మెయింటనెన్స్ సొమ్మును తల్లిదండ్రులకు ఇవ్వాలని సూచించారు. కలెక్టర్ ఇచ్చిన ఈ ఆదేశాలపై వయోవృద్దుల సంక్షేమ కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్‌బాబు, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్, డీసీహెచ్‌ఎస్ కృష్ణప్రసాద్, అడిషనల్ డీఆర్డీవో రవికిరణ్, వయోవృద్దుల సంక్షేమ కమిటీ సభ్యులు కేశవరెడ్డి, జనార్దన్‌రావు, రామేశం, రాధ పాల్గొన్నారు.