karimnagar : నల్లా కనెక్షన్లకు అక్రమ వసూళ్లు
ABN , Publish Date - Nov 17 , 2025 | 12:56 AM
కరీంనగర్ టౌన, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఇంటికి శుద్ధిచేసిన నల్లానీటిని అందించేందుకు గత ప్రభుత్వం మిషన భగీరథ పథకాన్ని అమలు చేసింది.
- రూపాయికే కనెక్షన... రోడ్ కటింగ్‌కు రూ. వెయ్యిపైనే
- ఇదేమి అదనపు బాదుడు అంటున్న జనం
- బల్దియాలో ఉద్యోగుల ఇష్టారాజ్యం
కరీంనగర్ టౌన, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఇంటికి శుద్ధిచేసిన నల్లానీటిని అందించేందుకు గత ప్రభుత్వం మిషన భగీరథ పథకాన్ని అమలు చేసింది. పేద, మధ్యతరగతి ప్రజలపై ఆర్థికభారం పడకుండా నల్లానీటిని అందించాలనే సదుద్దేశంతో సర్దార్ రవీదర్‌సింగ్ మేయర్‌గా ఉన్నప్పుడు తెల్లు రేషనకార్డు ఉన్నవారందరికి రూపాయికే నల్లా కనెక్షన ఇవ్వాలని చేసిన ప్రతిపాదనకు ఆనాటి పాలకవర్గం ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా రూపాయికే నల్లా కనెక్షనను కరీంనగర్ నగరపాలక సంస్థలో మంజూరు చేశారు. అప్పటి వరకు ఉన్న అక్రమ క్రమబద్ధీకరించారు. నల్లా లేని ఇంటి యజమానులు రూపాయి చెల్లించి కనెక్షన తీసుకున్నారు. దీంతో నగరపాలక సంస్థకు ప్రతినెలా నల్లా కనెక్షన్ల నుంచి వచ్చే ఆదాయం భారీగా పెరిగింది. నల్లా కనెక్షనకు గతంలో సర్వేయర్ నుంచి మ్యాప్ జత చేసి దరఖాస్తు చేసుకోవాలని ఉన్న నిబంధనలను కూడా తొలగించడంతో కనెక్షన్లను తీసుకునేందుకు చాలా మంది ముందుకు వచ్చారు.
విలీన గ్రామాల్లో..
నగరపాలక సంస్థకు ఆనుకొని ఉన్న గ్రామపంచాయతీలు పద్మనగర్, రేకుర్తి, సీతారాంపూర్, ఆరెపల్లి, తీగలగుట్టపల్లి, వల్లంపహాడ్, సదాశివపల్లి, అల్గునూర్ గ్రామాలను విలీనం చేశారు. ఇటీవల కొత్తపల్లి మున్సిపాలిటీతోపాటుగా చింతకుంట, మల్కాపూర్, బొమ్మకల్, గోపాల్‌పూర్, దుర్శేడ్ గ్రామాలను కార్పొరేషనలో కలిపివేశారు. అప్పటి వరకు గ్రామ పంచాయతీల్లో ఉన్న ఈ డివిజన్లలో అమృత-2 పథకం కింద మంజూరైన నిధులతో కొత్తగా మంచినీటి ట్యాంకుల నిర్మాణంతోపాటు పైపులైన్లను వేసి ఇంటింటికి నల్లానీరు అందించే కార్యక్రమం కొనసాగుతోంది. తెల్ల రేషనకార్డు ఉన్నవారికి రూపాయికి, రేషనకార్డు లేని వారికి 200 రూపాయలకు మొదటి కనెక్షన, రెండో కనెక్షన తీసుకునే వారు వెయ్యి రూపాయల డిపాజిట్ చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో మిషన భగీరథ పనులు పూర్తయిన ప్రాంతాల్లో నల్లా కనెక్షన్లను తీసుకుంటున్నారు.
ఫ ముమ్మరంగా కనెక్షన్ల తనిఖీ
ఇంటింటికి వెళ్ళి నల్లా కనెక్షన్లకు అనుమతి ఉందా ఉంటే పాసుబుక్ చూడాలని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఇంజనీరింగ్, నీటి నిర్వహణ విభాగం ఉద్యోగులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఆ నల్లా హౌ’ఏ కనెక్షన కింద ఎన్ని ఇంచుల కోసం తీసుకొని ఎన్ని ఇంచుల పైపు కనెక్షనతో నీటిని తీసుకుంటున్నారని పరిశీలించాలన్నారు. పాసుబుక్ లేకుంటే ఆ కనెక్షన క్రమబద్ధీకరణకు నోటీసులు ఇవ్వాలన్నారు. గృహావసరాల పేరిట కనెక్షన తీసుకొని వాణిజ్య అవసరాల నీటిని వినియోగిస్తే ఆ మేరకు చార్జీలు వసూలు చేయాలని సూచించారు. నల్లా కనెక్షన్ల వివరాలను సేకరించాలని ఆదేశించారు. ఓ వైపు అక్రమ నల్లాల కోసం వివరాల సేకరణ, మరో వైపు కొత్తగా కనెక్షన్లు ఇస్తుండడంతో నల్లా కనెక్షన్ల అక్రమ వసూళ్లకు మున్సిపల్ సిబ్బంది పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఫ అడ్డగోలుగా దోపిడీ
విలీన డివిజన్లలో రూపాయితో కనెక్షన ఇస్తే రోడ్డు కటింగ్, కనెక్షన పేరిట వెయ్యి రూపాయల నుంచి మొదలుకుని ఇష్టం వచ్చినట్లు సిబ్బంది వసూలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. నల్లా నీరు ఎక్కువగా వచ్చేలా కనెక్షన ఇస్తామని, రోడ్డు తవ్విన చార్జీలు మీరే భరించాలంటూ వసూలు చేస్తున్నారని ఆయా డివిజన్ల ప్రజలు అంటున్నారు. రూపాయి కనెక్షనకు వేల రూపాయలు వసూలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇంజనీరింగ్ అధికారులు ఈ విషయంలో ఫిట్టర్లకే అధికారం ఇచ్చి వసూలు చేయిస్తున్నారని, కొంత మంది ఫిట్టర్లు పైస్థాయి అధికారులకు కొంత ఇవ్వాల్సి ఉంటుందని వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రతి ఇంటికి నల్లానీటిని అందిస్తుంటే కొంత మంది సిబ్బంది చేస్తున్న అక్రమ వసూళ్ళతో బల్దియాకు చెడ్డపేరు వస్తోంది. కొత్తగా నల్లా కనెక్షన్లు ఇవ్వడంలోకానీ, అక్రమ నల్లాలను సక్రమం చేసే విషయంలో కానీ అక్రమ దందా జరుగకుండా కమిషనర్ ప్రత్యేక దృష్టి పెట్టాలని నగరవాసులు కోరుతున్నారు.