Karimnagar: విస్తారంగా వర్షం
ABN , Publish Date - Aug 29 , 2025 | 12:50 AM
కరీంనగర్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
- రాక పోకలకు ఆటంకం
- చింతకుంట ఎస్సారెస్పీ కెనాల్‌లో ఒకరి గల్లంతు
- ఇళ్లలోకి చేరిన వరద నీరు
- నిండుకుండల్లా చెరువులు
- అత్యధికంగా వీణవంకలో 13.2 మి.మి.
కరీంనగర్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొత్తపల్లి మండలం చింతకుంట ఎస్సారెస్పీ కెనాల్‌లో కరీంనగర్ కశ్మీర్‌గడ్డకు చెందిన షజీ ఉర్ రహ్మాన్ (21) అనే వ్యక్తి చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యాడు. కొత్తపల్లి పట్టణంలోని పలు ఇళ్లలోకి, బస్టాండ్ ప్రాంతంలోని పలు దుకాణాల్లోకి వరద నీరు చేరింది.
- తిమ్మాపూర్ మండలం పోరండ్లలో ఊర చెరువు నిండి మత్తడి దూకింది. దీంతో వరద నీరు రోడ్డుపై నుంచి ప్రవహించడంతో రాక పోకలకు ఇబ్బందులు తలెత్తాయి. మట్టిరోడ్డు దెబ్బతినడంతోపాటు, వరద నీరు పంట పొలాల్లోకి వెళ్లాయి. గొల్లపల్లిలో బొమ్మలకుంట చెరువు కట్ట తెగిపోయి పంట పొలాల్లోకి నీరు చేరింది. దీంతో యాభై ఎకరాల వరకు పంట చేలల్లో ఇసుక మేటలు వేశాయి.
- గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి, పారువెల్ల, గన్నేరువరం గ్రామాల్లోని చెరువు కల్వర్టుల వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో మండల కేంద్రానికి రాక పోకలు నిలిచిపోయాయి.
- జమ్మికుంట మండలంలోని తనుగుల గ్రామానికి చెందిన సత్యనారాయణకు చెందిన పెంకుటిల్లు పాక్షికంగా దెబ్బతిన్నది. మానకొండూర్ మండలంలో వివిధ గ్రామాల్లో చెరువులు కుంటలు నిండిపోయి మత్తడి దూకుతున్నాయి. పలు గ్రామాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. అన్నారంలో లో లెవల్ బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహిస్తుండడంతో రాక పోకలకు ఇబ్బందులు తలెత్తాయి. వీణవంక వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడడంతో గ్రామాల్లో చెరువులు, కుంటల్లో భారీగా వరద నీరు చేరుతోంది.
- కరీంనగర్ రూరల్ మండలంలోని జూబ్లినగర్, వరి పంట పొలాలు, గోపాల్‌పూర్‌లో పత్తి చేలలోకి నీరు చేరింది. రామడుగు మండలంలోని రైల్వే ట్రాక్‌పై నీరు ప్రవహించడంతో వెంకటగిరి వద్ద రైలును నిలిపి వేశారు. ఇల్లందకుంట మండలంలోని పాతర్లపల్లె గ్రామ బ్రిడ్జిని ఆనుకుని వరద నీరు పారుతుంది. హుజూరాబాద్‌లో ఒక ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నది.
- గంగాధర మండలం బూర్గుపల్లి, గట్టుబూత్కూర్ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. శంకరపట్నం మండలం అరకండ్ల వాగు ఉదృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గన్నేరువరం మండల కేంద్రం చుట్టు ఉన్న చెరువుల నుండి వరద నీరు ప్రవహించడంతో మండల కేంద్రానికి రాక పోకలు నిలిచిపోయాయి. పందివాగు ఉదృతంగా ప్రవహించడంతో ఆర్నకొండ, రాగంపేట గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
- తిమ్మాపూర్ మండలంలో బొమ్మలమ్మ కుంట చెరువు కట్ట తెగిపోయింది. దీనితో చెరువు కింద ఉన్న 50 ఎకరాల వరి పొలాలు నీటమునిగాయి. రామకృష్ణకాలనీకి వెళ్లే మట్టి రోడ్డు కొట్టుకుపోయింది. జిల్లాలోని సగానికి పైగా చెరువులు నిండి మత్తడి దూకుతున్నాయి.
- భారీగా కురుస్తున్న వర్షానికి జిల్లా వ్యాప్తంగా మండలాల్లోని చెరువులు, కుంటలు నిండు కుండలా మారిపోతున్నాయి. కొత్తపల్లి పట్టణంలోని చెరువులోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరిపోగా మత్తడి దూకుతున్నది.
ఫ నగరంలోనూ వరద తాకిడి
నగరంలోని బోయవాడలో ఒక పాత ఇల్లు భారీగా కురుస్తున్న వర్షానికి కూలిపోయింది. మానేరు శ్మశాన వాటికలో వర్షపు నీరు చేరింది. నగరంలోని టీవీ టవర్, రాంనగర్, ఆర్టీసీ వర్క్‌షాపు రోడ్లు వర్షపు నీటితో జలమయంగా మారాయి. దీంతో నగరవాసులు ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.