Karimnagar: భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి పూజలు
ABN , Publish Date - Jul 11 , 2025 | 12:15 AM
కరీంనగర్ కల్చరల్, జూలై 10 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని వివిధ ఆలయాల్లో గురువారం గురుపౌర్ణమి పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
- భక్తులతో పోటెత్తిన ఆలయాలు
కరీంనగర్ కల్చరల్, జూలై 10 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని వివిధ ఆలయాల్లో గురువారం గురుపౌర్ణమి పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయాల్లో సందడి కనిపించగా సాయి ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. సాయినగర్ విజయగణపతి సాయిబాబా దేవాలయంలో ఉదయం అభిషేకం, పుష్పార్చన, విశేషాలంకారం, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ జరిగాయి. 24 గంటల అఖండ సాయి నామ సంకీర్తన ప్రారంభించారు. సాయంత్రం పల్లకీసేవ నిర్వహించారు. భాగ్యనగర్ సాయిబాబా ఆలయంలో అభిషేకాలు, హవనం, అన్నప్రసాద వితరణ నిర్వహించారు. సాయంత్రం పల్లకీ సేవ జరిగింది. రామచంద్రాపూర్ కాలనీ సాయిబాబా దేవాలయంలో గణపతి హోమం, విఘ్నేశ్వర, దత్తాత్రేయ, సాయిబాబా మూర్తులకు అభిషేకం, అర్చనలు, అన్నప్రసాద వితరణ జరిగాయి. వేదభవనంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. అశోక్‌నగర్ మళయాళ సద్గురు గీతామందిర సన్యాస మఠంలో మఠాధిపతి విష్ణుసేవానందగిరిస్వామి ఆధ్వర్యంలో భగవన్నామ జప మంత్రాలు ప్రారంభించారు. బొమ్మకల్‌రోడ్‌లోని పంచముఖ హనుమాన్ ఆలయంలో పీఠాధిపతి పరబ్రహ్మానంగిరిస్వామికి సన్మానం, గురుపూజ చేశారు. టీటీడి కల్యాణ మండపంలో పతంజలి యోగా సమితి ఆద్వర్యంలో మళయాళ సద్గురు గీతామందిర సన్యాస మఠంలో మఠాధిపతి విష్ణుసేవానందగిరిస్వామి నేతృత్వంలో ఆర్యసమాజ్ పురోహితుడు శంకరయ్య హవనం నిర్వహించారు.