Karimnagar : కరీంనగర్ సమీపంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం
ABN , Publish Date - Aug 09 , 2025 | 01:06 AM
(కరీంనగర్, ఆంధ్రజ్యోతి ప్రతినిధి) వేగంగా అభివృద్ధి చెందుతున్న కరీంనగర్ జిల్లా కేంద్రం సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు మరోసారి తెరపైకి వచ్చింది.
- సానుకూలంగా ఉన్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి
- స్థల పరిశీలనకు అంగీకరించడంతో ఆశలు
- ఏర్పాటు చేస్తే ఉమ్మడి జిల్లా ప్రజలకు ఉపయోగకరం
(కరీంనగర్, ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
వేగంగా అభివృద్ధి చెందుతున్న కరీంనగర్ జిల్లా కేంద్రం సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు మరోసారి తెరపైకి వచ్చింది. ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలో బసంత్‌నగర్ సమీపంలో సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఏర్పాటు చేసుకున్న రన్‌వే స్థలంలో మినీ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన వచ్చింది. పారిశ్రామిక కేంద్రమైన రామగుండం, గోదావరిఖనితో పాటు బొగ్గు గనులు ఉన్న మంచిర్యాల, బెల్లంపల్లి ప్రాంతాలకు కరీంనగర్‌కు సమదూరంలో ఉండే ఈ ప్రాంతంలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అప్పుడు అందరూ అభిప్రాయపడ్డారు. కేంద్ర విమానయాన శాఖ సానుకూలంగా స్పందించి అందుకు గల అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించింది. అక్కడ స్థలం తక్కువగా ఉడడంతో పాటు, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లు నిర్మించుకోవడంతో ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి అనుకూలంగా లేదని తేల్చారు. ఆ తర్వాత గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్‌ల ప్రతిపాదనలు వచ్చిన సమయంలో వరంగల్ జిల్లా మామునూరు వద్ద దీనిని నిర్మించాలని భావించి అందుకు అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం కరీంనగర్ ఎయిర్‌పోర్ట్ అంశం తెరపైకి వచ్చింది.
ఫ కేంద్ర మంత్రిని కలిసిన సుడా చైర్మన్
రెండు రోజుల క్రితం ఢిల్లీలో కరీంనగర్ శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటి ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, వరంగల్ కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటి చైర్మన్ ఇనుగాల వెంకటరాంరెడ్డి కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రాంమోహన్‌నాయుడును కలిశారు. కరీంనగర్‌లో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు, ఇప్పటికే అనుమతించిన మామునూరు ఎయిర్‌పోర్ట్ గురించి చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి రాంమోహన్‌నాయుడు మామునూరు ప్రాంత పరిశీలనకు వచ్చిన సందర్భంలో కరీంనగర్‌లోనూ స్థల పరిశీలన జరిపించి ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు ఉన్న అవకాశాల గురించి అధ్యయనం చేయిస్తానని హామి ఇచ్చారు. దీంతో కరీంనగర్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుపై ఈ ప్రాంత ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
ఫ పలు అనుకూలతలు
ఉత్తర తెలంగాణ ప్రాంతంలో వరంగల్ తర్వాత వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాగా కరీంనగర్, అంతే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా కరీంనగర్ కార్పొరేషన్ నిలుస్తున్నాయి. కరీంనగర్ కార్పొరేషన్‌ను కేంద్రం ఇప్పటికే స్మార్ట్ సిటీగా ప్రకటించి కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి పరిచింది. జిల్లాలో విదేశీ మారకద్రవ్యాన్ని సమకూర్చి పెట్టే గ్రానైట్ పరిశ్రమ ఉంది. ఇక్కడ సుమారు 250 గ్రానైట్ క్వారీలు, 400 ఫ్యాక్టరీలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి ఏటా కోట్లలో ఆదాయం సమకూరుతున్నది. చైనా తదితర దేశాలకు ఇక్కడ నుంచి కాకినాడ పోర్టు ద్వారా గ్రానైట్ ఎగుమతి జరుగుతున్నది. విదేశాల నుంచి గ్రానైట్ రాయి కొనుగోలుకు వ్యాపారులు రావడం ఇక్కడ నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్లడానికి హైదరాబాద్ ఎయిర్‌పోర్టే ఆధారంగా ఉన్నది. రామగుండం పారిశ్రామిక ప్రాంతం కరీంనగర్‌కు 70 కిలోమీటర్ల పరిధిలోనే ఉండడం, ఉమ్మడి జిల్లా పరిధిలో పుణ్యక్షేత్రాలైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం, ధర్మపురి లక్ష్మీనర్సింహాస్వామి ఆలయం ఉన్నాయి. వ్యవసాయకంగా అభివృద్ధి చెంది వరి ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో నిలుస్తున్నది. ఇక్కడ నుంచి బియ్యం ఎగుమతి గణనీయంగా ఉన్నది. ఈ ప్రాంతవాసులు వేలాది మంది గల్ఫ్ దేశాల్లో అమెరికా, అస్ట్రేలియా, కెనడా, దుబాయి, తదితర దేశాల్లో ఉన్నారు. విద్యార్థులు వేల సంఖ్యలో ప్రతి ఏటా విదేశాలకు వెళుతుంటారు. ఈ ప్రాంతంలో విమానశ్రయ ఏర్పాటు చేస్తే వారందరికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఉమ్మడి జిల్లా పరిధిలో మూడు ప్రభుత్వ వైద్య కళాశాలలు, రెండు ప్రైవేట్ వైద్య కళాశాలలు ఉండడంతో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వైద్య విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. వీరందరి ప్రయాణాలకు కూడా ఈ ఎయిర్‌పోర్ట్ ఉపయోగపడుతుంది. బసంత్‌నగర్‌లో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేయడం వీలు కాదని తేలిన నేపథ్యంలో ఎన్టీపీసీ, ఎఫ్‌సీఐ, సింగరేణిలో పనిచేసే వివిధ రాష్ట్రాలకు చెందిన వారికి ఈ ఎయిర్‌పోర్ట్ దగ్గరగా ఉండి వారి ప్రయాణ అవసరాలు తీర్చే వీలు కలుగుతుంది.
ఫ అందుబాటులో 432 ఎకరాల భూమి
జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేయడానికి ప్రత్యేకంగా స్థల సేకరణ ఏది చేయాల్సిన అవసరం లేకుండానే 432 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. నేదునూరు విద్యుత్ కేంద్రం ఏర్పాటు కోసం సేకరించిన భూమి ఇప్పుడు ఆ ప్రతిపాదన విరమించుకోవడంతో ఖాళీగా ఉంది. రాజీవ్ రహదారికి సమీపంలో ఉంది. ఈ స్థలమే కాకుండా చొప్పదండి ప్రాంతంలో కూడా 200 ఎకరాల పైచిలుకు ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నది. ఈ రెందు ప్రాంతాల్లో ఎదో ఒక చోట కరీంనగర్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేస్తే జిల్లా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది. దీంతో స్థల సేకరణ ఇబ్బందులు కూడా ఉండవు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రాంమోహన్‌నాయుడు ఈ ఎయిర్ పోర్ట్ ఏర్పాటు అంశంపై సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కరీంనగర్, ఎంపీ బండి సంజయ్‌కుమార్ ఈ విషయంలో చొరవ చూపి ఇక్కడ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు అయ్యే విధంగా చూడాలని ప్రజలు కోరుతున్నారు.