Karimnagar: ఎరువుల సమస్య రాకుండా చూడాలి
ABN , Publish Date - Aug 01 , 2025 | 12:51 AM
కరీంనగర్, జూలై 31 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రైతులకు ఎరువుల సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు.
డబుల్ బెడ్‌రూం ఇళ్లను పరిశీలిస్తున్న కలెక్టర్ పమేలా సత్పతి, అధికారులు
కరీంనగర్, జూలై 31 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రైతులకు ఎరువుల సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో డీఏవో భాగ్యలక్ష్మి, ఏడీఏలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తూ ఎరువుల దుకాణాల్లో ధరల పట్టికను సూచించేలా బోర్డును ఏర్పాటు చేయించాలన్నారు. స్టాక్ వివరాలు పక్కాగా నమోదు చేయాలని, దుకాణాల్లో తప్పనిసరిగా టోల్‌ఫ్రీ నంబర్ రైతులకు కనిపించేలా ఏర్పాటు చేయించాలని సూచించారు. జిల్లాలో ఆయిల్‌పామ్ సాగును పెంచేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఫ పారాక్వాట్ విక్రయాల్లో నిబంధనలు పాటించాలి
పంటల్లో కలుపు నివారణకు ఉపయోగించే పారాక్వాట్(గడ్డి మందు)ను విక్రయించే ఫెస్టిసైడ్ డీలర్లు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఫెస్టిసైడ్ డీలర్లు, టీఎస్ ఎంసీఈసీ సభ్యులు, డీఏపీపీ సభ్యులు డాక్టర్ బండారి రాజ్‌కుమార్, నెఫ్రాలజిస్టు డాక్టర్ రాకేష్, వ్యవసాయశాఖ అధికారులతో పారాక్వాట్ మందు దుష్పరిణామాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారాక్వాట్ పిచికారీ సమయంలోనూ జాగ్రత్తలు తీసుకోకుంటే గాలి ద్వారా రైతుల ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. ఈ మందు మీద పడినా ప్రమాదమేనన్నారు. విక్రయించిన డీలర్ వద్ద తప్పనిసరిగా రైతుల వివరాలను ఉండాలని సూచించారు. రైతుల సంతకం, ఆధార్, పట్టాదారు పుస్తకం, ఫోన్ నంబర్ వివరాలను తీసుకోవాలన్నారు. ఈ మందు అమ్మేటప్పుడు రశీదుపై డీలర్ సంతకం, పంటలకే ఉపయోగిస్తానని రైతు సంతకం తీసుకోవాలన్నారు. ఏఈవో అనుమతి లేకుండా ప్రమాదకరమైన ఈ మందును రైతులకు విక్రయించవద్దని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, డాక్టర్ రాజ్‌కుమార్, ఏడీలు శ్రీధర్, మహేష్, రాజేందర్, ప్రియదర్శిని పాల్గొన్నారు.
డబుల్ బెడ్‌రూం ఇళ్ల పెండింగ్ పనులు పూర్తి చేయాలి
డబుల్ బెడ్‌రూం ఇళ్ల పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. గురువారం కొత్తపల్లి మండలం చింతకుంటలోని డబుల్ బెడ్‌రూం ఇళ్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డబుల్ బెడ్‌రూం ఇళ్లలో మౌలిక సౌకార్యలు కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్‌అండ్‌బీ ఈఈ నరసింహాచారి పాల్గొన్నారు.