Share News

karimnagar : నత్తనడకన కంటి పరీక్షలు

ABN , Publish Date - Apr 28 , 2025 | 12:45 AM

సుభాష్‌నగర్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): జాతీయ ఆరోగ్య మిషన్‌ పథకం కింద ఆరేళ్లలోపు చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల్లో కంటి పరీక్షలు (స్ర్కీనింగ్‌) నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

karimnagar :  నత్తనడకన కంటి పరీక్షలు

- వేధిస్తున్న సిబ్బంది కొరత

- నిర్ణీత గడువులో పూర్తి అయ్యేనా ?

సుభాష్‌నగర్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): జాతీయ ఆరోగ్య మిషన్‌ పథకం కింద ఆరేళ్లలోపు చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల్లో కంటి పరీక్షలు (స్ర్కీనింగ్‌) నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 7 నుంచి ఈ స్ర్కీనింగ్‌ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ సెంటర్లలో ప్రారంభించారు. స్ర్కీనింగ్‌ పరీక్షల్లో ఎవరైనా చిన్నారి కార్నియా సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తిస్తే వారికి వైద్య కళాశాలలో చికిత్స అందిస్తారు. మానసిక సమస్యతో బాధపడుతున్నవారిని గుర్తించి వారికి మెరుగైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటారు.

ఫ జిల్లా వ్యాప్తంగా 18 బృందాలు

జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు కంటి పరీక్షలు నిర్వహించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆధ్వర్యంలో 18 వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఎంబీబీఎస్‌ డాక్టర్‌, ఆయుష్‌ డాక్టర్‌, ఆప్తమెట్రిస్ట్‌, ఫార్మసిస్టు, ఒక ఏఎన్‌ఎం ఉంటారు. వీరు ప్రతి రోజు ఒక ఊరికి వెళ్లి అక్కడి అంగన్‌వాడీ సెంటర్‌లో ఉన్న పిల్లలకు పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో బృందం 150 మంది చిన్నారులకు పరీక్షలు నిర్వహించాలి.

ఫ 3,675 మంది చిన్నారులకే వైద్య పరీక్షలు

జిల్లా వ్యాప్తంగా 777 అంగన్‌వాడీ సెంటర్లు ఉన్నాయి. అందులో ఆరు సంవత్సరాలలోపు పిల్లలు 47,742 ఉన్నారు. ఇప్పటి వరకు 79 అంగన్‌వాడీ సెంటర్లలో 3,675 మంది చిన్నారులకు మాత్రమే వైద్యపరీక్షలు నిర్వహించారు. అందులో ఒక్కరు మాత్రమే కార్నియాతో బాదపుడున్నట్లు, 11 మంది చిన్నారులు ఇతర కంటి సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించామని జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ సాజిదా తెలిపారు.

ఫ గడువులోగా పూర్తి అయ్యేనా...

ఏప్రిల్‌ 7న ప్రారంభించిన స్ర్కీనింగ్‌ పరీక్షలు వంద రోజుల్లో పూర్తి చేయాలి. నలుగురు ఆప్తమెట్రిస్ట్‌లు నలుగురు ఉండగా అందులో ఇద్దరు ఇటీవల పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం ఇద్దరు మాత్రమే ఉన్నారు. వారితోనే స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గడువులోగా పూర్తి కావాలంటే ప్రత్యామ్నయ మార్గాలు చూడాలి. రిటైర్డ్‌ ఆప్తమెట్రిస్ట్‌ల సేవలను వినియోగించుకుంటే సకాలంలో లక్ష్యాన్ని పూర్తి చేయవచ్చు. అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

ఫ పరీక్షలు కొనసాగుతున్నాయి....

- డాక్టర్‌ సాజిదా, రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమ అధికారి

జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీ సెంటర్లలోని చిన్నారులకు కంటి స్ర్కీనింగ్‌ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఆప్తమెట్రిస్ట్‌ల కొరత ఉన్నది. అందుబాటులో ఉన్న సిబ్బందితో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సహకారంతో గడువులోగా పరీక్షలు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం.

Updated Date - Apr 28 , 2025 | 12:45 AM