Share News

Karimnagar: తీరని యూరియా కష్టాలు

ABN , Publish Date - Aug 20 , 2025 | 12:30 AM

తిమ్మాపూర్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. తిమ్మాపూర్‌, చిగురుమామిడి, సైదాపూర్‌ మండలాల్లో రైతులు యూరియా కోసం తెల్లవారుజామునే సొసైటీ కేంద్రాలకు చేరుకున్నారు.

Karimnagar:   తీరని యూరియా కష్టాలు

తిమ్మాపూర్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. తిమ్మాపూర్‌, చిగురుమామిడి, సైదాపూర్‌ మండలాల్లో రైతులు యూరియా కోసం తెల్లవారుజామునే సొసైటీ కేంద్రాలకు చేరుకున్నారు. తిమ్మాపూర్‌ మండలంలోని మొగిళిపాలెంలో మంగళవారం రైతులు తెల్లారు జామునే వచ్చి చెప్పులు లైన్‌లో పెట్టారు. మొగిళిపాలెంలోని ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రానికి 220, మల్లాపూర్‌, పొలంపల్లి గ్రామాల్లోని శాఖలకు 700 యూరియూ బస్తాలు వచ్చాయి. నిర్వాహకులు ప్రతిరైతుకు రెండు బస్తాలను అందజేశారు. అవి సరిపోకపోవడంతో అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ప్రైవేటు షాపుల్లో వ్యవసాయానికి సంబంధించిన ఇతర ఉత్పత్తులు కొంటేనే యూరియా బస్తాలు ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఫ చిగురుమామిడి: మండలంలోని ఇందుర్తిలో మంగళవారం తెల్లవారు జాము నుంచే యూరియా కోసం మహిళా రైతులు క్యూలో నిల్చున్నారు. ప్రతి ఇంటి నుంచి భార్యాభర్తలు ఇద్దరు క్యూలో నిల్చున్నారు. మధ్యాహ్నం వరకు వేచి ఉండగా ఒక్కొక్క రైతుకు రెండు బస్తాల చొప్పున 170 మంది రైతులకు పంపిణీ చేసినట్లు ఏఈవో సతీష్‌ తెలిపారు. పక్క మండలం కోహెడ నుంచి అనేక గ్రామాల రైతులు రావడంతో ఇక్కడి రైతులకు ఇబ్బందిగా మారిందని ఏఈవో తెలిపారు.

ఫ సైదాపూర్‌: మండల కేంద్రంలోని వెన్కేపల్లి సొసైటీకి 230 బస్తాలు రాగా సొసైటీ సిబ్బంది, వ్యవసాయాధికారులు ఒకొక్కరికి ఒక్కో బస్తా చొప్పున పంపిణీ చేశారు. యూరియా దొరకని రైతులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫ శంకరపట్నం: మండలంలోని కరీంపేట సహకార సంఘం పంపిణీ కేంద్రానికి మంగళవారం 230 యూరియా బస్తాలు వచ్చాయి. రైతులు భారీగా చేరుకోవడంతో పోలీసుల సహకారంతో పంపిణీ చేశారు. నిర్వహకులు ఒక్కో రైతుకు ఒక్కో బస్తా చొప్పున పంపిణీ చేశారు. తాడికల్‌కు 450 బస్తాలు రాగా ఏడీఏ శ్రీధర్‌, ఏవో వెంకటేశ్‌ పర్యవేక్షణలో పంపిణీ చేశారు.

Updated Date - Aug 20 , 2025 | 12:30 AM