Karimnagar: ఎండిన వరి పైరు
ABN , Publish Date - Nov 21 , 2025 | 12:08 AM
మానకొండూర్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా సుమారు 30 వేల ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు.
- హార్వెసర్ల కొరతతో కోతల్లో జాప్యం
మానకొండూర్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా సుమారు 30 వేల ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. ఎల్‌ఎండీ నుంచి సాగు నీరు అందడం, గ్రామాలలో కోతుల బెడద ఎక్కువగా ఉండడంతో ఆరుతడి పంటలపై రైతులు ఆసక్తిని చూపడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు పొలాలన్నీ నేలవాలాయి. నెల రోజుల క్రితమే పొలాలు కోతకు వచ్చినా వర్షాలతో పొలాల్లో నీరు ఉండడంతో కోయడానికి వీలు లేకుండా పోయింది. ప్రస్తుతం పొలాల్లో నీరు తగ్గినా బురద ఉండడంతో సాధారణ హార్వెస్టర్లతో కోత సాధ్యం కావడం లేదు. దీంతో ట్రాక్ హార్వెస్టర్లపై రైతులు ఆధారపడుతున్నారు. గ్రామానికి ఒకటి, రెండు ట్రాక్ హార్వెస్టర్లు ఉన్నాయి. అవి తీరికలేకుండా పని చేస్తున్నా మండలంలో 30 శాతం కోతలు కూడా పూర్తి కాలేదు. ట్రాక్ హార్వెస్టర్లకు గిరాకీ ఎక్కువగా ఉండడంతో గంటకు 3,500 రూపాయలు వసూలు చేస్తున్నారు. వరి కోతల్లో జాప్యం జరుగుతుండడంతో గొలుసులు విరిగి రైతులకు నష్టం వాటిల్లుతోంది.