Karimnagar: మోదీ హయాంలో రైల్వేల అభివృద్ధి
ABN , Publish Date - May 23 , 2025 | 12:42 AM
కరీంనగర్, మే 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హయాంలో రైల్వేలు అభివృద్ధి చెందాయని, ఇందుకు కరీంనగర్ రైల్వే స్టేషనే నిదర్శమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.
- జమ్మికుంట రైల్వేస్టేషన్‌ను అమృత్ భారత్‌లో చేరుస్తాం...
- కరీంనగర్-తిరుపతి రైలు వారానికి నాలుగుసార్లు నడిచేలా చర్యలు తీసుకుంటా
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
- కరీంనగర్ రైల్వే స్టేషన్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ
కరీంనగర్, మే 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హయాంలో రైల్వేలు అభివృద్ధి చెందాయని, ఇందుకు కరీంనగర్ రైల్వే స్టేషనే నిదర్శమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ రైల్వే స్టేషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలో జమ్మికుంట రైల్వే స్టేషన్‌ను సైతం అమృత్ భారత్ పథకంలో చేర్చి ఆధునీకరిస్తామన్నారు. గతంలో బీఆర్‌ఎస్ సహా కొంతమంది నాయకులు లేఖలు రాసి చేతులు దులుపుకున్నారని, ఇప్పుడు ఇంత అభివృద్ధి జరుగుతుంటే ఇదంతా మావల్లే జరిగిందని ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కరీంనగర్ నుంచి హసన్‌పర్తి వరకు 61 కిలోమీటర్ల నూతన రైల్వే లైన్ నిర్మాణంపై సర్వే పూర్తి చేసి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేశామన్నారు. ఈ లైన్ నిర్మాణానికి 1480 కోట్ల వ్యయం అవుతుందని డీపీఆర్‌లో పేర్కొన్నారని, దీనిపై త్వరలోనే కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కరీంనగర్ నుంచి తిరుపతికి ప్రతిరోజు రైలు నడపాలని తనతోపాటు పొన్నం ప్రభాకర్ సైతం లేఖలు రాశారని, రద్దీ, సాంకేతిక కారణాలతో అది సాధ్యపడలేదన్నారు. వారానికి రెండుసార్లు నడుస్తున్న ఈ రైలును వారానికి నాలుగుసార్లు నడిచేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా 25 వేల కోట్ల వ్యయంతో 1,350 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ పథకం కింద ఆధునీకరిస్తున్నామని, వీటిలో 2 వేల కోట్ల వ్యయంతో ఆధునీకరించిన 103 రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ చేతులమీదుగా వర్చువల్‌గా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఏ దేశంలోనైనా రైల్వే, రోడ్లు, ఏవియేషన్ వ్యవస్థ బాగుపడితేనే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుందని తెలిపారు. మోదీ పాలనలో తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారని పేర్కొన్నారు. 11 ఏళ్లలో తెలంగాణలో 20కిపైగా ప్రాజెక్టులు, 2,298 కిలోమీటర్ల మేర పనులు చేపట్టామని, 42,119 కోట్ల రూపాయల విలువైన రైల్వే పనులు ప్రస్తుతం వివిధ దశల్లో కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే బడ్జెట్‌లో తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు 5,337 వేల కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. కరీంనగర్ రైల్వే స్టేషన్‌కు 27 కోట్లకుపైగా వెచ్చించి ఆధునీకరణ పనులు పూర్తి చేశామన్నారు. ఎయిర్‌పోర్టును తలపించే విధంగా లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ఏసీ వెయిటింగ్ హాళ్లు, నాన్ ఏసీ హాల్స్, ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, టాయిలెట్లు, రిజర్వేషన్ కౌంటర్లు, టికెట్ కౌంటర్లు, సోలార్ పవర్ ప్లాంట్, రోడ్డు అభివృద్ధి, ప్లాట్ ఫారం షెల్టర్ ఏర్పాటు చేశామని వివరించారు.
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక హంగులతో రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం ఎంతో అవసరమన్నారు. తాను ఎంపీగా ఉన్న సందర్భంలో కరీంనగర్ రైల్వే స్టేషన్ కోసం కృషి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కరీంనగర్ నుంచి తిరుపతికి నడుస్తున్న రైలు వారానికి రెండు సార్లు మాత్రమే ఉందని, ఈ రైలును కనీసం వారానికి నాలుగు రోజులు నడపాలని కోరారు. కరీంనగర్ నుంచి చాలా మంది ముంబై, షిర్డీ వెళ్తుంటారని, వారి అవసరాల దృష్ట్య కరీంనగర్ నుంచి ఆ ప్రాంతాలకు రైలు నడపాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, చిన్నమైల్ అంజిరెడ్డి, అడిషనల్ డివిజన్ రైల్వే మేనేజర్ ఆర్ గోపాలకృష్ణన్, సీపీ గౌస్ ఆలం, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి, కాంగ్రెస్ నాయకుడు వెలిచాల రాజేందర్‌రావు, టీపీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్‌కుమార్ పాల్గొన్నారు.