Share News

karimnagar : నిమిషాల్లో నేర చరిత్ర వెల్లడి

ABN , Publish Date - Aug 11 , 2025 | 12:59 AM

ఆరు నెలల క్రితం కరీంనగర్‌ బస్టాండ్‌ సమీపంలో ఒక దుకాణం తాళాన్ని ఒక పాతనేరస్థుడు పగులగొట్టి క్యాష్‌కౌంటర్‌లోని

karimnagar :  నిమిషాల్లో నేర చరిత్ర వెల్లడి

- వేలిముద్రలతో నేరస్థుల సమాచారం

- ఫింగర్‌ప్రింట్‌ డివైస్‌తో నేరాలకు చెక్‌

- ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌పీ పరికరం

- ఆరు నెలల క్రితం కరీంనగర్‌ బస్టాండ్‌ సమీపంలో ఒక దుకాణం తాళాన్ని ఒక పాతనేరస్థుడు పగులగొట్టి క్యాష్‌కౌంటర్‌లోని 25 వేల రూపాయలు దొంగిలించుకుపోయాడు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి విచారించగా నిందితుడు ముఖానికి మాస్క్‌ వేసుకుని వచ్చినట్లు సీసీ కెమెరాలో గుర్తించారు. క్లూస్‌ టీం సంఘటనా స్థలంలో సేకరించిన వేలిముద్రలను ఫింగర్‌ప్రింట్‌ పరికరానికి అనుసంధానం చేయగానే ఆ దొంగతనానికి పాల్పడింది పాత నేరస్థుడిగా వెల్లడైంది.

ఫ కట్టరాంపూర్‌లోని ఇంటి తాళం పగులగొట్టిన దొంగ బీరువాలోని బంగారంతో పాటు టీవీని కూడడా ఎత్తుకుపోయాడు. బీరువాపై వేలిముద్రలతో దొంగను పోలీసులు పట్టుకున్నారు.

ఫ ఇటీవల పోలీసులు నగరంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఆర్టీసీ బస్టాండ్‌లో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారి వేలి ముద్రలను సేకరించి ఫింగర్‌ప్రింట్‌ డివైస్‌ ద్వారా సరిపోల్చగా వారిద్దరు పర్సులు, సెల్‌ఫోన్‌లు, డబ్బులను దొంగిలించే పాత నేరస్థులుగా వెల్లడైంది. వెంటనే అదుపులోకితీసుకుని ముందస్తు చర్యగా బైండోవర్‌ చేశారు.

కరీంనగర్‌ క్రైం, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): పోలీస్‌ శాఖలో అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం కేసుల ఛేదనకు ఎంతో ఉపయోగపడుతోంది. ఫింగర్‌ ప్రింట్‌ డివైస్‌తో పోలీసులు నిందితులను పట్టుకుంటున్నారు. గతంలో ఏదైనా దొంగతనం, దోపిడీకి సంబంధించి పోలీసు రికార్డుల్లో కేసు నమోదైతే అతని వేలిముద్రలను పోలీసుల వద్ద ఉన్న అధునాతన ఫింగర్‌ప్రింట్‌ పరికరంకు అనుసంధానం చేస్తున్నారు. వారు తనిఖీల్లో దొరికినప్పుడు నేర చరిత్ర మొత్తం బయటనపడుతుంది. ఏదైనా నేరం జరిగినప్పుడు క్లూస్‌ టీం సంఘటన స్థలంలో వేలి ముద్రలు సేకరిస్తుంది. వాటిని ఫింగర్‌ప్రింట్‌ డివైస్‌లో ఎంటర్‌ చేయగానే నేరుస్థుల గత చరిత్ర అంతా బయటకు వస్తుంది. ఈ పరికరాన్ని పోలీసులు విరివిగా వాడుతున్నారు. దొంగతనం, దోపిడీ వంటి నేరాలకు పాల్పడుతున్న నిందితులను పట్టుకునేందుకు ఫింగర్‌ప్రింట్‌ (పీఎఫ్‌) పరికరాన్ని రాత్రివేళ పోలీసు పెట్రోలింగ్‌ సమయంలో, కార్డన్‌సెర్చ్‌, ఆకస్మిక తనిఖీల్లో ఉపయోగిస్తున్నారు.

ఫ డేటా బేస్‌లో వేలిముద్రల వివరాల నిల్వ

నేరాల దర్యాప్తులో వేలి ముద్రల పరికరం పోలీసులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దొంగతనాలు, దోపడీలు, ఇతర తీవ్రమైన సంఘటనల్లో నేరస్తుల నుంచి ఎప్పటికప్పుడు వేలిముద్రలను సేకరించి డేటాబేస్‌లో నిల్వ చేస్తారు. ఈ పద్ధతి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. దీంతో పాతనేరస్థులు తనిఖీల్లో చిక్కితే ఆ నేరస్థుడు గతంలో ఎక్కడెక్కడ నేరాలకు పాల్పడ్డాడనేది వెల్లడవుతుంది. ఏదైనా నేరం జరిగిన స్థలంలో వేలి ముద్రలు లభించినప్పుడు వాటిని డేటా బేస్‌లో ఉన్న వాటితో సరిపోల్చుతారు. ఒక వేళ పాత నేరస్తుడు ఆ నేరం చేసి ఉంటే పట్టుకోవడం సులభతరం అవుతున్నది.

ఫ దర్యాప్తులో కీలకం

గతంలో మ్యానువల్‌గా చేసే వేలిముద్రల విశ్లేషణకు కొన్ని వారాల సమయం పట్టేది. ఆ తర్వాత కంప్యూటర్ల వాడకం ప్రారంభం అయినప్పటి నుంచి దీనికి రోజుల సమయం పట్టేది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన పాపిలన్‌ పరిజ్ఞానంతో ఫింగర్‌ ప్రింట్‌ డివైస్‌ ద్వారా లక్షలాది వేలి ముద్రలను కొన్ని క్షణాల్లోనే విశ్లేషించడం సాధ్యమవుతుంది. మొదట్లో ఘటన స్థలంలో దొరికిన వేలిముద్రలను డేటాబేస్‌తో సరిపోల్చడానికి మాత్రమే ఈ డివైజ్‌ను వినియోగించారు. దీని ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ పరిజ్ఞానం కలిగిన చిన్న పరికరాలను గస్తీ పోలీసులకు అందజేశారు. మొబైల్‌ ద్వారా కూడా ఈ పాపిలన్‌ పరిజ్ఞానంతో కూడిన యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని పోలీసులు వినియోగిస్తున్నారు. చేతిలో ఇమిడే ఈ పరికరం వారికి ఎంతో ఉపయోగకరంగా మారింది. చాలా మంది నిందితులు నేరం చేసినప్పటికీ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతుంటారు. పోలీసులకు ఎదరుపడ్డప్పటికి ఈ నేరస్తులను గుర్తించడం కష్టంగా ఉండేది. ప్రస్తుతం అందుబాటులోకి ఇచ్చిన ఫింగర్‌ ప్రింట్‌ డివైస్‌ ద్వారా ప్రతి అనుమానితుని వేలి ముద్రలను తీసుకుని అక్కడికక్కడే ఆ వ్యక్తి చరిత్రను తేలుస్తున్నారు. ఒక వేళ ఆ వ్యక్తికి పాత నేర చరిత్ర ఉంటే ఈ పరికరం ద్వారా వెంటనే తెలసిపోతుంది. ఇలా పాత నేరస్తుల నేరాల చిట్ట వెల్లడి కాగానే ఆ వ్యక్తులను సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కు తరలించి తదుపరి చర్యను తీసుకుంటున్నారు. వేలిముద్రలను క్షణాల్లో విశ్లేషించి నేరస్తులను వేగంగా గుర్తించేందుకు ఉపయోగించే అత్యాధునిక పరిజ్ఞానం పాపిలన్‌. ఈ పాపిలన్‌ పరిజ్ఞానం రష్యా నుంచి రాష్ట్ర పోలీసుశాఖ కొనుగోలు చేసింది. దీంతోపాటు లైవ్‌ స్కానర్‌ పరిజ్ఞానాన్ని కూడా కొనుగోలు చేశారు. లక్షలాది వేలిముద్రలను క్షణాల్లో విశ్లేషించి డేటా బేస్‌లో ఉన్న పాత నేరస్తుల వేలి ముద్రలతో పోల్చుతుంది. లైవ్‌ స్కానర్‌పై అనుమానితుల రెండు అరచేతులను ఉంచిన సమయంలో వారు గతంలో నేరస్థులై ఉంటే క్షణాల్లో వారి ఫోటోలతోసహా పూర్తి డాటా తెలిసిపోతుంది. ఈ రెండు రకాల సాంకేతిక పరిజ్ఞానం పోలీసులకు కేసుల దర్యాప్తులో కీలకంగా మారింది.

ఫ గస్తీ సమయంలో వినియోగం

జిల్లాలో దోపిడీలు, దొంగతనాలు, ఇతర తీవ్రనేరాలకు ప్పాడిన నేరస్థులకు సంబంధించి దాదాపు 20 వేల మంది నేరస్థుల వేలి ముద్రలు పోలీసులు సేకరించి హైదరాబాద్‌లోని ప్రధాన సర్వర్‌కు అనుసంధానం చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల పోలీసుల వద్ద ఉన్న డాటాను సర్వర్‌కు అనుసంధానం చేయటంతో రాష్ట్రంలోని ఎక్కడి నేరస్థుడికి సంబందించిన డాటా అయినా క్షణాల్లో ఇక్కడి పోలీసులకు ఇట్టే తెలిసిపోతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ డేటా బేస్‌లో 10 లక్షలపైగా నేరస్థుల డాటా నిక్షిప్తమై ఉన్నది. పాపిలన్‌ పరిజ్ఞానంతో కూడిన ఫింగర్‌ ప్రింట్‌(ఎఫ్‌పీ)డీవైజ్‌ పోలీసు కమిషనరేట్‌లోని ప్రతి పోలీసు స్టేషన్‌కు అందజేశారు. ఆయా ఠాణాల పరిధిలో గస్తీ సమయం, సమావేశాలు, ఇతర సమయాల్లో ఈ డివైస్‌తో పోలీసులు అక్కడ అనుమానితుల వేలిముద్రలు సేకరించి పాత నేరస్థులైతే మరో నేరం జరుగకుండా వెంటనే చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - Aug 11 , 2025 | 12:59 AM