Share News

Karimnagar: ధర లేక పత్తి రైతు దిగాలు

ABN , Publish Date - Oct 23 , 2025 | 11:45 PM

హుజూరాబాద్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): పత్తి రైతులు ధరలు లేక దిగాలు పడుతున్నారు. తేమ పేరుతో వ్యాపారులు సిండిగేట్‌గా మారి క్వింటాల్‌ పత్తికి రూ. 6వేల నుంచి రూ. 6,500వరకు ధర చెల్లిస్తూ రైతుల నడ్డివిరుస్తున్నారు.

 Karimnagar:  ధర లేక పత్తి రైతు దిగాలు

- క్వింటాల్‌కు రూ. 6వేల నుంచి రూ. 6,500

- తేమ పేరుతో తగ్గిస్తున్న వ్యాపారులు

హుజూరాబాద్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): పత్తి రైతులు ధరలు లేక దిగాలు పడుతున్నారు. తేమ పేరుతో వ్యాపారులు సిండిగేట్‌గా మారి క్వింటాల్‌ పత్తికి రూ. 6వేల నుంచి రూ. 6,500వరకు ధర చెల్లిస్తూ రైతుల నడ్డివిరుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సీసీఐ ఇంత వరకు కొనుగోలు కేంద్రం ప్రారంభించలేదు. దీంతో వ్యాపారస్థులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మొదట్లో పత్తి రైతులు విత్తనాలు విత్తగా, వర్షాలు లేక భూమిలోనే పొట్టిపోయాయి. మళ్లీ దుక్కులు దున్ని, అచ్చులు తోలి విత్తనాలు నాటారు. తీరా పూత దశలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో పత్తి పూత నేలరాలిపోయింది. ఉన్న పత్తికి తెల్ల, పచ్చదోమ అధికమవడంతో మందులు పిచికారి చేశారు. డివిజన్‌లో హుజూరాబాద్‌, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, సైదాపూర్‌, శంకరపట్నం మండలాలు ఉండగా, 1.20లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఉంది. ఇందులో 80వేల ఎకరాల్లో వరి, 25వేల ఎకరాల్లో పత్తి, 15వేల ఎకరాల్లో మొక్కజొన్న, కూరగాయలు ఇతర పంటలను సాగు చేశారు. తీరా పత్తి చేతికందే సమయంలో కూలీల కొరత ఏర్పడింది. గత వారం రోజులుగా అల్పపీడన ప్రభావం తో రైతులు భయపడి ఒక్కో కూలీకి రూ. 300నుంచి రూ. 400 చెల్లించి ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి పత్తి తీయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పత్తికి క్వింటాల్‌కు రూ. 8,110, మధ్య రకానికి రూ. 7,710 ఉండగా దళారులు తక్కువ ధర చెల్లించి రైతులను నట్టేట ముంచుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పత్తికి మద్ధతు ధర వచ్చేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Oct 23 , 2025 | 11:45 PM