karimnagar : పోటీకే సై..
ABN , Publish Date - Dec 08 , 2025 | 12:46 AM
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్) గ్రామ పంచాయతీల్లో సర్పంచులను, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ప్రోత్సాహక నిధిని అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినా ప్రజల స్పందన అంతంత మాత్రంగానే ఉంది.
- నామమాత్రంగా ఏకగ్రీవాలు
- జిల్లా వ్యాప్తంగా ఆరుగురు సర్పంచులు, 586 వార్డు సభ్యులు ఏకగ్రీవం
- మూడో విడత ఉపసంహరణకు మరో రోజు గడువు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
గ్రామ పంచాయతీల్లో సర్పంచులను, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ప్రోత్సాహక నిధిని అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినా ప్రజల స్పందన అంతంత మాత్రంగానే ఉంది. గత ఎన్నికల సమయంలో ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలను ఇవ్వలేదు. దీంతో ఈసారి ఏకగ్రీవాలను పట్టించుకోవడం లేదు. జిల్లాలో కేవలం మూడు పంచాయతీల్లో మాత్రమే సర్పంచు, వార్డుసభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరో మూడు పంచాయతీల్లో సర్పంచులను, వివిధ గ్రామ పంచాయతీల్లో 586 మంది వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లాలో 316 పంచాయతీలు ఉండగా ఆయా పంచాయతీల్లోని 316 సర్పంచ్, 2,940 వార్డుసభ్యుల పదవులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
ఫ ఏకగ్రీవమైన పంచాయతీలు
మొదటి విడతలో చొప్పదండి మండలం దేశాయిపేట గ్రామంలో వడ్లకొండ తిరుమల (ఇండిపెండెంట్) సర్పంచ్‌గా, మరో ఎనిమిది మంది వార్డుసభ్యులుు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండో విడతలో గన్నేరువరం మండలం పీచుపల్లి గ్రామపంచాయతీలో సామ రాజిరెడ్డి (బీజేపీ) సర్పంచ్‌గా, ఎనిమిది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడో విడతలో సైదాపూర్ మండలం ఆరెపల్లి గ్రామంలో వర్నె లావణ్య (ఇండిపెండెంట్) సర్పంచ్‌గా, ఎనిమిది మంది వార్డుసభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మూడు పంచాయతీల్లో మొత్తం పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ప్రభుత్వ ప్రోత్సాహకం పొందేందుకు ఆయా పంచాయతీలు అర్హత సాధించాయి.
ఫ ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్‌లు
తొలి విడతలో చొప్పదండి మండలం పెద్దకురుమపల్లి పంచాయతీల్లో మావురం సుగుణ (ఇండిపెండెంట్), రామడుగు మండలం శ్రీరాములపల్లిలో ఒంటెల సుగుణమ్మ (బీఆర్‌ఎస్), రెండో విడతలో గన్నేరువరం మండలం గోపాల్‌పూర్ గ్రామంలో ఆకుల కవిత (కాంగ్రెస్) ఏకగ్రీవంగా సర్పంచులుగా ఎన్నికయ్యారు. ఈనెల 9న మూడో విడత నామినేషన్ల ఉపసంహరణ చివరి గడువు కావడంతో ఆ రోజు మరికొన్ని వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశమున్నది. సర్పంచ్ పదవులకు అలాంటి అవకాశాలు లేవు.
ఫ పంచాయతీల్లో పోటాపోటీ
తొలి విడతలో 92 పంచాయతీల్లో 89 సర్పంచ్ పదవులకు 338 మంది, 590 వార్డులకు 1,762 మంది పోటీపడుతున్నారు. ఈ విడతలో ముగ్గురు సర్పంచులు, 276 వార్డుసభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- రెండో విడతలో 113 పంచాయతీలకు 111 సర్పంచ్ పదవులకు 438, 849 వార్డులకుగాను 2472 మంది పోటీపడుతున్నారు. ఈ విడతలో ఇద్దరు సర్పంచ్‌లు, 197 వార్డుసభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- మూడో విడతలో 111 గ్రామపంచాయతీల్లో ఆరెపల్లి గ్రామం పంచాయతీ సర్పంచ్, వార్డుసభ్యులు ఎనిమిది మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 110 సర్పంచ్ పదవులకు 687 మంది పోటీ పడుతున్నారు. 1,034 వార్డులకు 113 వార్డులకు సింగిల్ నామినేషన్ వచ్చింది. 921 వార్డులకు 2,696 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈనెల 9 వరకు ఈ నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. మరికొన్ని వార్డుల్లో కూడా సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.
ఫ పోటాపోటీ ప్రచారం...
పార్టీల ప్రాతిపదికన ఎన్నికలు జరుగకున్నా అన్ని రాజకీయ పార్టీలు తమ మద్దతుదారులను సర్పంచ్‌లుగా, వార్డు సభ్యులుగా గెలిపించుకోవాలని భావిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో తమ పట్టును నిరూపించుకునేందుకు పంచాయతీ ఎన్నికలను వేదికగా మలుచుకుంటున్నాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ప్రధానంగా పోటీపడుతుండగా బీజేపీ కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నది. గ్రామాల్లో వ్యక్తిగత పలుకుబడి ఉన్నవారు, ఆర్థికంగా స్థోమత ఉన్నవారు సర్పంచ్‌లుగా నామినేషన్ వేశారు. ఆయా గ్రామాల్లో తమ పట్టునిలుపుకునేందుకు వీరు ఎంత డబ్బు అయినా ఖర్చుపెట్టేందుకు సిద్ధపడుతున్నారు. మేజర్ గ్రామపంచాయతీల్లో, మండల కేంద్రాల్లో ఉన్న పంచాయతీల్లో రాజకీయంగా చైతన్యవంతంగా ఉన్న పంచాయతీల్లో ఈ వాతావరణం ఎక్కువగా కనిపిస్తున్నది. ఓటుకు 500 నుంచి రెండు వేల రూపాయల వరకు ఖర్చుపెట్టేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ఆయా పంచాయతీల్లో ఉన్న ఓట్లను పార్టీల వారీగా, కులాలవారీగా విభజిస్తున్నారు. ఏ వర్గానికి ఎవరి ద్వారా డబ్బులు అందించాలి, ఎవరి నేతృత్వంలో ఆయా వార్డుల్లో ప్రచారం నిర్వహించాలి అన్నది నిర్ణయించుకుని బాధ్యతలు అప్పగించారు. కుల, యువజన సంఘాల వారితో సమావేశాలు నిర్వహిస్తూ విందులను ఏర్పాటుచేస్తూ డబ్బు పంచే బాధ్యతను అప్పగించేందుకు పథకాలు రూపొందించుకున్నారు.
ఫ మొదటి విడత పంచాయతీల్లో హోరాహోరీ
మొదటి విడత ఎన్నికలు మరో నాలుగురోజుల్లో జరుగనుండగా ఆయా గ్రామపంచాయతీల్లో ఇప్పటికే మందు, డబ్బు పంపిణీ ప్రారంభమైందని సమాచారం. రెండో విడత ఎన్నికలు జరగడానికి ఆరు రోజులు, మూడో విడత ఎన్నికలు జరుగడానికి తొమ్మిది రోజుల గడువు మాత్రమే ఉండడంతో పోటీలో ఉన్నవారంతా వ్యక్తిగతంగా ఇంటింటికి వెళుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ తమకు వచ్చే ఓట్లను అంచనా వేస్తూ ఆ ఓట్లు ఇతరుల ఖాతాలో చేరకుండా చూసుకుంటున్నారు.