Share News

karimnagar : కూరగాయలకు చలిపీడ

ABN , Publish Date - Dec 29 , 2025 | 12:57 AM

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌) ఈ యేడు చలి తీవ్రత పెరిగింది. జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు తొమ్మిది డిగ్రీలకు పడిపోవడంతో తీవ్రంగా మంచు కురుస్తున్నది. ఈ వాతావరణం కూరగాయల తోటలకు ప్రతికూలంగా మారింది.

karimnagar :   కూరగాయలకు చలిపీడ

- తగ్గిన దిగుబడి

- పెరిగిన ధరలు

- ఏది కొన్నా కిలో రూ. 80 నుంచి 100

- ఆకు కూరల ధరలూ పైపైకి..

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ఈ యేడు చలి తీవ్రత పెరిగింది. జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు తొమ్మిది డిగ్రీలకు పడిపోవడంతో తీవ్రంగా మంచు కురుస్తున్నది. ఈ వాతావరణం కూరగాయల తోటలకు ప్రతికూలంగా మారింది. మొక్కల ఆకులు పెలుసుబారి నల్లబడి దిగుబడి తగ్గిపోతున్నది. కొత్తపల్లి మండల కేంద్రంలో జంగాలపల్లి మల్లేశం అనే రైతు మూడెకరాల్లో టమాట సాగు చేశాడు. దిగుబడి తగ్గడంతో పంటను పూర్తిగా తీసివేశాడు. మార్కెట్‌లో ఏ కూరగాయలైనా కిలో 80 నుంచి 100 రూపాయల వరకు ధర పలుకుతున్నది. ఆకు కూరలకు కూడా 60 రూపాయల నుంచి 80 రూపాయలు వెచ్చించాల్సి రావడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు.

వెయ్యి ఎకరాల్లో సాగు

జిల్లా వ్యాప్తంగా రైతులు సుమారు వెయ్యి ఎకరాల్లో ఆకు కూరలు, కూరగాయలు సాగు చేస్తున్నారు. జిల్లా జనాభా అవసరాలు తీరే విధంగా కూరగాయల తోటల సాగు లేకపోవడంతో ఇతర జిల్లాల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో జిల్లాలో కూరగాయల దిగుబడి బాగా తగ్గిపోవడంతో ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కరీంనగర్‌ రూరల్‌, తిమ్మాపూర్‌, మానకొండూరు తదితర మండలాల్లో కూరగాయల తోటలు సాగు చేస్తారు. ఇక్కడి రైతులు బీర, బెండ, కాకర, టమాట, మిర్చి, క్యాబేజీ, కాలీఫ్లవర్‌, చిక్కుడు, బీన్స్‌, కారెట్‌, ఆకు కూరలు, కొత్తిమీర, మెంతి, పూదీన పండిస్తారు. ఈసారి ఉత్తరాది ప్రాంతాలను తలిపించే విధంగా చలి పంజా విసురుతోంది. సాధారణంగా కూరగాయలు అధికంగా పండే ఈ సీజన్‌లో 50 నుంచి 60 రూపాయలకు కిలో దొరికేవి. దిగుబడి తగ్గిపోవడంతో ప్రస్తుతం కిలో కూరగాయలకు 80 నుంచి 100 రూపాయల వరకు చెల్లించాల్సి వస్తోంది.

రాలిపోతున్న పూత, పిందె

సాధారణంగా ఈ సీజన్‌లో అన్ని కూరల్లో వాడే టమాట కిలో 20 నుంచి 30 మించేది కాదు.. ప్రస్తుతం 60 నుంచి 80 రూపాయల ధర పలుకుతున్నది. బీర, బెండ, కాకర, చిక్కుడు కూరగాయలు 80 నుంచి 100 రూపాయలు, ఒక్కో సోరకాయ ధర 40 రూపాయలు, పచ్చిమిర్చి 100 రూపాయలకు కిలో అమ్ముతున్నారు. చలి కారణంగా పిందె దశలోనే రాలి పోతుండడం, ఆకులపై పడ్డ మంచుతో ఆకులు పెలుసుబారి నల్లబడి పోవడం, పూత రాలిపోవడంతో కూరగాయల దిగుబడి తగ్గుతున్నది. మార్కెట్‌లో వినియోగదారులకు ఒక్కో రోజుకు కనీసం 200 రూపాయలు వెచ్చిస్తే తప్ప ఆరోజు కూరగాయల అవసరాలు తీరడం లేదు. కూరగాయల ధరలు పెరిగినా రైతుకు మాత్రం ఆ ధరలు అందడం లేదు. మధ్య దళారీలు సాధారణ ధర కంటే కిలోకు 5 రూపాయలు పెంచి కొనుగోలు చేస్తున్నారు. వినియోగదారులకు గతంలో కంటే 50 శాతం అధిక ధరలకు అమ్ముతున్నారు.

70 శాతం దిగుబడి తగ్గింది

- మాదన వీరయ్య, రైతు, తిమ్మాపూర్‌

సాధారణంగా ఈ సీజన్‌లో ఎకరానికి 15 టన్నుల కూరగాయల దిగుబడి వచ్చేది. ప్రస్తుతం చలి తీవ్రత అధికంగా ఉండడంతో ఎకరాకు మూడు టన్నుల నుంచి నాలుగు టన్నుల దిగుబడి మాత్రమే వస్తుంది. చలి అధికంగా ఉండడంతో 70 శాతం దిగుబడి తగ్గింది. ఐదెకరాల్లో అలసంద, కీరదోస, బెండ, టమాట, కాలీప్లవర్‌ సాగు చేశాను. చలికి పొగమంచు మిర్చి, బెండ, కాకర, బీర, కీరదోస ఆకుల మీద పడడంతో మొక్కలకు భూమినుంచి పోషకాలు తగిన మోతాదులో అందలేదు. దీంతో మొక్కల ఎదుగుదల నిలిచిపోయింది. నవంబరు నుంచి జనవరి వరకు దిగుబడి తక్కువగా వస్తుంది.

చలి తీవ్రత ప్రభావం అధికంగానే ఉంది

- మాదన సత్తయ్య, తిమ్మాపూర్‌

చలి తీవ్రత కూరగాయల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం చలి తీవ్రతతో దిగుబడి చాలా తగ్గిపోయింది. నాలుగు ఎకరాల్లో కాకర, కాలీఫ్లవర్‌, మిర్చి, టమాట పంటలు పండిస్తున్నాను. ఎకరం పొలంలో బీర పంట సాగు చేస్తే రోజు తప్పించి రోజు క్వింటాల్‌ కన్నా ఎక్కువే కోతకు వచ్చేవి. ఇప్పుడు 50 కిలోలు మాత్రమే వస్తున్నాయి. సోరకాయలు 200 వచ్చేవి.. ఇప్పుడు 80 వస్తున్నాయి. టమాట వారానికి 50 బాక్సులు వచ్చేవి. ప్రస్తుతం 20 బాక్సులు రావడం కష్టంగానే ఉంది.

Updated Date - Dec 29 , 2025 | 12:57 AM