Share News

Karimnagar: వలసకూలీల పిల్లలను బడిలో చేర్పించాలి

ABN , Publish Date - Dec 05 , 2025 | 11:38 PM

కరీంనగర్‌ టౌన్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా వలస కూలీలు, కార్మికుల పిల్లలను గుర్తించి వారిని ప్రత్యేక పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్‌ పమేలాసత్పతి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

Karimnagar:  వలసకూలీల పిల్లలను బడిలో చేర్పించాలి

- కలెక్టర్‌ పమేలా సత్పతి

కరీంనగర్‌ టౌన్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా వలస కూలీలు, కార్మికుల పిల్లలను గుర్తించి వారిని ప్రత్యేక పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్‌ పమేలాసత్పతి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మండల విద్యాధికారులు, ఇటుకబట్టీలు, పరిశ్రమల యజమానులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వలస కూలీల నివాసం ఉండే ప్రాంతాలకు సమీపంగా ఉన్న పాఠశాలల్లో ప్రత్యేక తరగతిలో బోధిస్తున్నామన్నారు. ఇటుక బట్టీలు, పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల పిల్లలను గుర్తించి వారిని బడిలో చేర్పించాలని ఆదేశించారు. వారికి పౌష్టికాహారం, దుస్తులు, పుస్తకాలు అందిస్తామన్నారు. ఇటుక బట్టీల యజమానులు కూలీల పిల్లలకి రవాణా సౌకర్యం కల్పించాలని సూచించారు.

- ‘పది’ విద్యార్థులపై దృష్టిపెట్టండి :

పదో తరగతి చదువుతున్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టిపెట్టి వంద శాతం ఫలితాలు వచ్చేలా చూడాలని కలెక్టర్‌ పమేలాసత్పతి ఎంఈవోలను ఆదేశించారు. పదోతరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను ప్రత్యేకాధికారులు పర్యవేక్షించాలని, ఎప్పటికప్పుడు స్లిప్‌ టెస్టులు నిర్వహిస్తూ బోర్డు పరీక్షలకు సిద్ధం చేయాలని సూచించారు. అన్ని పాఠశాలలకు మధ్యాహ్న భోజనం వండేందుకు గ్యాస్‌ కనెక్షన్‌ ఇచ్చామని, వాటిని విధిగా వినియోగించాలని అన్నారు. సమావేశంలో డీఈవో మొండయ్య, విద్యాశాఖ క్వాలిటీ కో ఆర్డినేటర్‌ అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.

ఫ అంగన్‌వాడీల్లో చిన్నారులను చేర్పించాలి

తిమ్మాపూర్‌: అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులను చేర్పించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అలుగునూర్‌ కాకతీయ కాలనీ అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన శుక్రవారం సభకు కలెక్టర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య బోధిస్తున్నారన్నారు. పిల్లల ఆరోగ్యం, పోషణపై అంగన్‌వాడీ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారిస్తారని, ఇది చిన్నారులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన హెల్త్‌ క్యాంపును కలెక్టర్‌ పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, మెప్మా పీడీ స్వరూపారాణి, ఇంచార్జ్‌ సీడిపివో శ్రీలత, తహసిల్థార్‌ శ్రీనివాస్‌ రెడ్డి, చైల్డ్‌ లైన్‌ కోఆర్డినేటర్‌ సంపత్‌, డీహెచ్‌ఈడబ్లూ కోఆర్డినేటర్‌ శ్రీలత, సఖి కేంద్రం అడ్మిన్‌ లక్ష్మి, మెప్మా డీఎంసీ శ్రీవాణి పాల్గొన్నారు.

Updated Date - Dec 05 , 2025 | 11:38 PM