Karimnagar: పోక్సో కేసుల్లో 60 రోజుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేయాలి
ABN , Publish Date - Nov 22 , 2025 | 11:25 PM
పోక్సో కేసుల్లో 60 రోజుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేయాలని సీపీ గౌస్
కరీంనగర్ క్రైం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): పోక్సో కేసుల్లో 60 రోజుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేయాలని సీపీ గౌస్ ఆలం అధికారులను ఆదేశించారు. నవంబరు నెలకు సంబంధించిన నేర సమీక్షా సమావేశాన్ని కమిషనరేట్ కేంద్రంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ గౌస్ ఆలం అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం 63 పోక్సో కేసులు దర్యాప్తులో ఉన్నాయని, ఇందులో 32 కేసుల్లో నిర్ణీత గడువులోగా చార్జ్‌షీట్లు దాఖలు కాలేదన్నారు. కమిషనరేట్ వ్యాప్తంగా 2,540 కేసులు దర్యాప్తు దశలో ఉన్నాయన్నారు. ముఖ్యంగా కరీంనగర్ వన్ టౌన్, టూ టౌన్, మహిళా పోలీస్ స్టేషన్, కొత్తపల్లి స్టేషన్లలో పరిమితికి మించి కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. జాప్యం లేకుండా కేసులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతిరోజు ఉదయం 7-10 గంటల వరకు, సాయంత్రం 4-7గంటల వరకు స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించాలన్నారు. అతివేగం, ర్యాష్ డైవ్రింగ్, డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. జమ్మికుంట ఫ్లైఓవర్, కొత్తపల్లి-జగిత్యాల రోడ్డులోని ప్రమాదకర ప్రాంతాల్లో రేడియం బోర్డులు, డివైడర్లు, బ్లింకర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆసుపత్రుల నుంచి అనస్తీషియా మందులు బయటకు తీసుకువచ్చి మత్తు కోసం వాడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై నిఘా ఉంచాలన్నారు. దొంగతనాల కేసుల్లో రికవరీ శాతం 42.77 శాతం మాత్రమే ఉందని, దీనిని మెరుగుపరచడానికి స్పెషల్ టీంలను ఏర్పాటు చేయాలన్నారు. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా వచ్చిన 6,242 ఫిర్యాదుల్లో రికవరీ శాతం 30 శాతం మాత్రమే ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. మొబైల్స్ రికవరీకి అత్యంత ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు. హిట్ అండ్ రన్ కేసుల్లో బాధితులకు ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారం అందేలా చూడాలన్నారు. బాధితులకు నోటీసులు ఇచ్చి ఆర్డీవో ఆఫీసులో దరఖాస్తు చేసుకునేలా సహకరించాలన్నారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ భీంరావు(ఏఆర్), ఏసీపీలు వెంకటస్వామి, యాదగిరిస్వామి, మాధవి, శ్రీనివాస్, శ్రీనివాస్ జి, వేణుగోపాల్, విజయకుమార్, వాసాల సతీష్ పాల్గొన్నారు.