Karimnagar: భక్తి పాశం... ధనుర్మాసం...
ABN , Publish Date - Dec 15 , 2025 | 12:24 AM
కరీంనగర్ కల్చరల్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించి మకర సంక్రమణం (జనవరి 14) వరకూ కొనసాగే భక్తి పాశానికి ప్రతీకగా నిలిచిపోయే 30 రోజుల ధనుర్మాసం మంగళవారం మధ్యాహ్నం 12-57 నిముషాల నుంచి ప్రారంభమవుతుంది.
- రేపటి నుంచి ధనుర్మారంభం
కరీంనగర్ కల్చరల్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించి మకర సంక్రమణం (జనవరి 14) వరకూ కొనసాగే భక్తి పాశానికి ప్రతీకగా నిలిచిపోయే 30 రోజుల ధనుర్మాసం మంగళవారం మధ్యాహ్నం 12-57 నిముషాల నుంచి ప్రారంభమవుతుంది. మార్గళి మాసంగా పిలిచే ఈ మాసం విశిష్టాద్వైత సాంప్రదాయ పరులకు, శ్రీవైష్ణవులకు విశిష్టమైంది. ఆండాళ్, రంగనాయకి, శూడి కొడుత్త నాచ్చియార్, ఆముక్తమాల్యదగా పిలుచుకునే గోదాదేవి భక్తితో పూజించి రంగనాఽథుడిని భర్తగా పొంది, 12 మంది ఆళ్వారులలో స్థానం సంపాదించుకుంది. ఆమె పాడిన 30 తమిళ పాశురాలు (కీర్తనలు) ఎంతో ప్రాచుర్యం చెందాయి. భక్తురాలైన ఆమె ఆచరించిన వ్రతానే గోదా, శ్రీ, మార్గళి, కాత్యాయని వ్రతమని పిలుస్తారు.
ఫ వ్రత విధానం
స్వామి ప్రతిమకు మధుసూదనుడు అని పేరు పెట్టి షోడషోపచారాలతో పూజించాలి. రోజూ తులసీదళాలతో అర్చించాలి. నైవేద్యంగా నెయ్యి, బియ్యం, పెసరపప్పు, బెల్లం, మిరియాలు, జీలకర్ర వేసి ఉడికించిన పొంగలిని నైవేద్యంగా పెట్టాలి. తొలి 15 రోజులు ఇలా చేస్తూ ఆ తర్వాత 15 రోజులు దద్ద్యోజననాన్ని నైవేద్యం గాపెట్టాలి. రోజుకో పాశురం చొప్పున స్వామిని పూజించాలి. ముఖ్య పాశురాల రోజుల్లో విశేష పూజలు, కూడారై నాడు ప్రత్యేక పాత్రల్లో పాయసాన్ని ఉంచి నైవేద్యంగా పెట్టాలి. వ్రత మధ్య కాలంలో లేదా చివరన వీలును బట్టి గోదారంగనాఽథ కల్యాణం నిర్వహించాలి.
ఫ కిటకిటలాడనున్న వైష్ణవాలయాలు..
మంగళవారం నుంచి వైష్ణవాలయాలు పాశుర అనుసంధానాలు, కాలక్షేపాలతో మార్మోగనున్నాయి. సాలగ్రామ అభిషేకాలు, పూజలు, విశేషాలంకారాలు, ద్రవిడ ప్రబంధ పారాయణాలు, ప్రవచనాలు, భగవన్నామ సంక్తీరనలు, భజనలు జరుగనున్నాయి. ఆది, సోమ వారాల్లో మూల, ఉత్సవ మూర్తులకు, సాలగ్రామలకు తిరుమంజనం చేయనున్నారు. మార్కెట్‌రోడ్, విద్యానగర్, మంకమ్మతోట, జడ్పీ క్వార్టర్స్, కట్టరాంపూర్, జ్యోతినగర్ వేంకటేశ్వరాలయాలు, సప్తగిరికాలనీ, వావిలాలపల్లి, గాంధీరోడ్, శ్రీరామనగర్ రామాలయాలు, యజ్ఞవరాహక్షేత్రం, మహాశక్తి ఆలయంతో పాటు విష్ణు సంబంఽధ ఆలయాల్లో, శ్రీవైష్ణవ సాంప్రదాయ పరుల గృహాల్లో ధనుర్మాసం వైభవంగా జరుపుకోనున్నారు.