Karimnagar: భాగవతం మానవాళికి మార్గదర్శకం
ABN , Publish Date - Dec 15 , 2025 | 12:22 AM
కరీంనగర్ కల్చరల్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): భాగవతం మానవాళికి మార్గదర్శకంగా నిలుస్తుందని, ఆ గ్రంథాన్ని చదివినా, విన్నా ఇహలోక సుఖం, పరలోక మోక్షం దక్కుతాయని ఫణతుల మేఘరాజ్‌శర్మ అన్నారు.
- సప్తాహ ప్రవచనం ముగింపులో మేఘరాజ్‌శర్మ
- ఘనంగా రుక్మిణీ కల్యాణం
కరీంనగర్ కల్చరల్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): భాగవతం మానవాళికి మార్గదర్శకంగా నిలుస్తుందని, ఆ గ్రంథాన్ని చదివినా, విన్నా ఇహలోక సుఖం, పరలోక మోక్షం దక్కుతాయని ఫణతుల మేఘరాజ్‌శర్మ అన్నారు. నగరంలోని వైశ్యభవన్‌లో సుధామ వాకింగ్ ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏడు రోజులుగా నిర్వహిస్తున్న సప్తాహ ప్రవచనం ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా మేఘరాజ్‌శర్మ ప్రసంగిస్తూ భాగవతం జీవిత సత్యాలను, ధర్మాన్ని ప్రబోధించే విజ్ఞాననిధి అని అన్నారు. సత్యసంధత, వినయం, కరుణ, భక్తి వంటి సద్గుణాలను నేర్పుతుందని తెలిపారు. నవ విధ భక్తులను ఆచరిస్తూ ఉన్నత విలువలతో కూడిన జీవితాన్ని గడిపి జీవితాలను సుగమం చేసుకుని చివరన పరమాత్మ సాయుజ్యాన్ని పొందాలని అన్నారు. భాగవత, రామాయణ, భారతాలను నిత్య పారాయణ గ్రంథాలుగా భావించి తాము చదువుతూ ఇతరులకు వివరిస్తూ తరించాలని పిలుపునిచ్చారు. యువత, విద్యార్థులు ఆయా గ్రంథాల్లోని అంశాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. అనంతరం రుక్మిణీ శ్రీకృష్ణ కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా మేఘరాజ్‌శర్మను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నిర్వాహకులు బోనగిరి వేణుగోపాల్, చింతకింది శ్రీనివాస్, గంప కైలాస్, గజవాడ రవి, బంధం అశోక్, ఇతర సభ్యులతోపాటు సుమారు నాలుగు వేల మంది భక్తులు పాల్గొన్నారు.