Karimnagar: సృష్టి ఉన్నంతకాలం సంస్కృతి ఉంటుంది
ABN , Publish Date - Sep 25 , 2025 | 12:02 AM
కరీంనగర్ కల్చరల్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): సృష్టి ఉన్నంత కాలం మన సంస్కృతి బతికి ఉంటుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.
- కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేదే లక్ష్యం
- జిల్లా స్థాయి బతుకమ్మ సంబరాల్లో మంత్రి సీతక్క
కరీంనగర్ కల్చరల్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): సృష్టి ఉన్నంత కాలం మన సంస్కృతి బతికి ఉంటుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. బుధవారం కరీంనగర్ ఫూలే మైదానంలో మున్సిపల్ కార్పొరేషన్, మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి బతుకమ్మ సంబరాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలనేదే సీఎం రేవంత్ లక్ష్యమన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే సంకల్పంతో సీఎం ముందుకు పోతున్నారన్నారు. ఆడబిడ్డలు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని అమ్మవారిని వేడుకుంటున్నానని తెలిపారు. 39 మంది ట్రాన్స్ జెండర్లకు ట్రాఫిక్ సహాయకులుగా సీఎం ఉపాధి కల్పించారని, వారికి మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళల సంక్షేమం కోసం సీఎం కృషి చేస్తున్నారని అన్నారు. పర్యాటక శాఖ తరపున బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వేడుకలను ఘనంగా జరుపుకునేలా చూడాలని అన్ని జిల్లాల యంత్రాంగానికి ఆదేశాలిచ్చామన్నారు. ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడంలో మహిళలు తమ వంతు సహకారాన్నందించాలని కోరారు. అనంతరం మంత్రి సీతక్క, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద, మహిళా కో ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్ పర్సన్ బండ్రు శోభారాణి, కలెక్టర్ పమేలాసత్పతి, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాఖడే, లక్ష్మికిరణ్ మహిళలతో కలసి బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. మరో వైపు వివిధ ప్రాంతాల నుంచి మహిళలు రంగురంగుల వైవిద్యభరిత బతుకమ్మలను తీసుకవచ్చి ఆడి పాడారు. సాంస్కృతిక సారథి కళాకారుల పాటలు అలరించాయి. కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్‌దేశాయ్, సీపీ గౌస్ ఆలం, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్ పాల్గొన్నారు.