Karimnagar: ఆకాశం వైపు అన్నదాత చూపు
ABN , Publish Date - Jun 21 , 2025 | 12:05 AM
హుజూరాబాద్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): రుతుపవనాలు ముందే రావడంతో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. దీంతో రైతులు దుక్కులు దున్ని విత్తనాలు విత్తేందుకు సిద్ధం చేసుకున్నారు.
మొలకెత్తని పత్తి, మొక్కజొన్న విత్తనాలు
కాపాడుకునేందుకు రైతుల పాట్లు
హుజూరాబాద్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): రుతుపవనాలు ముందే రావడంతో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. దీంతో రైతులు దుక్కులు దున్ని విత్తనాలు విత్తేందుకు సిద్ధం చేసుకున్నారు. గత 12 రోజుల క్రితం ఓ మోస్తరు వర్షం కురిసింది. ఇక వర్షాలు కురుస్తాయనే ఆశతో విత్తనాలు విత్తారు. ప్రస్తుతం ఎండలు దంచి కొడుతుండడంతో పత్తి, మొక్కజొన్న విత్తనాలు మొలకెత్తక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తొలకరి వర్షాలు కురియడంతో పత్తి, మొక్కజొన్న విత్తనాలు నాటిన రైతులు, తర్వాత వరుణుడు ముఖం చాటేయడంతో మొలకలు కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. మృగశిల కార్తీ ప్రారంభమై పది రోజులు దాటినా వర్షాలు పడకపోవడంతో ఆకాశం వైపు చూస్తున్నారు. కొన్ని గ్రామాల్లో వర్షాలు కురియాలని కప్పతల్లి ఆటలు ఆడుతున్నారు. వానాకాలంలో సుమారు 12 రోజుల క్రితం కురిసిన వర్షాలకు డివిజన్‌లోని జమ్మికుంట, హుజూరాబాద్, ఇల్లందకుంట, వీణవంక, సైదాపూర్, శంకరపట్నం మండలాల్లో సుమారు 1.20లక్షల ఎకరాల్లో సాగు భూమి ఉండగా, అందులో 25వేల ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న, ఇతర పంటలకు రైతులు దుక్కులు దున్ని విత్తనాలు నాటారు.
ఫ ఎండలకు మాడిపోతున్న మొలకలు
విత్తనాలు నాటిన దగ్గర నుంచి నేటి వరకు వర్షాలు కురియకపోవడంతో విత్తనాలు మొలకెత్తడం లేదు. మొలకెత్తిన విత్తనాలు ఎండలకు మాడిపోతున్నాయి. దీంతో పత్తి, మొక్కజొన్న విత్తనాలు కాపాడుకునేందుకు రైతులు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. బావుల్లో ఉన్న నీటితో స్పింక్లర్లు ఏర్పాటు చేసి మొక్కలకు నీరు అందిస్తున్నారు. మరికొంత మంది రైతులు నీళ్లు పారిస్తున్నారు. వ్యవసాయ బావుల్లో సైతం నీరు లేదు. వర్షాలు కురిస్తేనే భూగర్భ జలాలు పెరిగి బావుల్లో నీటి మట్టం పెరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం క్వింటాల్ పత్తికి రూ. 700 వరకు ధర పెంచడంతో రైతులు పత్తి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ముందుగా సాగు పనులు మొదలు పెడుదామని ఆశించిన రైతులకు వర్షాలు లేక విత్తనాలు మొలవక నిరాశే మిగిలింది.
ఫ తొందరపడి విత్తనాలు నాటవద్దు
- సునీత, ఏడీఏ, హుజూరాబాద్
రైతులు తొందరపడి పత్తి విత్తనాలు నాటవద్దు. భూమిలో ఇంకా ఉష్ణోగ్రతలు తగ్గలేదు. పూర్తిస్థాయిలో వర్షాలు కురవకపోవడంతో విత్తనాలు మొలకెత్తడం లేదు. దీంతో పత్తి, మొక్కజొన్న రైతులు విత్తనాలు నాటితే ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. వర్షాలు సమృద్ధిగా కురిసిన తర్వాతనే విత్తనాలు నాటాలి.