Karimnagar: అంబికా... సెలవిక..
ABN , Publish Date - Oct 03 , 2025 | 11:53 PM
కరీంనగర్ కల్చరల్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): శరన్నవరాత్ర్యుత్సవాల సందర్భంగా పలు చోట్ల మంట పాలు, వివిధ ఆలయాల్లో నెలకొల్పిన దుర్గామాత విగ్రహాల నిమజ్జన శోభాయాత్రలు శుక్రవారం నేత్రపర్వంగా కొనసాగాయి.
ప్రత్యేక అలంకరణలో టవర్‌సర్కిల్ దుర్గామాత
- నేత్రపర్వంగా దుర్గామాత నిమజ్జన శోభాయాత్రలు
కరీంనగర్ కల్చరల్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): శరన్నవరాత్ర్యుత్సవాల సందర్భంగా పలు చోట్ల మంట పాలు, వివిధ ఆలయాల్లో నెలకొల్పిన దుర్గామాత విగ్రహాల నిమజ్జన శోభాయాత్రలు శుక్రవారం నేత్రపర్వంగా కొనసాగాయి. ఉత్సవ కమిటీ నిర్వాహకులు, కార్యకర్తలు, భక్తులు, భవానీ దీక్షాపరులు అమ్మవారి మూర్తులను వివిధ వాహనాల్లో మానకొండూరు, మాండవ్యనది, మానేరు, కొత్తపల్లి, చింతకుంట చెరువులకు తరలించారు. కాషాయ ధ్వజాలు, టపాసుల మోతలు, భజనలు, భక్తి పాటలు, మేళతాళాలతో సందడి నెలకొంది. టవర్ వద్ద వేడుకలు మిన్నంటాయి. టవర్‌సర్కిల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాహనాన్ని పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించి అమ్మవారిని నిలిపారు. యువత, చిన్నారులు, వ్యాపారులు భారీ కాషాయ ధ్వజాలు చేతబూని, కేరింతలు, ఈలలు కొడుతూ నృత్యాలు చేస్తూ ముందుకు సాగారు. రాజీవ్‌చౌక్, పోస్టాఫీస్ చౌరస్తా, టవర్, కమాన్ ద్వారా విగ్రహాన్ని మానకొండూరు చెరువుకు తరలించారు.
ఫ భారీ బందోబస్తు
నిమజ్జన వేడుకలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజీవ్‌చౌక్, పాతబజార్, మంకమ్మతోట, మంచిర్యాలచౌరస్తా వంటి ప్రాంతాల్లో పోలీసు పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. పోలీసు అధికారులు, అన్ని విభాగాల పోలీసులు భద్రతను పర్యవేక్షించారు.