Karimnagar: పూర్వ విద్యార్థుల ఉన్నతికి శ్రీకారం
ABN , Publish Date - Jun 09 , 2025 | 12:24 AM
చొప్పదండి, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో చదివిన పూర్వ విద్యార్థులకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను ప్రకటించింది.
2- రుక్మాపూర్ గురుకుల సైనిక్ స్కూల్
- గురుకులాల్లో నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ
- ఉపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యం
చొప్పదండి, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో చదివిన పూర్వ విద్యార్థులకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను ప్రకటించింది. గురుకుల కళాశాలల్లో చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న పూర్వ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణను ఇచ్చి ఉపాధి కల్పించేందుకు గురుకుల సొసైటీ శ్రీకారం చుట్టింది. 10 వేల మంది పూర్వ విద్యార్థులు నిరుద్యోగులుగా ఉన్నట్లు గుర్తించి వారందరికి ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణను ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఫ దరఖాస్తుల ఆహ్వానం...
గురుకుల కళాశాలల్లో చదివిన విద్యార్థుల నుంచి సొసైటీ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 19 నుంచి 25 ఏళ్లలోపు పూర్వ విద్యార్థులు తాము చదివిన కళాశాలల్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ నెలలో నైపుణ్యాభివృద్ధి శిక్షణను ఇచ్చేందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేసింది. శిక్షణ కాలంలో యువతకు ఉచిత భోజనం, వసతి సౌకర్యాలను కల్పిస్తారు. శాస్త్ర, సాంకేతిక, డిజిటల్, మేనేజ్‌మెంట్ కోర్సుల్లో శిక్షణను అందిస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగావకాశాలను ఉన్నతి ఫౌండేషన్ కల్పిస్తుంది. నిరుద్యోగ యువత ఉపాధి పొందేందుకు ఇది సరైన అవకాశంగా అధికారులు చెబుతున్నారు.
ఫ వృత్తి నైపుణ్య శిక్షణ...
తమ కళాశాలల్లో చదివిన పూర్వ విద్యార్థుల వివరాల సేకరణ పనిలో గురుకుల అధికారులు నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం వారు ఎక్కడ ఉన్నారు. ఎక్కడై పని చేస్తున్నారా, లేక నిరుద్యోగ యువతగా ఉన్నారో అన్న వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. జూన్ నెలాఖరులో శిక్షణను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా ఆసక్తి ఉన్న పూర్వ విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా ప్రచారం చేస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ గురుకుల కళాశాలల్లో చదివిన పూర్వ విద్యార్థులకు మంచి అవకాశం. శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. విద్యార్థులకు వృత్తి నైపుణ్య శిక్షణను ఇచ్చి ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపడుతారు. దరఖాస్తుల ప్రక్రియ పూర్తయిన తర్వాత శిక్షణకు సంబంధించిన పూర్తి కార్యాచరణను ప్రకటిస్తామని అధికారులు చెబుతున్నారు. పూర్వ విద్యార్థులు శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలని, శిక్షణ అనంతరం ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రుక్మాపూర్ గురుకుల సైనిక్ స్కూల్ ప్రిన్సిపాల్ తెలిపారు.