karimnagar : ‘అడ్లూరి’కి అమాత్య పదవి
ABN , Publish Date - Jun 09 , 2025 | 12:32 AM
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్) రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి జిల్లాకు మూడో మంత్రి పదవి దక్కింది. ధర్మపురి శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను మంత్రి పదవి వరించింది.
- నిరాశలో ‘కవ్వంపల్లి’ శిబిరం
- ఉమ్మడి జిల్లా నుంచి మూడో మంత్రి
- ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏడాదిన్నరలో ఎమ్మెల్యే, విప్, మంత్రి
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి జిల్లాకు మూడో మంత్రి పదవి దక్కింది. ధర్మపురి శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను మంత్రి పదవి వరించింది. మంత్రివర్గ విస్తరణ అంశం చర్చకు రాగానే మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ధర్మపురి శాసనసభ్యుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పేర్లు తెరపైకి వచ్చాయి. చివరి నిమిషం వరకు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకే అవకాశం దక్కుతుందని భావించినా గవర్నర్‌కు మంత్రుల జాబితా వెళ్లే దశలో లక్ష్మణ్‌కుమార్ పేరు దానిలో చోటు చేసుకున్నది. దీంతో మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచిన లక్ష్మణ్‌కుమార్ రాష్ట్ర కేబినేట్‌లో మంత్రి పదవిని చేపట్టారు.
ఫ పార్టీకి విధేయుడు
ఐదుసార్లు అసెంబ్లీకి పోటీచేసిన విజయం సాధించలేకపోయిన ఆయన మొదటిసారి గెలిచి 18 నెలల కాలంలో అటు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్‌గా, మంత్రిగా ఎదుగుతూ వచ్చారు. మంత్రి పదవి వచ్చినట్లే వచ్చి చేజారిపోవడంతో కవ్వంపల్లి సత్యనారాయణ, ఆయన వర్గీయులు తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారు. ఎన్‌ఎస్‌యూఐ సభ్యుడిగా విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి వచ్చిన లక్ష్మణ్‌కుమార్ నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌ను వీడకుండా పార్టీకి విధేయుడిగా ఉంటూ వస్తున్న నేపథ్యంలోనే ఆయనకు మంత్రి పదవి దక్కిందని భావిస్తున్నారు. చెన్నూరు శాసనసభ్యుడు డాక్టర్ వివేక్ వెంకటస్వామికి(మాల) మంత్రి పదవి ఖరారు కాగానే మాదిగ సామాజికవర్గం నుంచి మరొకరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనుకున్నారు. అప్పుడు కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పేర్లు పరిశీలనకు వచ్చాయి. సుదీర్ఘకాలంగా పార్టీనే నమ్ముకుని ఉన్న లక్ష్మణ్‌కుమార్‌కు అవకాశం కల్పించినట్లు చెబుతున్నారు.
ఫ కార్మిక క్షేత్రం నుంచి రాజకీయాల్లోకి..
గోదావరిఖని కార్మిక క్షేత్రం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన లక్ష్మణ్ కుమార్ అక్కడి జూనియర్ కాలేజ్ ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా, ఎన్‌ఎస్‌యూఐ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. మేడారం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1999లో పోటీ చేసి మాతంగి నర్సయ్యపై ఓడిపోయారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరిగి ధర్మపురి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత తన నియోజకవర్గాన్ని మార్చుకుని 2009 ఎన్నికల్లో, 2010 ఉప ఎన్నికలో ఆ తర్వాత 2014, 2018లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి పరాజయం పాలయ్యారు. ఐదుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా పట్టువదలని విక్రమార్కుడిలా 2023లో మళ్లీ ధర్మపురి నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఈ విజయం ఆయనకు విప్ పదవిని, ఆ తర్వాత మంత్రి పదవిని తెచ్చింది. 2006లో అడ్లూరి ధర్మారం మండల జడ్పీటీసీగా పోటీచేసి గెలిచారు. జడ్పీ చైర్మన్‌గా ఉన్న ఆరెపల్లి మోహన్ 2009 ఎన్నికల్లో మానకొండూర్ ఎమ్మెల్యేగా గెలుపొందగా కొద్ది రోజులపాటు వైస్ చైర్మన్ చైర్మన్ పదవి నిర్వహించారు. ఆ తర్వాత అడ్లూరి చైర్మన్ పదవిని చేపట్టి రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగారు. కొంతకాలం ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచినా 1982 నుంచి ఆయన విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉంటూ వచ్చి అటు రామగుండం, ఇటు ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృత సంబంధాలను నెలకొల్పుకున్నారు. ఆ సంబంధాలే ఆయనను క్యాబినేట్‌కు పంపించాయి.
ఫ ఉమ్మడి జిల్లాకు మూడు మంత్రి పదవులు...
రాష్ట్ర కేబినెట్‌లో 15 మంది మంత్రులు ఉండగా అందులో ముగ్గురు ఉమ్మడి జిల్లాకు చెందినవారే కావడం విశేషం. రాష్ట్ర మంత్రి వర్గంలో ఇప్పటికే మంథని శాసనసభ్యుడు డి శ్రీధర్‌బాబు ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రిగా, హుస్నాబాద్ శాసనసభ్యుడు పొన్నం ప్రభాకర్ బీసీ, రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తుండగా మూడవ మంత్రిగా అడ్లూరి చేరిపోయారు. పెద్దపల్లి జిల్లా నుంచి శ్రీధర్‌బాబు, జగిత్యాల జిల్లా నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కరీంనగర్ జిల్లా నుంచి పొన్నం ప్రభాకర్ మంత్రులుగా ఉండగా రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కూడా విప్ బాధ్యతల్లో ఉన్నారు. ఈ బాధ్యత నుంచి ఆయనను తప్పించి డాక్టర్ కవ్వంపల్లికి విప్ పదవి ఇచ్చే అవకాశాలున్నాయని చర్చ జరుగుతోంది.