Karimnagar: పేరుకుపోతున్న విద్యుత్ బకాయిలు
ABN , Publish Date - Dec 14 , 2025 | 12:18 AM
గణేశ్‌నగర్, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ శాఖకు ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు గుదిబండగా మారాయి.
- ప్రభుత్వ రంగ సంస్థలు చెల్లించాల్సింది రూ. 3,599 కోట్లు
- ప్రతీ నెల చెల్లించే విధానం తేవాలంటున్న విద్యుత్ శాఖ
గణేశ్‌నగర్, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ శాఖకు ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు గుదిబండగా మారాయి. గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు, రెవెన్యూ శాఖ, హెల్త్ డిపార్ట్‌మెంట్, పోలీస్‌శాఖ బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. జిల్లాలో వివిధ శాఖల నుంచి 3,599 కోట్ల రూపాయల బకాయిలు విద్యుత్ శాఖకు రావాల్సి ఉంది. మున్సిపాలిటీలు 8.61 కోట్లు, నీటిపారుదల, మిషన్ భగీరథ శాఖలు 3,460 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. మిగతా శాఖల నుంచి 130.39 కోట్ల రూపాయల వరకు బకాయిలు రావాల్సి ఉంది. ఈ బకాయిలను దశలవారీగానైనా చెల్లించాలని శాఖ అధిపతులను విద్యుత్ అధికారులు కోరుతున్నారు. ఈ బకాయిలు సంస్థకు భారంగా మారాయి. ఆయా శాఖల్లో సంబంధిత పద్దు కింద నిధులు విడుదలైతే తప్ప బిల్లులు చెల్లించే పరిస్థితి ఉండదు. ప్రభుత్వ కార్యాలయాలు కావడంతో నోటీసులివ్వడం తప్ప డిస్కనెక్ట్ చేయలేని పరిస్థితి. గృహ వినియోగదారులు, వాణిజ్య, పారిశ్రామిక, ఇతర వినియోగదారులకు వర్తింపజేసినంత కఠినంగా బిల్లుల చెల్లింపునకు ఈ శాఖలపై ఒత్తిడి చేయలేని పరిస్థితి ఉంది.
ఫ పాలకవర్గాలు లేకపోవడమూ కారణం
స్థానిక సంస్థలైన పంచాయతీలు, మునిసిపాలిటీల బకాయిలు భారీ ఎత్తున ఉన్నాయి. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలకు సంబంధించిన కార్యాలయాలు, తాగునీటి పథకాలు, వీధిదీపాల నిర్వహణకు విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ సంస్థల పద్దుల కింద కనెక్షన్లకు విద్యుత్ బిల్లులు భారీగా వస్తున్నాయి. గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, కేంద్ర ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి. ఫలితంగా ఈ సంస్థల విద్యుత్ బిల్లుల చెల్లింపు సామర్థ్యం తగ్గింది. గ్రామ పంచాయతీలతో పోల్చితే మునిసిపాలిటీలకు ఆస్తి, ఇంటి పన్నుల వసూళ్లతో కొంత రెవెన్యూ వస్తుండగా వాటిని అత్యవసర పనులకు వినియోగిస్తున్నారు. దీంతో విద్యుత్ బిల్లులు పెండింగ్‌లో పడిపోతున్నాయి. మునిసిపాలిటీలకు ప్రతి నెలా సగటున లక్షల్లో విద్యుత్ బిల్లులు వస్తుంటే, విద్యుత్ సంస్థకు చెల్లించేది తక్కువే ఉంటోంది. గ్రామ పంచాయతీలకు నెలనెలా సుమారు 3.61 కోట్ల వరకు బిల్లులు వస్తుంటే, అందులో కేవలం రెండు మూడు లక్షల వరకే చెల్లిస్తున్నారు. మిగిలిన బిల్లులు పెండింగ్‌లో ఉంటున్నాయి.
ఫ బిల్లులు చెల్లించి సహకరించండి
- మేక రమేష్‌బాబు, టీజీ ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ
జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ శాఖల్లో విద్యుత్ బిల్లులు కోట్లలో పెండింగ్ ఉన్నాయి. అధికారులు స్పందించి వెంటనే పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించి సంస్థకు సహకరించగలరని, విద్యుత్ సంస్థను కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉంది. ప్రభుత్వ శాఖలు గుర్తిస్తే బాగుంటుంది. సకాలంలో బిల్లులు చెల్లిస్తేనే నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా సాధ్యమవుతుంది.